ఐక్యరాజ్యసమితి
భద్రతా మండలిలో కశ్మీర్ పై చర్చ !
నాలుగు దశాబ్దాల అనంతరం కశ్మీర్ పై ఐక్యరాజ్యసమితి భద్రతా
మండలిలో కీలక చర్చ జరగనున్నట్లు తెలుస్తోంది. చైనా ఈ మేరకు భద్రతా మండలికి లేఖ
రాయడంతో సుదీర్ఘకాలం అనంతరం కశ్మీర్ అంశం అంతర్జాతీయ వేదికపై చర్చకు రానుంది. ఈ
చర్చలో పాకిస్థాన్ పాల్గొనే అవకాశమున్నట్లు సమాచారం. అయితే ఈ చర్చను రహస్యంగా
సాగించనున్నట్లు యూఎన్ఎస్సీ కార్యాలయ వర్గాలు పేర్కొన్నాయి. భద్రతా మండలి
అధ్యక్షుడు జోన్నా రొనెకా(పోలెండ్) ఈ రహస్య కీలక చర్చ చేపట్టే వేదిక, తేదీని
నిర్ణయించనున్నారు. భారత అంతర్గత భూభాగమైన జమ్ముకశ్మీర్ లో 370-ఎ (స్వయంప్రతిపత్తి) అధికరణం రద్దు, రాష్ట్ర విభజన చేపట్టిన
నేపథ్యంలో ఈ అంశం మళ్లీ యూఎన్ఎస్సీ వేదిక పైకి వచ్చింది. పాకిస్థాన్ అభ్యర్థన
మేరకు భద్రతామండలిలో శాశ్వత సభ్య దేశమైన చైనా ఇందుకు సంబంధించి పావులు కదిపింది.
కశ్మీర్ అంశంలో భారత్ వైఖరిని చైనా మినహా యూఎన్ఎస్సీలో మిగిలిన నాలుగు శాశ్వత
సభ్యదేశాలు రష్యా, అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్ సమర్ధించాయి. కశ్మీర్ భారత
అంతర్గత విషయమని ఆ వివాదాన్ని భారత్, పాక్ ద్వైపాక్షిక చర్చల ద్వారా
పరిష్కరించుకోవాలని కోరాయి. బుధవారం (ఆగస్ట్14) నాడు భద్రతా మండలిలో సిరియా, మధ్య
ఆఫ్రికాల అంశం చర్చకు వచ్చింది. అయితే అదే సమయంలో కశ్మీర్ అంశంపై చర్చ జరపాలంటూ చైనా
లేఖ ఇచ్చింది. చైనా ఈ మేరకు పట్టుబట్టగా ఫ్రాన్స్ ఈ అంశంపై కింది స్థాయిలో
(ద్వైపాక్షిక) చర్చలు జరిగితే చాలని అభిప్రాయం వ్యక్తం చేసినట్లు తెలిసింది.
కశ్మీర్ అంశంపై భద్రతా మండలిలో చివరిసారిగా 48 ఏళ్ల క్రితం చర్చ
జరిగింది. 1971లో అప్పటి తూర్పు పాకిస్తాన్ (బంగ్లాదేశ్) వాసులు పాకిస్థాన్ అరాచక పాలనకు
తాళలేక వేలసంఖ్యలో శరణార్థులుగా సరిహద్దులు దాటి భారత్ లోకి చొచ్చుకు వచ్చారు. మరో వైపు పాకిస్థాన్
కవ్వింపు చర్యలకు దిగి భారత్ భూభాగంపై మోర్టార్ దాడులకు తెగబడింది. ఈ నేపథ్యంలో తూర్పు
పాకిస్థాన్ స్వేచ్ఛ, స్వాతంత్ర్యాలకు భారత్ అండగా నిలవాల్సి వచ్చింది. శరణార్థుల సమస్యను
పరిష్కరించేందుకు భారత్ చొరవ తీసుకుంటుండగా పాకిస్థాన్ యుద్ధానికి తొడగొట్టి పరాజయం
పాలైంది. అమేయ భారత సైన్యం శక్తియుక్తులకు పాకిస్థాన్ తోకముడిచింది. అప్పటి ప్రధాని
ఇందిరాగాంధీ ప్రదర్శించిన ధైర్య సాహసాల వల్లే స్వతంత్ర బంగ్లాదేశ్ ఏర్పడింది. బీజేపీ
దివంగత అగ్రనేత వాజ్ పేయి సైతం నాడు ఇందిరను అపర కాళికామాతగా ప్రశంసించారు. ఆనాడు ఐక్యరాజ్యసమితి
భద్రతా మండలిలో భారత్-పాకిస్థాన్ యుద్ధం, కశ్మీర్ అంశం చర్చకు వచ్చాయి.
No comments:
Post a Comment