Sunday, August 11, 2019

Abrogation of 370 is the need of the hour: Vice President venkaiah Naidu


జమ్ముకశ్మీర్ లో 370 అధికరణం రద్దు అనివార్యం: ఉపరాష్ట్రపతి
దేశ భద్రత, సమగ్రతల కోణంలో ప్రస్తుతం జమ్ముకశ్మీర్ లో ఆర్టికల్ 370 రద్దు అత్యవసరమని ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు అన్నారు. ఆదివారం చెన్నైలో ఆయన తన రెండేళ్ల పదవీకాలంపై రచించిన పుస్తక ఆవిష్కరణ కార్యక్రమంలో మాట్లాడారు. 370 అధికరణం రద్దుకు పార్లమెంట్ ఆమోదం లభించినందున ఇప్పుడు ఆ విషయంపై తను స్వేచ్ఛగా మాట్లాడుతున్నానన్నారు. ఈ ఆర్టికల్ రద్దు విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ఓ ప్రొఫెసర్ తనను జమ్ముకశ్మీర్ ను చూశారా? అని ప్రశ్నించినట్లు ఉపరాష్ట్రపతి చెప్పారు. మన ముఖంలో ఉండే రెండు కళ్లు కూడా ఒకదాన్ని మరొకటి చూడలేవు..కానీ ఒక కంటికి బాధ కల్గితే రెండో కంట్లోనూ నీరు ఉబికి వస్తుందని వెంకయ్య అన్నారు. అదే విధంగా భారత జాతి ప్రయోజనాల రీత్యా దేశమంతా ఏకరీతిగా ముందడుగు వేయాలని చెప్పారు. రాష్ట్రాలు, ప్రాంతాలన్న తేడా లేకుండా సంక్షేమ ఫలాలు దేశమంతా అందాలన్నారు. జమ్ముకశ్మీర్ లో జనజీవనాన్ని సాధారణ స్థితికి తీసుకురావడం జరుగుతుందని తెలిపారు. త్వరలో ఆ రాష్ట్రంలో సంక్షేమ పథకాలు అమలై ప్రగతి నెలకొంటుందని చెప్పారు. కార్యక్రమంలో ప్రసంగించిన హోంమంత్రి అమిత్ షా జమ్ముకశ్మీర్ స్వయంప్రతిపత్తి రద్దు వల్ల ఉగ్రవాదం తుడిచిపెట్టుకుపోతుందని చెప్పారు. తమ పార్టీకి రాజ్యసభలో కనీస మెజార్టీ లేదని.. 370 ఆర్టికల్ రద్దు బిల్లును తొలుత ఆ సభలోనే ప్రవేశపెడుతున్నప్పుడు ఆంధ్రప్రదేశ్ విభజన బిల్లు నాటి పరిస్థితులు నెలకొంటాయేమోనన్న చిన్న సందేహం కల్గిందన్నారు. అయితే పెద్దల సభలో బిల్లు సజావుగా ఆమోదం పొందిందని తెలిపారు. కార్యక్రమంలో పాల్గొన్న తమిళ్ సూపర్ స్టార్ రజనీకాంత్, భారత బ్యాడ్మింటన్ చీఫ్ కోచ్ పుల్లెల గోపీచంద్, అపొలో హాస్పిటల్స్ చైర్మన్ పి.సి.రెడ్డి, వ్యవసాయ శాస్త్రవేత్త ఎం.ఎస్.స్వామినాథన్, రాజస్థాన్ విశ్వవిద్యాలయం ఉపకులపతి కె.కస్తూరి రంగన్, వి.ఐ.టి. వ్యవస్థాపకులు, చాన్స్ లర్ జి.విశ్వనాథన్ తదితరులు ఉపరాష్ట్రపతిని ఈ సందర్భంగా అభినందించారు.

