Sunday, August 18, 2019

Two Nigerians held for duping Chandigarh woman of Rs 44 lakh


మహిళకు రూ.44 లక్షల టోకరా: ఇద్దరు నైజీరియన్ల అరెస్ట్
ఫేస్ బుక్ చాటింగ్ తో మహిళ నుంచి రూ.44 లక్షలు కాజేసిన ఇద్దరు నైజీరియా ఘరానాలను పోలీసులు కటకటాల వెనక్కి నెట్టారు. చండీగఢ్ సమీపంలో రాజ్‌నంద్ గావ్‌కు చెందిన మహిళను బురిడీ కొట్టించిన నిందితులు కిబీ స్టాన్లీ ఓక్వో (28), న్వాకోర్ (29)లను రాజధాని ఢిల్లీలోని చాణక్య ప్లేస్ లో పోలీసులు వలపన్ని పట్టుకున్నారు. బాధిత మహిళ ఫిర్యాదు మేరకు సుమారు 8 నెలల పాటు దర్యాప్తు నిర్వహించిన రాజ్‌నందగావ్ పోలీసులు ఢిల్లీలో నిందితుల ఆచూకీ కనుగొని శుక్రవారం చాకచక్యంగా పట్టుకున్నారు.  ప్రత్యేక బృందం ఇద్దరు నిందితుల్నీఅరెస్టు చేసినట్లు రాజ్‌నందగావ్ పోలీసు సూపరింటెండెంట్ కమ్లోచన్ కశ్యప్ తెలిపారు. ఢిల్లీ నుంచి వీరిని ట్రాన్సిట్ రిమాండ్లో ఆదివారం రాజానందగావ్ కు తీసుకువచ్చారు. ఈ కేసు ఫిర్యాదు గత ఏడాది డిసెంబర్‌లో నమోదైంది. స్టేషన్ పారాకు చెందిన బాధితురాలు తన భర్త పేరిట ఫేస్‌బుక్ ఖాతా నిర్వహిస్తోంది. ఫేస్‌బుక్‌లో డేవిడ్ సూర్యన్ అనే యూజర్ నుంచి గత ఏడాది జులైలో ఆమె తనకు వచ్చిన ఫ్రెండ్ రిక్వెస్ట్ ను అంగీకరించింది. అతను లండన్ లో ఓ షిప్ కెప్టెన్ గా పని చేస్తున్నట్లు పేర్కొని చాటింగ్ కొనసాగించాడు. కొన్ని రోజుల తర్వాత ఆమెకు ల్యాప్‌టాప్, మొబైల్, డైమండ్ ఆభరణాలు, ఇతర విలువైన వస్తువుల్ని ప్రత్యేక బహుమతులుగా పంపుతున్నట్లు అబద్ధాలు వల్లించాడు.  ఆ తర్వాత ఢిల్లీలోని కస్టమ్స్ ఆఫీసర్ నంటూ మరో నిందితుడు నమ్మబలుకుతూ ఆమెకు ఫోన్ కాల్ చేశాడు. బహుమతుల్ని స్వీకరించడానికి కస్టమ్స్ డ్యూటీగా సుమారు రూ.62,500 చెల్లించాలని కోరాడు. బాధితురాలు ఆ డబ్బు ఆన్ లైన్ అకౌంట్ ద్వారా చెల్లించింది. బహుమతుల క్లియరెన్స్ కోసం సర్వీస్,డాక్యుమెంట్,ప్రాసెసింగ్ ఛార్జ్, ఆదాయపు పన్ను తదితరాలకు డబ్బు చెల్లించాలంటూ ఆమెకు వేర్వేరు ఫోన్ నంబర్ల నుంచి కాల్స్, మెయిల్స్ వచ్చాయి. దాంతో బాధితురాలు గత ఏడాది జులై-నవంబర్ మధ్య రూ.44 లక్షలు చెల్లించింది. అయితే ఆ తర్వాత ఆమెకు ఏ బహుమతులు అందకపోవడంతో మోసపోయినట్లు గ్రహించి డిసెంబర్ 1 న కొత్వాలి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో నిందితుల కోసం పోలీసుల వేట మొదలైంది. నిందితులు ఉపయోగించిన డబ్బు, మొబైల్ నంబర్లు, ఇ-మెయిల్ ఐడీ, బాధితురాలు బదిలీ చేసిన సొమ్ము జమ అయిన బ్యాంకు ఖాతాల వివరాలను పోలీసులు ఒక్కొక్కటిగా గుర్తిస్తూ కేసు చిక్కుముడిని విప్పారు. చివరకు దర్యాప్తులో నిందితుల స్థావరం ఢిల్లీ సమీపంలో ఉన్నట్లు కనుగొన్నారు. ప్రత్యేక బృందం మెరుపుదాడి చేసి నిందితులిద్దర్నీ పట్టుకుని వారి వద్ద నుంచి ల్యాప్‌టాప్, మొబైల్ ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. వారిపై ఐపీసీ సెక్షన్లు 420 (చీటింగ్), 34 (ఉమ్మడి ఉద్దేశం) 66 డి (కంప్యూటర్ ద్వారా మారు వేషంలో మోసం) కింద పోలీసులు కేసులు నమోదు చేశారు.

