Wednesday, June 26, 2019

Pakistan win over unbeaten Newzealand by 6wickets in icc world cup


అజేయ కివీస్ పై పాక్ అలవోక విజయం
వరల్డ్ కప్ లో నేనూ ఉన్నాను అని పాకిస్థాన్ నిరూపించుకుంది. ఇంతవరకు టోర్నీలో ఓటమి ఎరుగని న్యూజిలాండ్ ను 6 వికెట్ల తేడాతో కంగు తినిపించింది. ఐసీసీ వరల్డ్ కప్-12 బర్మింగ్ హమ్ ఎడ్గబస్టన్ వేదికపై బుధవారం జరిగిన మ్యాచ్ నం.33లో టాస్ గెలిచిన కివీస్ బ్యాటింగ్ ఎంచుకుంది. నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్లు నష్టపోయి 237 పరుగులు చేసింది. ప్రత్యర్థి ఎదుట కేవలం238 పరుగుల స్వల్ప లక్ష్యమే ఉంచింది. దాంతో ఇన్నింగ్స్ మొదలు పెట్టిన పాక్ ఆడుతూ పాడుతూ విజయాన్ని అందుకుంది. పాక్ బౌలింగ్, బ్యాటింగ్, ఫీల్డింగ్ విభాగాల్లో ఆల్ రౌండర్ ప్రదర్శన చేసింది. ఈ వరల్డ్ కప్ లో పాక్ బ్యాట్స్ మన్ తొలి సెంచరీ కూడా నమోదు చేశాడు. బాబర్ ఆజం 127 బంతుల్లో 11 బౌండరీల సాయంతో 101 పరుగులతో నాటౌట్ గా నిలిచి మ్యాచ్ ను గెలిపించాడు. ఓపెనర్లు ఇమామ్ ఉల్ హక్(19), ఫకర్ జమాన్(9) వికెట్లను త్వరగా పడగొట్టిన తృప్తి మాత్రమే న్యూజిలాండ్ కు దక్కింది. అప్పటికే అర్ధ శతకం భాగస్వామ్యంతో పాతుకుపోయిన బాబార్, సెకండ్ డౌన్ మహ్మద్ హఫీజ్ జోడీలను విడదీయడానికి కెప్టెన్ కేన్ విలియమ్సన్ ఆఫ్ స్పిన్ బౌలర్ అవతారమెత్తాల్సి వచ్చింది. తొలి ఓవర్ లోనే కివీస్ కెప్టెన్ ..హఫీజ్ ను భారీ షాట్ కు ఊరించి అవుట్ చేశాడు. సరిగ్గా ఇన్నింగ్స్ సగంలో(24.5 ఓవర్) విలియమ్సన్ ఎత్తు ఫలించిన తర్వాత పాక్ మరో వికెట్ ను కివీస్ బౌలర్లు పడగొట్టలేకపోయారు. లెగ్ స్పినర్ శాంటనర్ అద్భుతంగా బౌలింగ్ చేసి 10 ఓవర్లలో పొదుపుగా 38 పరుగులే ఇచ్చినా ఫలితం లేకపోయింది. అతని బౌలింగ్ లో బాబర్ రెండుసార్లు అవుటయ్యే ప్రమాదాన్ని తప్పించుకున్నాడు. రెండుసార్లూ కీపర్ టామ్ లాథమ్ తప్పిదం వల్లే బతికిపోయాడు. ఒకసారి క్యాచ్ అవుట్ నుంచి మరోసారి స్టంపౌట్ నుంచి బాబార్ కు లైఫ్ లు లభించాయి. అప్పటికే పాక్ విజయం ఖరారైన సమయంలో 68 పరుగులు చేసిన హరిస్ సోహాయిల్ గుఫ్తిల్ త్రో తో రనౌట్ గా వెనుదిరిగాడు. విన్నింగ్ షాట్ ను కెప్టెన్ సర్ఫరాజ్ అహ్మద్ కొట్టి పాక్ కు అవసరమైన విజయాన్ని అందించాడు. కివీస్ బౌలర్లలో 8 ఓవర్లు బౌలింగ్ చేసిన విలియమ్సన్ 39 పరుగులిచ్చి 1 వికెట్ తీసుకున్నాడు. 10 ఓవర్లలో 48 పరుగులిచ్చి ట్రెంట్ బౌల్ట్ 1 వికెట్ పడగొట్టాడు. 8.1 ఓవర్లలో 50 పరుగులిచ్చిన లకీ ఫెర్గుసన్ 1 వికెట్ తీసుకున్నాడు. తొలుత బ్యాటింగ్ ప్రారంభించిన న్యూజిలాండ్ ఇన్నింగ్స్ ను చూస్తే టోర్నీలో ఇంతకుముందు ఆడిన కివీస్ బ్యాట్స్ మెన్ వీళ్లేనా అనిపించేలా రన్స్ తీశారు. మరో వైపు పాక్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో న్యూజిలాండ్ బ్యాటింగ్ టాప్ ఆర్డర్ పేకమేడలా కుప్పకూలింది. కెప్టెన్ విలియమ్సన్ మాత్రమే 69 బంతుల్లో 41 పరుగులు రాబట్టాడు. చివర్లో జేమ్స్ నీషం112 బంతుల్లో 97* పరుగులు చేశాడు. సెంచరీ మిస్ అయినా జట్టుకు గౌరవప్రదమైన స్కోరు అందించడంలో మూలస్తంభంలా నిలిచాడు. అతనికి తోడుగా కోలిన్ డే గ్రాండ్ హోమ్ 71 బంతుల్లో 64 పరుగులతో రాణించాడు. పాక్ బౌలర్లలో షాహిన్ ఆఫ్రిది 28 పరుగులిచ్చి 3 వికెట్లు పడగొట్టాడు. షాదబ్ ఖాన్, మహ్మద్ అమీర్ చెరో వికెట్ తీసుకున్నారు.   