Saturday, August 10, 2019

Tens of thousands join Moscow opposition rally after crackdown


నిష్పాక్షిక ఎన్నికల కోసం రష్యాలో కదం తొక్కిన జనం
నిష్పాక్షికంగా స్వేచ్ఛాయుత రీతిలో ఎన్నికలు నిర్వహించాలని కోరుతూ (ఓపెన్ రష్యా మూవ్ మెంట్) రష్యా రాజధాని మాస్కో లో పెద్ద సంఖ్యలో జనం ఆందోళనకు దిగారు. మాస్కో స్క్వేర్ లో శనివారం సుమారు 40 వేల మంది నినాదాలు చేస్తూ ర్యాలీ చేపట్టారు. ప్లకార్డులు ప్రదర్శిస్తూ `పుతిన్ ఇప్పటికీ చెప్పిన అబద్ధాలు చాలించండి..మాకు ఓటు వేసే స్వేచ్ఛ కల్పించండి` అంటూ నినాదాలు చేశారు. దాదాపు 20 ఏళ్లగా అధ్యక్ష, ప్రధాని బాధ్యతలు నిర్వహిస్తూ వస్తున్న 66 ఏళ్ల పుతిన్ నేరుగా ప్రజల నిరసనల్ని ఎదుర్కోవడం ఇదే ప్రథమం. తాజా ర్యాలీలో 20 వేల మంది వరకు హాజరుకావచ్చని పోలీసులు వేసిన అంచనా తప్పింది. 2012లో దేశాధ్యక్షుడిగా వ్లాదిమిర్ పుతిన్ బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి ఇంత పెద్ద సంఖ్యలో ప్రజలు ఆందోళన చేపట్టడం ఇదే ప్రథమం. జులై 21న కూడా మాస్కో స్క్వేర్ లో పెద్ద ఎత్తున జనం ఆందోళనకు దిగారు.16 మంది ఇండిపెండెంట్ అభ్యర్థులు ఈ సందర్భంగా ఓ సంయుక్త ప్రకటన విడుదల చేశారు. మాస్కో మేయర్ సెర్గి సొబ్యానిన్ రాజకీయ వివాదాన్ని రాజేస్తున్నారని ఆరోపించారు. మాస్కోలో గల 1 కోటీ 50 లక్షల మందిని  ఆ వివాదంలోకి లాగుతున్నారన్నారు. ప్రజా పక్షం వహిస్తున్న ప్రతిపక్ష అభ్యర్థుల్ని స్థానిక ఎన్నికల్లో పోటీ చేయడానికి అధికారులు అంగీకరించకపోవడంతో ప్రజలు ఆందోళన చేపట్టారు. దాంతో వందల సంఖ్యలో నిరసనకారుల్ని, ప్రతిపక్ష నాయకుల్ని పోలీసులు నిర్బంధంలోకి తీసుకున్నారు. దేశమే ఒక ఖైదుగా పౌరులు బందీలుగా మారినట్లు ప్రస్తుత పరిణామాలు పరిణమించాయని ఓపెన్ రష్యా ఉద్యమ కర్త డిమిత్రి ఖోబోటోవ్స్కీ ఆగ్రహం వ్యక్తం చేశారు. సుమారు 2 వేల మంది పోలీసుల అదుపులో ఉన్నట్లు తెలుస్తోంది. పోలీసు చర్యల్ని ఖండిస్తూ తాజాగా ఈరోజు మళ్లీ ప్రజలు ఆందోళనకు దిగారు. సెప్టెంబర్ లో సిటీ ఆఫ్ పార్లమెంట్స్ (స్థానిక సంస్థలు) కు ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో పుతిన్ వ్యతిరేకులైన పలువురు ప్రతిపక్ష నాయకుల్ని పోటీ చేయడానికి వీలులేకుండా జైళ్లకు తరలించారు. ఆందోళనకు దిగి చట్టాల్ని ఉల్లంఘించారనే ఆరోపణలపై ప్రతిపక్ష నాయకుడు డిమిత్రి గుడ్ కోవ్ కు 30 రోజుల కారాగారం విధించారు. ఆయన భార్య వలెరియా గుడ్ కోవ్ శనివారం నిర్వహించిన మాస్కో ర్యాలీలో ప్రసంగిస్తూ ప్రతి పౌరులకు అధికారంలో భాగస్వామ్యం వహించే హక్కు ఉందని కానీ అందుకు పాలకులు భీతిల్లుతున్నారని వ్యాఖ్యానించారు.

