Monday, June 10, 2019

6 convicted in gang rape, murder of 8-yr-old girl in Kathua; 1 acquitted


ఎనిమిదేళ్ల చిన్నారిపై సామూహిక అత్యాచారం హత్య

కథువా కేసులో ముగ్గురికి యావజ్జీవ శిక్ష

ఎనిమిదేళ్ల చిన్నారిపై సామూహిక అత్యాచారం దారుణ హత్య కేసులో నిందితులు ముగ్గురికి యావజ్జీవ శిక్ష, మరో ముగ్గురికి అయిదేళ్ల కఠిన కారాగారం విధిస్తూ సోమవారం (జూన్10) పఠాన్ (పంజాబ్) కోర్టు తీర్పిచ్చింది. పఠాన్ కోట్ జడ్డి తేజ్విందర్ సింగ్ ఒకర్ని ఈ కేసు లో నిర్దోషిగా విడిచిపెట్టారు. బాలుడు ప్రధాన ముద్దాయి సాంజిరామ్ కొడుకుపై జమ్ము హైకోర్టులో విచారణ కొనసాగునున్నట్లు తీర్పులో పేర్కొన్నారు.  గత ఏడాది జనవరి 10న దక్షిణ కశ్మీర్ లోని కథువా జిల్లాలో గుర్రాలను మేపడానికి నిర్జన ప్రదేశానికి వెళ్లిన బాలికను అపహరించుకుపోయిన దుండగులు వారంరోజుల పాటు ఓ గుడిలో ఉంచి మాదకద్రవ్యాలు (డ్రగ్స్) ఇస్తూ దారుణంగా సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఆ తర్వాత బాలిక తలను బండకేసి కొట్టి హత్యచేశారు. ఈ దారుణం జనవరి 10న జరగ్గా 17వ తేదీన బాలిక శవాన్ని కనుగొన్నారు. కథువా జిల్లాలోని హీరానగర్ తహశిల్ లోని రాసనా గ్రామంలో జరిగిన ఈ అమానవీయ ఘోర ఘటనలో ప్రధాన ముద్దాయి సాంజి రామ్ తో పాటు మొత్తం ఎనిమిది మందిపై ఏప్రిల్ లో పోలీసులు చార్జీషీట్ దాఖలు చేశారు. బాలికపై జరిగిన ఈ ఘోర కలిపై కశ్మీర్ సహా యావద్దేశం అట్టుడుకిపోయింది. ఢిల్లీ, ముంబయి, బెంగళూరుల్లో నిరసనలు మిన్నంటాయి. ఘటన తీవ్రత దృష్ట్యా స్పెషల్ ఫాస్ట్ ట్రాక్ కోర్టు నుంచి కేసును పొరుగునున్న పఠాన్ కోట్ కోర్టుకు బదిలీ చేస్తూ సుప్రీంకోర్టు 7 మే 2018న ఆదేశాలిచ్చింది. అంతేకాకుండా కోర్టు విచారణను ఏ రోజుకారోజు సుప్రీం పర్యవేక్షించింది.  గ్రామంలో జరిగిన స్వల్ప స్థల వివాదాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రధాన నిందితుడు సాంజిరామ్ మైనార్టీ గిరిజన ముస్లిముల్ని (నొమడిక్ వర్గాన్ని) తమ ప్రాంతం నుంచి వెళ్లగొట్టే ఉద్దేశంతోనే ఈ దారుణానికి పాల్పడినట్లు విచారణలో తేలింది. సాంజిరామ్, అతని కొడుకు సహా మొత్తం ఎనిమిది మందిని అరెస్టు చేశారు. వీరందరి పైన విచారణ జరిపిన న్యాయస్థానం ఆ ఘోరం జరిగిన సమయంలో సాంజిరామ్ కొడుకు విశాల్ జల్గోత్రా మీరట్ లో ఉన్నట్లు కోర్టుకు ఆధారాలు సమర్పించడంతో న్యాయమూర్తి సంశయ లాభం (బెనిఫిట్ ఆఫ్ డౌట్) కింద అతణ్ని నిర్దోషిగా విడిచిపెట్టారు. ప్రధాన నిందితుడు సాంజిరామ్, దీపక్ ఖజురియా, పర్వేశ్ కుమార్ లకు  రణబీర్ పీనల్ కోడ్ (ఆర్పీసీ) నేర శిక్షాస్మృతి మైనర్ అపహరణ, దారుణం శారీరక హింస, అత్యాచారం, పాశవిక హత్యా నేరాల కింద యావజ్జీవ కారాగార శిక్ష విధించారు. సాక్ష్యాలను తారుమారు చేయడం, నాశనం చేయడం వంటి నేరానికి పాల్పడిన ప్రత్యేక పోలీసు అధికారి సురేందర్ జోషి, ఆనంద్ దిత్తా, హెడ్ కానిస్టేబుల్ తిలక్ రాజ్ ముగ్గురుకి అయిదేళ్ల కఠిన కారాగారం రూ.50 వేల జరిమానా విధించారు.