Saturday, August 17, 2019

PM Modi in Bhutan: RuPay card launched, 9 MOUs exchanged

భూటాన్ లో రూపే కార్డు సేవల్ని ప్రారంభించిన ప్రధాని మోది

భారత ప్రధాని నరేంద్ర మోది భూటాన్ లో శనివారం రూపే కార్డు సేవల్ని ప్రారంభించారు. మోది ఆ దేశ ప్రధాని డాక్టర్ లోటే షెరింగ్ తదితరులతో కలిసి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రధాని మోదీ భూటాన్ పర్యటన సందర్భంగా ఇరు దేశాల మధ్య   విద్య, శాస్త్ర, సాంకేతిక రంగాలకు సంబంధించి తొమ్మిది అవగాహనా ఒప్పందాలపై సంతకాలు జరిగాయి. మాంగేదాచులో జలవిద్యుత్ కేంద్రాన్నీ ప్రధాని ప్రారంభించారు. అనంతరం థింపులో ఇస్రో ఎర్త్ స్టేషన్ నూ మోది ఆరంభించారు. హిమాలయ సానువుల రాజ్యంలో రూపే సేవలు ప్రారంభమవ్వడం పట్ల మోది సంతోషం వ్యక్తం చేశారు. `రూపే కార్డు సేవలు ఆరంభించడం నాకు చాలా ఆనందంగా ఉంది` అని ప్రధాని ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. గత మే లో ఆయన సింగపూర్ లోనూ ఈ కార్డును ప్రారంభించారు. దాంతో ఉభయదేశాల ప్రజలు డిజిటల్ వాలెట్ (పరస్పర నగదు మార్పిడి ఆమోదం) సేవల్ని వినియోగించే అవకాశం కల్గింది. తాజాగా భారత్ రూపే కార్డు డిజిటల్ సేవలు అమలవుతున్న రెండో దేశంగా భూటాన్ నిలుస్తోంది. మార్చి నుంచే భూటాన్ లో ఈ కార్డు సేవల వినియోగాన్ని ప్రయోగాత్మకంగా ప్రారంభించారు. తద్వారా భారత్ భూటాన్ ల మధ్య వాణిజ్యం, పర్యాటక రంగాల్లో ఇతోధిక పురోగతిని ఆశిస్తున్నారు. సింగపూర్ లో భారత ప్రభుత్వ ఆధ్వర్యంలోని నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్.పి.సి.ఐ) ద్వారా డిజిటల్ కార్యకలాపాలు కొనసాగుతున్నాయి. అదే విధంగా భారత్ లో ఈ రూపే కార్డు ద్వారా రిటైల్ చెల్లింపులు జరుగుతున్నాయి. ఎలక్ట్రానిక్ మనీ ట్రాన్స్ ఫర్ సేవల గొడుగులా ఎన్.పి.సి.ఐ. పనిచేస్తోంది. రూపే కార్డులు మరికొన్ని దేశాల్లోనూ అమలులో ఉన్నాయి.