Friday, August 9, 2019

Hong Kong protesters kick off three-day airport rally


హాంకాంగ్ లో ఉవ్వెత్తున ఎగసిన ప్రజాస్వామ్య ఉద్యమం
చైనా ఏలుబడిలోకి వచ్చిన హాంకాంగ్ లో ప్రజాస్వామ్య ఉద్యమం మహోజ్వల రూపం దాల్చింది. శుక్రవారం చెక్ లాప్ కాక్ విమానాశ్రయంలోకి వేల సంఖ్యలో ప్రజాస్వామ్య ఉద్యమకారులు చొచ్చుకు వచ్చి ఆందోళన చేపట్టారు. ఎయిర్ పోర్ట్ కు వెళ్లే రహదారులన్నీ ఉద్యమకారులతో నిండిపోయాయి. దేశంలో (చైనా ఆధీనంలో ఉన్న తమ ప్రాంతం-టెరిటరీ) ప్రజాస్వామ్య ప్రభుత్వం రావాలని కోరుతూ గత ఏప్రిల్ నుంచి నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా మూడ్రోజులు విమానాశ్రయాల ముట్టడికి ఆందోళనకారులు పిలుపునిచ్చారు. తమ ఉద్యమకాంక్షను వెలిబుచ్చడం ద్వారా అంతర్జాతీయంగా మద్దతు సాధించేందుకు విమానాశ్రయాల ముట్టడికి శ్రీకారం చుట్టారు. నిరసనకారులు ముఖ్యంగా యువత ఉద్యమాన్ని ముందుకు నడుపుతోంది. నల్లని దుస్తులు ధరించిన ఆందోళనకారులు ప్లకార్డులు, బేనర్లు చేతపట్టుకుని రహదారుల మీదుగా నినాదాలు చేసుకుంటూ చెక్ లాప్ కాక్ విమానాశ్రయంలోకి చొచ్చుకువచ్చారు. ఏప్రిల్ లో తొలిసారి ఈ విమానాశ్రయాన్ని ప్రజాస్వామ్య ఉద్యమకారులు ఇదేవిధంగా ముట్టడించారు. సామాజిక మాధ్యమాల్ని వినియోగించుకుంటూ ఉద్యమకారులు వందలు, వేల సంఖ్యలో విమానాశ్రయం ముట్టడి దిశగా ముందుకు కదిలారు. హాంకాంగ్ 1997లో బ్రిటన్ నుంచి చైనా ఏలుబడిలో వచ్చిన సంగతి తెలిసిందే. హాంకాంగ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ క్యారీ లామ్ ఉద్యమం గురించి మాట్లాడుతూ ఉద్యమాన్ని శాంతింపజేయడమే తమ ముందున్న తక్షణ కర్తవ్యమన్నారు. నిరసనకారులను ప్రసన్నం చేసుకోవడానికి ప్రభుత్వం దిగరావడం ఉండదని తేల్చి చెప్పారు. రాజకీయ సంప్రదింపుల ద్వారానే సమస్య పరిష్కారమౌతుందన్నారు. వాస్తవానికి ఏప్రిల్ లో ప్రతిపక్షాల ద్వారా ఈ ప్రజాస్వామ్య ఉద్యమం సెగ రేగింది. అనంతరం విద్యార్థులు, యువత చెంతకు చేరిన ఉద్యమం ప్రస్తుతం ఊపందుకుంది. 428 చదరపు మైళ్ల విస్తీర్ణం కల్గిన హాంకాంగ్ జనాభా సుమారు 74 లక్షలు. ద్రవ్య వినిమయంలో హాంకాంగ్ డాలర్ ప్రపంచంలోనే 13 స్థానంలో నిలుస్తోంది. ఇక్కడ ప్రజల భాష కంటోనీస్ కాగా ప్రస్తుతం అధికార భాషలుగా మాండరీన్ (చైనీస్), ఇంగ్లిష్ చలామణి అవుతున్నాయి. బ్రిటన్ హయాంలో హాంకాంగ్ వలస ప్రాంతానికి `సిటీ ఆఫ్ విక్టోరియా` నగరం రాజధానిగా ఉండేది. ప్రసుత్తం హాంకాంగ్ టెరిటరీ రాజధాని బీజింగ్. తమర్ లో గల చట్ట సభ (లెజిస్లేటివ్ కౌన్సిల్) లో ప్రతినిధులు సమావేశమవుతుంటారు. బిల్లుల్ని ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సభ్యులు రూపొందిస్తారు. ప్రాంతీయంగా చట్టాలు చేసే అధికారం చీఫ్ ఎగ్జిక్యూటివ్ కే ఉంటుంది. హాంకాంగ్ లో 2016లో జరిగిన ఎన్నికల్లో 22 పార్టీలకు చెందిన సభ్యులు లెజిస్లేటివ్ కౌన్సిల్ కు ఎన్నికయ్యారు. బీజింగ్ అనుకూల పార్టీల కూటమి, ప్రజాస్వామ్య ఉద్యమ పార్టీల కూటమి, స్థానిక ప్రయోజనాల పరిరక్షణ పార్టీల కూటమిగా ఈ 22 పార్టీల నుంచి మూడు గ్రూపులు ఏర్పడ్డాయి.