Thank you for keeping me in your hearts: Shah Rukh on clocking 27 years in Bollywood


27 ఏళ్లు గుండెల్లో పెట్టుకున్నందుకు ధన్యవాదాలు:షారుఖ్ ఖాన్
బాలీవుడ్ బాద్ షా, కింగ్ ఖాన్ షారుఖ్ తన సినీ నట జీవితం ప్రారంభమై 27 ఏళ్లు గడిచిన సందర్భంగా అభిమానులందరికి ధన్యవాదాలు తెలిపాడు. దీవానా హిందీ చిత్రం ఇదే రోజున విడుదలయి సూపర్ హిట్ అయింది. రాజ్ కన్వర్ ద్వారా కింగ్ ఖాన్ తెరంగేట్రం చేశాడు. ఆ తర్వాత నుంచి ఒక్కో మెట్టు ఎక్కుతూ బాలీవుడ్ బాద్ షా గా ఎదిగాడు. ఈ సందర్భంగా 53 ఏళ్ల షారుఖ్ ట్విటర్ లో ఓ వీడియో విడుదల చేశాడు. తెల్లని టీషర్ట్ , నల్లని ప్యాంట్ ధరించి దీవానా చిత్రంలో పోషించిన పాత్రలో మాదిరిగానే బైక్ పై ప్రయాణిస్తూ తాజా వీడియోలో అభిమానుల్ని అలరించాడు. `హిందీ చలనచిత్ర పరిశ్రమకు, అభిమానులకు వేనవేలు ధన్యవాదాలు.. మీరు చూపించిన అభిమానం ద్వారా భూమిపై నా సగ జీవిత కాలం వెండితెరపై గడపగలిగాను.. మిమ్మల్ని సదా వినోదంలో ముంచెత్తెందుకు ప్రయత్నించాను..కొన్ని సార్లు విజయాలు, మరొకొన్ని మార్లు అపజయాలు ఎదుర్కొన్నాను. మరికొన్నేళ్లూ నట జీవితాన్ని కొనసాగించాలనుకుంటున్నాను.` అని ఆ పోస్టులో షారుఖ్ పేర్కొన్నాడు. దీవానాలో మోటార్ సైకిల్ పై Koi Na Koi Chahiye అని పాడుతూ మీ గుండెల్లో చోటు సంపాదించుకున్నాను. అందుకు మోటార్ సైకిల్ కంపెనీకి నా ధన్యవాదాలు. కానీ ఈసారి మోటారు బైక్ పై హెల్మెట్ ధరించే నడుపుతాను.. ప్రేమతో మీ షారుఖ్ అని కింగ్ ఖాన్ ఆ పోస్టులో విలువైన వ్యాఖ్యలు రాశాడు.