Friday, August 16, 2019

UNSC to discuss Kashmir issue on China`s request


ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో కశ్మీర్ పై చర్చ !
నాలుగు దశాబ్దాల అనంతరం కశ్మీర్ పై ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో కీలక చర్చ జరగనున్నట్లు తెలుస్తోంది. చైనా ఈ మేరకు భద్రతా మండలికి లేఖ రాయడంతో సుదీర్ఘకాలం అనంతరం కశ్మీర్ అంశం అంతర్జాతీయ వేదికపై చర్చకు రానుంది. ఈ చర్చలో పాకిస్థాన్ పాల్గొనే అవకాశమున్నట్లు సమాచారం. అయితే ఈ చర్చను రహస్యంగా సాగించనున్నట్లు యూఎన్ఎస్సీ కార్యాలయ వర్గాలు పేర్కొన్నాయి. భద్రతా మండలి అధ్యక్షుడు జోన్నా రొనెకా(పోలెండ్) ఈ రహస్య కీలక చర్చ చేపట్టే వేదిక, తేదీని నిర్ణయించనున్నారు. భారత అంతర్గత భూభాగమైన జమ్ముకశ్మీర్ లో 370-ఎ (స్వయంప్రతిపత్తి) అధికరణం రద్దు, రాష్ట్ర విభజన చేపట్టిన నేపథ్యంలో ఈ అంశం మళ్లీ యూఎన్ఎస్సీ వేదిక పైకి వచ్చింది. పాకిస్థాన్ అభ్యర్థన మేరకు భద్రతామండలిలో శాశ్వత సభ్య దేశమైన చైనా ఇందుకు సంబంధించి పావులు కదిపింది. కశ్మీర్ అంశంలో భారత్ వైఖరిని చైనా మినహా యూఎన్ఎస్సీలో మిగిలిన నాలుగు శాశ్వత సభ్యదేశాలు రష్యా, అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్ సమర్ధించాయి. కశ్మీర్ భారత అంతర్గత విషయమని ఆ వివాదాన్ని భారత్, పాక్ ద్వైపాక్షిక చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని కోరాయి. బుధవారం (ఆగస్ట్14) నాడు భద్రతా మండలిలో సిరియా, మధ్య ఆఫ్రికాల అంశం చర్చకు వచ్చింది. అయితే అదే సమయంలో కశ్మీర్ అంశంపై చర్చ జరపాలంటూ చైనా లేఖ ఇచ్చింది. చైనా ఈ మేరకు పట్టుబట్టగా ఫ్రాన్స్ ఈ అంశంపై కింది స్థాయిలో (ద్వైపాక్షిక) చర్చలు జరిగితే చాలని అభిప్రాయం వ్యక్తం చేసినట్లు తెలిసింది.
కశ్మీర్ అంశంపై భద్రతా మండలిలో చివరిసారిగా 48 ఏళ్ల క్రితం చర్చ జరిగింది. 1971లో అప్పటి తూర్పు పాకిస్తాన్ (బంగ్లాదేశ్) వాసులు పాకిస్థాన్ అరాచక పాలనకు తాళలేక వేలసంఖ్యలో శరణార్థులుగా సరిహద్దులు దాటి భారత్ లోకి చొచ్చుకు వచ్చారు. మరో వైపు పాకిస్థాన్ కవ్వింపు చర్యలకు దిగి భారత్ భూభాగంపై మోర్టార్ దాడులకు తెగబడింది. ఈ నేపథ్యంలో తూర్పు పాకిస్థాన్ స్వేచ్ఛ, స్వాతంత్ర్యాలకు భారత్ అండగా నిలవాల్సి వచ్చింది. శరణార్థుల సమస్యను పరిష్కరించేందుకు భారత్ చొరవ తీసుకుంటుండగా పాకిస్థాన్ యుద్ధానికి తొడగొట్టి పరాజయం పాలైంది. అమేయ భారత సైన్యం శక్తియుక్తులకు పాకిస్థాన్ తోకముడిచింది. అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ ప్రదర్శించిన ధైర్య సాహసాల వల్లే స్వతంత్ర బంగ్లాదేశ్ ఏర్పడింది. బీజేపీ దివంగత అగ్రనేత వాజ్ పేయి సైతం నాడు ఇందిరను అపర కాళికామాతగా ప్రశంసించారు. ఆనాడు ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో భారత్-పాకిస్థాన్ యుద్ధం, కశ్మీర్ అంశం చర్చకు వచ్చాయి.