Thursday, August 8, 2019

Narendra Modi speech: Article 370 was a hurdle for development of Jammu & Kashmir, says PM


జమ్ముకశ్మీర్ లడఖ్ ప్రజలు ప్రపంచానికి తమ సత్తా చాటాలి:ప్రధాని

జమ్ముకశ్మీర్ లడఖ్ ప్రజలు తమ శక్తిసామర్థ్యాన్ని ప్రపంచానికి చాటి చెప్పాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. జమ్ముకశ్మీర్ లో అధికరణం 370 రద్దు, రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా ఆ రాష్ట్రాన్ని విడగొట్టిన అనంతరం తొలిసారి ప్రధాని మోదీ దేశ ప్రజల్ని ఉద్దేశించి ప్రసంగించారు. ప్రధాని ప్రసంగాన్ని టీవీలు గురువారం ప్రత్యక్ష ప్రసారం చేశాయి. అయితే జె&కె ను నిరంతరం కేంద్ర పాలిత ప్రాంతంగా ఉంచబోమన్నారు. పరిస్థితులు చక్కబడిన అనంతరం తిరిగి రాష్ట్ర హోదాను కట్టబెడతామని చెప్పారు. భద్రతా బలగాలు జె&కె లో శాంతిభద్రతల పరిరక్షణకు ఇతోధిక సేవలు అందిస్తున్నారని ప్రధాని కొనియాడారు. దేశ రక్షణలో అమరులైన వారి త్యాగాలను తమ సర్కారు సదా స్మరించుకుంటోందన్నారు. జమ్ముకశ్మీర్ లడఖ్ ప్రాంతాల ప్రత్యేకతల్ని, ప్రజల ఔన్నత్యాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు.

 త్వరలో అసెంబ్లీ ఎన్నికలు

జమ్ముకశ్మీర్ అసెంబ్లీకి త్వరలో ఎన్నికలు నిర్వహిస్తామని ప్రధాని మోదీ ఈ సందర్భంగా ప్రకటించారు. ప్రజలు తమ ఓటు హక్కును స్వేచ్ఛగా వినియోగించుకోవచ్చని తెలిపారు. ఇటీవల పంచాయతీ ఎన్నికలు శాంతియుతంగా జరిగిన సంగతిని ఆయన ప్రస్తావించారు. ఎన్నికైన సర్పంచ్‌లు అద్భుతంగా పనిచేస్తున్నారని ప్రశంసించారు. ముఖ్యంగా మహిళా సర్పంచ్‌లు బాగా పనిచేస్తున్నారని చెప్పారు. అదే క్రమంలో రానున్న రోజుల్లో జమ్ముకశ్మీర్ అసెంబ్లీకి ప్రజాప్రతినిధుల్ని ఎన్నుకోవాలని కోరారు. తద్వారా సమర్థులైన  ముఖ్యమంత్రి అధికారాన్ని చేపడతారని చెప్పారు. క్రితంసారి జమ్ముకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీకి పూర్తి మెజారిటీ రాలేదు. దాంతో పీడీపీకి బీజేపీ మద్దతిచ్చింది. మెహబూబా ముఫ్తీ ముఖ్యమంత్రి అయ్యారు. ఆ తర్వాత రెండు పార్టీల మధ్య విభేదాలు రావడంతో బీజేపీ తమ మద్దతును ఉపసంహరించుకుంది. రాష్ట్రం మళ్లీ గవర్నర్ పాలన లోకి వెళ్లింది. ఆర్నెల్ల తర్వాతా అక్కడ పరిస్థితి చక్కబడకపోవడంతో గవర్నర్ పాలన కొనసాగుతోంది.