Tuesday, June 25, 2019

Australia Formidable Victory by 64 Runs over England


ఇంగ్లాండ్‌పై 64 పరుగుల తేడాతో ఆస్ట్రేలియా ఘన విజయం
ఐసీసీ వరల్డ్ కప్-12 ఫెవరెట్ జట్ల పోరాటంలో ఆతిథ్య ఇంగ్లాండ్ పై డిఫెండింగ్ చాంప్ ఆస్ట్రేలియా 64 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. మంగళవారం లండన్ లార్డ్స్ మైదానంలో జరిగిన మ్యాచ్ నం.32లో టాస్ గెలిచిన ఇంగ్లాండ్ ఫీల్డింగ్ ఎంచుకుంది. తొలుత బ్యాటింగ్ ప్రారంభించిన ఆస్ట్రేలియా నిర్ణీత 50 ఓవర్లలో ఓపెనర్లు కెప్టెన్ ఆరన్ ఫించ్(100) టోర్నీ రెండో సెంచరీ, డేవిడ్ వార్నర్(53) హాఫ్ సెంచరీల అండతో 7 వికెట్లు కోల్పోయి 285 పరుగులు చేసింది. అనంతరం 286 పరుగుల ఛేదన లక్ష్యంతో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇంగ్లాండ్  తొలి ఓవర్ రెండో బంతికే పరుగులేమీ లేకుండానే వికెట్ కోల్పోయింది. ఓపెనర్ జేమ్స్ విన్స్ ను జాసన్ బెరండ్రాఫ్ క్లీన్ బౌల్డ్ చేసి డకౌట్ గా పెవిలియన్ కు పంపాడు. వన్డౌన్ జోయ్ రూట్ (8)ని మూడో ఓవర్లో స్టార్క్ ఎల్బీడబ్లూ చేసి ఇంగ్లాండ్ ను ఆత్మరక్షణలోకి నెట్టేశాడు. కెప్టెన్ మోర్గాన్(4) ను అయిదో ఓవర్లో స్టార్కే పెవిలియన్ బాట పట్టించాడు. 13వ ఓవర్ వరకు నిలదొక్కుకున్న మరో ఓపెనర్ జానీ బెయిర్ స్టో(27)ను జాసన్ అవుట్ చేశాడు. అప్పటికి జట్టు స్కోరు 4 వికెట్ల నష్టానికి 53 పరుగులే. ఆ తర్వాత అయిదో వికెట్ కి బెన్ స్టోక్స్(89), కీపర్ బ్యాట్స్ మన్ జాస్ బట్లర్(25) 14 ఓవర్లలో 71 పరుగులు జోడించారు. స్టోయినిస్ బౌలింగ్ లో ఖవాజా క్యాచ్ పట్టగా బట్లర్ క్రీజ్ వదిలాడు. అప్పటికే 27 ఓవర్లకు ఇంగ్లాండ్ 5 వికెట్లను కోల్పోయి 124 పరుగులే చేసింది. 37వ ఓవర్ లో బెన్ స్టోక్స్ ను స్టార్క్ బౌల్డ్ చేయడంతో మిణుమిణుకుమంటున్న ఇంగ్లాండ్ విజయావకాశాలు పూర్తిగా మాయమైపోయాయి. మిడిల్ ఆర్డర్ లో క్రిస్ వోక్స్(26), చివరి వరుస బ్యాటర్లలో అదిల్ రషీద్(25)లు పోరాడినా ఫలితం దక్కలేదు. ఇంగ్లాండ్ జట్టు 44.4 ఓవర్లలో 221 పరుగులకు ఆలౌటయింది. ఆసిస్ బౌలర్లలో జాసన్ 44 పరుగులిచ్చి 5 వికెట్లు మిషెల్ స్టార్క్ 43 పరుగులకు 4 వికెట్లు పంచుకోగా మార్కస్ స్టోయినిస్ 29 పరుగులిచ్చి 1 వికెట్ పడగొట్టాడు. కిక్కిరిసిన లార్డ్స్ మైదానంలో ప్రత్యక్షంగా మ్యాచ్ తిలకిస్తున్న ప్రేక్షకులతో పాటు ప్రపంచ క్రికెట్ అభిమానులందర్ని ఇంగ్లాండ్ బ్యాటింగ్ తీరు నిరాశ పరిచింది. కంగారూ ఓపెనర్లు ఫించ్, డేవిడ్ వార్నర్ తొలి వికెట్ కు 22.4 ఓవర్లలో 123 పరుగులతో శుభారంభం చేశారు. ఉస్మాన్ ఖవాజా(23), స్టీవెన్ స్మిత్(38), చివర్లో కీపర్ బ్యాట్స్ మన్ అలెక్స్ కేరీ(38) జట్టు భారీ స్కోరులో పాలుపంచుకున్నారు. అప్పటికే స్మిత్ క్రీజ్ లో వెనక్కి మళ్లినా మార్కస్ స్టోయినస్(8) లేని రెండో పరుగు కోసం యత్నించి రనౌట్ అయ్యాడు. స్టోయినిస్ వికెట్ల మధ్య పరిగెత్తిన తీరుపట్ల స్మిత్ విస్మయానికి గురయ్యాడు. ఇంగ్లాండ్ బౌలర్లలో క్రిస్ వోక్స్ 2 వికెట్లు తీసుకోగా జోఫ్రా ఆర్చర్, మార్క్ వుడ్, బెన్ స్టోక్స్, మొయిన్ అలీ తలో వికెట్ పడగొట్టారు. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ గా ఫించ్ నిలిచాడు. ఈ విజయంతో ఆస్ట్రేలియా టోర్నీలో సెమీస్ కు చేరిన తొలి జట్టయింది.