Thursday, August 15, 2019

Phone tapping: Cong demands probe as ruling BJP steps up



కర్ణాటకలో మళ్లీ ఫోన్ల ట్యాపింగ్ రగడ
కర్ణాటక మరో వివాదానికి వేదికయింది. తాజాగా కాంగ్రెస్ నేతలు తమ ఫోన్లు ట్యాప్ అయినట్లు ఆరోపించారు. ముఖ్యమంత్రి కుమారస్వామి సంకీర్ణ ప్రభుత్వ హయాంలో తమ ఫోన్ల ట్యాపింగ్ జరిగినట్లు కాంగ్రెస్ నాయకులు తాజా వివాదానికి తెరతీశారు. ప్రస్తుత సీఎం బి.ఎస్.యడ్యూరప్ప కాంగ్రెస్ నేతల ఆరోపణలకు స్పందిస్తూ విచారణకు ఆదేశాలిచ్చారు. కాంగ్రెస్ నేతలతో పాటు సీనియర్ పోలీసు అధికారుల ఫోన్లు ట్యాపింగ్ కు గురైనట్లు ఆరోపణలు గుప్పుమంటున్నాయి. కేంద్ర రసాయనాలు, ఎరువుల శాఖ మంత్రి డి.ఎస్.సదానంద గౌడ విలేకర్లతో మాట్లాడుతూ అనధికారికంగా ఫోన్లను ట్యాప్ చేయడం క్రిమినల్ నేరంగా పేర్కొన్నారు. సమగ్ర విచారణతో ట్యాపింగ్ దోషుల్ని పట్టుకుని శిక్షించడం జరుగుతుందన్నారు. సదానంద గౌడ స్వల్ప కాలం రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేశారు. బెంగళూర్ ఉత్తర లోక్ సభ నియోజకవర్గం నుంచి ప్రస్తుతం ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్నారు. నగర అసెంబ్లీ, పార్లమెంటరీ నియోజకవర్గ ప్రజాప్రతినిధులతో సీఎం యడ్యూరప్ప నిర్వహించిన సమావేశంలో పాల్గొన్న అనంతరం ఆయన విలేకర్లతో మాట్లాడారు. సీఎంగా కుమారస్వామి పదవిలో ఉన్నప్పుడు నగరానికి కొత్త కమిషనర్ గా భాస్కర్ రావు నియమితులు కానున్నారంటూ ముందుగానే మీడియాకు విడుదలయిన ఆడియో టేప్ తాజా టెలిఫోన్ ట్యాపింగ్ ఉదంతానికి కేంద్రబిందువయింది. కమిషనర్ తో పాటు ఇద్దరు ఐ.పి.ఎస్ ఆఫీసర్ల టెలిఫోన్లు ట్యాపింగ్ గురైనట్లు తెలుస్తోంది. ట్యాపింగ్ ఉదంతంపై జాయింట్ కమిషనర్ ఆఫ్ పోలీస్(క్రైం) ఇచ్చిన మధ్యంతర నివేదిక ప్రకారం రాష్ట్రంలో లోక్ సభ ఎన్నికలు (ఏప్రిల్ 18,23) ముగిశాక మే,జూన్ ల్లో మొత్తం మూడుసార్లు భాస్కర్ రావు ఫోన్ ట్యాపింగ్ గురైనట్లు బట్టబయలయింది. కొత్త సీఎం యడ్యూరప్ప బెంగళూర్ సిటీ పోలీస్ కమిషనర్ గా అలోక్ కుమార్ సింగ్ (1994 బ్యాచ్) స్థానంలో భాస్కర్ రావు(1990 బ్యాచ్)ను ఆగస్ట్ 2న నియమించిన సంగతి తెలిసిందే. కమిషనర్ గా బాధ్యతలు చేపట్టడానికి ముందు భాస్కర్ రావు అడిషనల్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్(ఏడీజీపీ) హోదాలో కర్ణాటక స్టేట్ రిజర్వ్ పోలీస్(కె.ఎస్.ఆర్.పి) విధులు నిర్వహిస్తున్నారు. ఆ సమయంలోనే ఆయన ఫోన్ ట్యాపింగ్ గురైనట్లు నిర్ధారణ అయింది. అలోక్ సింగ్ కమిషనర్ గా కనీసం మూడు నెలలు పనిచేయకుండానే కె.ఎస్.ఆర్.పి.కి బదిలీ అయ్యారు. ఇదిలా ఉండగా మాజీ ముఖ్యమంత్రి సీఎల్పీ  నాయకుడు సిద్ధరామయ్య ఫోన్ ట్యాపింగ్ ల వ్యవహారం తనకు తెలియదన్నారు.
1988లో ఇదే తరహా ఫోన్ ట్యాపింగ్ ల వ్యవహారం మెడకు చుట్టుకోవడంతో రాష్ట్ర 10వ ముఖ్యమంత్రి రామకృష్ణ హెగ్డే తన పదవికి రాజీనామా చేశారు. కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చిన ఆయన జనతా పార్టీ లో చేరి ముఖ్యమంత్రి అయ్యారు. 1983 నుంచి 88 వరకు తిరుగులేని నాయకుడిగా రాష్ట్రాన్ని పాలించి చివరకు ఫోన్ల ట్యాపింగ్ వివాదం వల్ల పదవి నుంచి తప్పుకున్నారు.