ఇంగ్లాండ్‌పై
64
పరుగుల తేడాతో ఆస్ట్రేలియా ఘన విజయం
ఐసీసీ వరల్డ్
కప్-12 ఫెవరెట్ జట్ల పోరాటంలో ఆతిథ్య ఇంగ్లాండ్ పై డిఫెండింగ్
చాంప్ ఆస్ట్రేలియా 64 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. మంగళవారం లండన్ లార్డ్స్ మైదానంలో జరిగిన
మ్యాచ్ నం.32లో టాస్ గెలిచిన ఇంగ్లాండ్ ఫీల్డింగ్ ఎంచుకుంది. తొలుత బ్యాటింగ్
ప్రారంభించిన ఆస్ట్రేలియా నిర్ణీత 50 ఓవర్లలో ఓపెనర్లు కెప్టెన్ ఆరన్ ఫించ్(100) టోర్నీ
రెండో సెంచరీ, డేవిడ్ వార్నర్(53) హాఫ్ సెంచరీల అండతో 7 వికెట్లు కోల్పోయి 285
పరుగులు చేసింది. అనంతరం 286 పరుగుల ఛేదన లక్ష్యంతో ఇన్నింగ్స్ ప్రారంభించిన
ఇంగ్లాండ్ తొలి ఓవర్ రెండో బంతికే పరుగులేమీ లేకుండానే వికెట్ కోల్పోయింది.
ఓపెనర్ జేమ్స్ విన్స్ ను జాసన్ బెరండ్రాఫ్ క్లీన్ బౌల్డ్ చేసి డకౌట్ గా పెవిలియన్
కు పంపాడు. వన్డౌన్ జోయ్ రూట్ (8)ని మూడో ఓవర్లో స్టార్క్ ఎల్బీడబ్లూ చేసి
ఇంగ్లాండ్ ను ఆత్మరక్షణలోకి నెట్టేశాడు. కెప్టెన్ మోర్గాన్(4) ను అయిదో ఓవర్లో
స్టార్కే పెవిలియన్ బాట పట్టించాడు. 13వ ఓవర్ వరకు నిలదొక్కుకున్న మరో ఓపెనర్ జానీ
బెయిర్ స్టో(27)ను జాసన్ అవుట్ చేశాడు. అప్పటికి జట్టు స్కోరు 4 వికెట్ల నష్టానికి
53 పరుగులే. ఆ తర్వాత అయిదో వికెట్ కి బెన్ స్టోక్స్(89), కీపర్ బ్యాట్స్ మన్ జాస్
బట్లర్(25) 14 ఓవర్లలో 71 పరుగులు జోడించారు. స్టోయినిస్ బౌలింగ్ లో ఖవాజా క్యాచ్
పట్టగా బట్లర్ క్రీజ్ వదిలాడు. అప్పటికే 27 ఓవర్లకు ఇంగ్లాండ్ 5 వికెట్లను
కోల్పోయి 124 పరుగులే చేసింది. 37వ ఓవర్ లో బెన్ స్టోక్స్ ను స్టార్క్ బౌల్డ్
చేయడంతో మిణుమిణుకుమంటున్న ఇంగ్లాండ్ విజయావకాశాలు పూర్తిగా మాయమైపోయాయి. మిడిల్
ఆర్డర్ లో క్రిస్ వోక్స్(26), చివరి వరుస బ్యాటర్లలో అదిల్ రషీద్(25)లు పోరాడినా
ఫలితం దక్కలేదు. ఇంగ్లాండ్ జట్టు 44.4 ఓవర్లలో 221 పరుగులకు ఆలౌటయింది. ఆసిస్ బౌలర్లలో జాసన్ 44 పరుగులిచ్చి 5 వికెట్లు మిషెల్ స్టార్క్
43 పరుగులకు 4 వికెట్లు పంచుకోగా మార్కస్ స్టోయినిస్ 29 పరుగులిచ్చి 1 వికెట్
పడగొట్టాడు. కిక్కిరిసిన లార్డ్స్ మైదానంలో ప్రత్యక్షంగా మ్యాచ్ తిలకిస్తున్న
ప్రేక్షకులతో పాటు ప్రపంచ క్రికెట్ అభిమానులందర్ని ఇంగ్లాండ్ బ్యాటింగ్ తీరు నిరాశ
పరిచింది. కంగారూ ఓపెనర్లు ఫించ్, డేవిడ్ వార్నర్ తొలి వికెట్ కు
22.4 ఓవర్లలో 123 పరుగులతో శుభారంభం చేశారు. ఉస్మాన్
ఖవాజా(23), స్టీవెన్ స్మిత్(38), చివర్లో కీపర్ బ్యాట్స్ మన్ అలెక్స్ కేరీ(38)
జట్టు భారీ స్కోరులో పాలుపంచుకున్నారు. అప్పటికే స్మిత్ క్రీజ్ లో వెనక్కి మళ్లినా
మార్కస్ స్టోయినస్(8) లేని రెండో పరుగు కోసం యత్నించి రనౌట్ అయ్యాడు. స్టోయినిస్
వికెట్ల మధ్య పరిగెత్తిన తీరుపట్ల స్మిత్ విస్మయానికి గురయ్యాడు. ఇంగ్లాండ్
బౌలర్లలో క్రిస్ వోక్స్ 2 వికెట్లు తీసుకోగా జోఫ్రా ఆర్చర్, మార్క్ వుడ్, బెన్
స్టోక్స్, మొయిన్ అలీ తలో వికెట్ పడగొట్టారు. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ గా ఫించ్
నిలిచాడు. ఈ విజయంతో ఆస్ట్రేలియా టోర్నీలో సెమీస్ కు చేరిన తొలి జట్టయింది.
No comments:
Post a Comment