only one family was spoken about and got all attention says modi



`కాంగ్రెస్ సభ్యుల కంటికి ఒకే ఒక కుటుంబం కనిపిస్తుంది`: ప్రధాని ఎద్దేవా
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మరోసారి కాంగ్రెస్ వంశపారంపర్య పాలనపై ధ్వజమెత్తారు. మంగళవారం లోక్ సభలో ఆయన ప్రసంగిస్తూ కేవలం ఒక కుటుంబం చుట్టూనే కాంగ్రెస్ పార్టీ పరిభ్రమిస్తుందని వారి మాటే వేద వాక్కుగా పాటిస్తోందని విమర్శించారు. ఉభయసభలను ఉద్దేశించి  రాష్ట్రపతి చేసిన ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ సందర్భంగా లోక్ సభలో సోమవారం కాంగ్రెస్ నాయకుడు అధిర్ రాజన్ చౌధురి మాట్లాడుతూ కాంగ్రెస్ మహానేతలు పండిట్ నెహ్రూ, ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీలు దేశానికి చేసిన సేవలు వివరించారు. ఆ సందర్భంలోనే ప్రధాని మోదీ గొప్ప మార్కెట్ నైపుణ్యం గల వ్యాపారవేత్తగా అధిర్ పేర్కొన్నారు. ఆయన తన ఉత్పత్తుల్ని బాగా అమ్మకోగలిగాడని కాంగ్రెస్ కు అది చేతకాక ఓటమి చెందిందన్నారు. ఈ నేపథ్యంలో మంగళవారం సభలో ప్రధాని మోదీ స్వయంగా రంగంలోకి దిగారు. కాంగ్రెస్ సభ్యులు, గాంధీ నెహ్రూ కుటుంబ వారసత్వ ప్రధానులపై ఎదురుదాడి చేశారు. కాంగ్రెస్ సభ్యులకు ఏరోజూ ప్రధానిగా వాజ్ పేయి హయాంలో జరిగిన అభివృద్ధి గుర్తుకు రాలేదన్నారు. గాంధీ నెహ్రూ కుటుంబానికి చెందని కాంగ్రెస్ ప్రధానులు పి.వి.నరసింహారావు, మన్మోహన్ సింగ్ ల హయాంలో కార్యక్రమాల గురించి ఏ ఒక్క కాంగ్రెస్ సభ్యుడు ప్రస్తుతించిన దాఖలా లేదని ప్రధాని మోదీ ప్రస్తావించారు. ఇదే రోజు జూన్ 25న ఇందిరా గాంధీ విధించిన ఎమర్జెన్సీ చీకటి రోజులు తనకింకా గుర్తున్నాయన్నారు. రాజ్యాంగ వ్యవస్థల్ని ఆఖరికి న్యాయవ్యవస్థను ఆమె గుప్పిట పట్టి పాలించారని ఘాటుగా విమర్శించారు. 44 ఏళ్ల నాడు ఎమర్జెన్సీ చీకటి పాలనకు యావత్ దేశం ఆత్మ క్షోభించిందన్నారు. ప్రధాని మోదీ ఈ విమర్శలు గుప్పిస్తున్నప్పుడు లోక్ సభ ఎంపీలుగా ఎన్నికైన సోనియాగాంధీ, రాహుల్ గాంధీ సభలోనే ఉన్నారు. కొత్త భారత దేశ నిర్మాణానికి బీజేపీ తపన పడుతోందన్నారు. దేశ ప్రజలు సమైక్యత, భద్రత, సురక్షితలను కోరుకుంటున్నారని అందుకే మరోసారి బీజేపీకి తిరుగులేని అధికారాన్ని కట్టబెట్టారని మోదీ వ్యాఖ్యానించారు.