జమ్ముకశ్మీర్
లడఖ్ ప్రజలు ప్రపంచానికి తమ సత్తా చాటాలి:ప్రధాని
జమ్ముకశ్మీర్ లడఖ్ ప్రజలు తమ శక్తిసామర్థ్యాన్ని
ప్రపంచానికి చాటి చెప్పాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు.
జమ్ముకశ్మీర్ లో అధికరణం 370 రద్దు, రెండు కేంద్ర పాలిత
ప్రాంతాలుగా ఆ రాష్ట్రాన్ని విడగొట్టిన అనంతరం తొలిసారి ప్రధాని మోదీ దేశ ప్రజల్ని
ఉద్దేశించి ప్రసంగించారు. ప్రధాని ప్రసంగాన్ని టీవీలు గురువారం ప్రత్యక్ష ప్రసారం
చేశాయి. అయితే జె&కె ను నిరంతరం
కేంద్ర పాలిత ప్రాంతంగా ఉంచబోమన్నారు. పరిస్థితులు చక్కబడిన అనంతరం తిరిగి రాష్ట్ర హోదాను కట్టబెడతామని చెప్పారు. భద్రతా బలగాలు జె&కె లో శాంతిభద్రతల
పరిరక్షణకు ఇతోధిక సేవలు అందిస్తున్నారని ప్రధాని కొనియాడారు. దేశ రక్షణలో అమరులైన వారి త్యాగాలను తమ సర్కారు సదా స్మరించుకుంటోందన్నారు. జమ్ముకశ్మీర్ లడఖ్
ప్రాంతాల ప్రత్యేకతల్ని, ప్రజల ఔన్నత్యాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు.
త్వరలో అసెంబ్లీ ఎన్నికలు
జమ్ముకశ్మీర్ అసెంబ్లీకి త్వరలో ఎన్నికలు నిర్వహిస్తామని
ప్రధాని మోదీ ఈ సందర్భంగా ప్రకటించారు. ప్రజలు తమ ఓటు హక్కును స్వేచ్ఛగా వినియోగించుకోవచ్చని
తెలిపారు. ఇటీవల పంచాయతీ ఎన్నికలు శాంతియుతంగా జరిగిన సంగతిని ఆయన ప్రస్తావించారు.
ఎన్నికైన సర్పంచ్‌లు అద్భుతంగా పనిచేస్తున్నారని ప్రశంసించారు. ముఖ్యంగా మహిళా
సర్పంచ్‌లు బాగా పనిచేస్తున్నారని చెప్పారు. అదే క్రమంలో రానున్న రోజుల్లో జమ్ముకశ్మీర్
అసెంబ్లీకి ప్రజాప్రతినిధుల్ని ఎన్నుకోవాలని కోరారు. తద్వారా సమర్థులైన ముఖ్యమంత్రి అధికారాన్ని
చేపడతారని చెప్పారు. క్రితంసారి జమ్ముకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీకి
పూర్తి మెజారిటీ రాలేదు. దాంతో పీడీపీకి బీజేపీ మద్దతిచ్చింది. మెహబూబా ముఫ్తీ
ముఖ్యమంత్రి అయ్యారు. ఆ తర్వాత రెండు పార్టీల మధ్య విభేదాలు రావడంతో బీజేపీ తమ
మద్దతును ఉపసంహరించుకుంది. రాష్ట్రం మళ్లీ గవర్నర్ పాలన లోకి వెళ్లింది. ఆర్నెల్ల
తర్వాతా అక్కడ పరిస్థితి చక్కబడకపోవడంతో గవర్నర్ పాలన కొనసాగుతోంది.
No comments:
Post a Comment