yuvaraj singh announces his retirement to first class cricket



రిటైర్మెంట్ ప్రకటించిన 6 సిక్సర్ల యువరాజ్
భారత క్రికెటర్లలో తనదైన ముద్ర వేసిన యువరాజ్ సింగ్ ఫస్ట్ క్లాస్ క్రికెట్ కు గుడ్ బై చెప్పారు. ఈ విషయాన్ని ముంబైలో సోమవారం (జూన్10) ప్రకటించాడు. 2000వ సంవత్సరంలో భారత జట్టుకు ఎంపికైన యువరాజ్ 2017లో తన చివరి టి-20 మ్యాచ్ ఆడాడు. అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్ లో ఒక ఓవర్లో ఆరు బంతులు ఆరు సిక్సర్లు కొట్టిన ఘనత భారత్ తరఫున యువరాజ్ కే సొంతమైంది. 2007 టి-20 వరల్డ్ కప్ లో ఇంగ్లాండ్ పై మ్యాచ్ లో యువరాజ్ ఈ ఘనత సాధించాడు. కేవలం 16 బంతుల్లోనే 57 పరుగులు చేసి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలిచాడు.
తొలుత ఒకే ఓవర్లో ఆరు బంతుల్ని ఆరు సిక్సర్లు కొట్టిన ఘనత వెస్టిండిస్ బ్యాట్స్ మన్ గ్యారీ సోబర్స్(1968) కు దక్కింది. ఇంగ్లిష్ కౌంటీ క్రికెట్ మ్యాచ్ లో సోబర్స్ ఆరు సిక్సర్లు కొట్టారు. అదే తరహాలో రంజీ మ్యాచ్ లో బరోడాపై బొంబాయి తరఫున ఆడుతున్న ప్రస్తుత భారత జట్టు కోచ్ రవిశాస్త్రి (1985) ఆరు బంతుల్లో ఆరు సిక్సర్ల రికార్డు సాధించాడు. అంతర్జాతీయ క్రికెట్ లో 2007 ఐసీసీ వరల్డ్ కప్ లో నెదర్లాండ్స్ పై దక్షిణాఫ్రికా ఆటగాడు హెర్షెలి గిబ్స్ ఓవర్లో ఆరు సిక్సర్ల రికార్డు ను అందుకున్నాడు.
2011 వరల్డ్ కప్ రెండోసారి సాధించిన భారత జట్టు సభ్యుడు వైస్ కెప్టెన్ యువరాజ్ సింగ్ ఆ టోర్నీలో పలు మ్యాచ్ ల్లో ఆల్ రౌండర్ నైపుణ్యం కనబర్చాడు. ముఖ్యంగా ఆ వరల్డ్ కప్ సెమీ ఫైనల్స్, ఫైనల్స్ లో యువరాజ్ ఆమోఘమైన ఆటతీరుతో ఆకట్టుకున్నాడు. అయితే కెరీర్ ఉజ్వలంగా ఉన్న దశలో 2011లోనే కేన్సర్ బారినపడిన యువీ తర్వాత కోలుకున్నా క్రికెట్ లో మునుపటి పట్టును సాధించలేకపోయాడు. 40 టెస్టులాడిన యువీ 3 సెంచరీలతో 1900 పరుగులు, 304 వన్డేలకు గాను 14 సెంచరీలతో 8701 పరుగులు చేశాడు. 58 టి-20 మ్యాచ్ ల్లో 1177 పరుగులు, ఐపీఎల్ లో 132 మ్యాచ్ లకు గాను 2750 పరుగులు స్కోరు చేశాడు. సచిన్, గంగూలీ, ద్రవిడ్, లక్ష్మణ్ వంటి ఉద్దండులతో ఆడటం సంతోషాన్నిచ్చిందని పేర్కొన్నాడు. తన కెరీర్ లో గంగూలీ, ధోని తనకు ఎంతో సహకరించారని యువీ తెలిపాడు.

Sunday, June 9, 2019

Flashback! Rahul Gandhi meets nurse who held him in her hands as a baby 49 years ago



ప్రధాని మోదీకి అకస్మాత్తుగా కేరళపై ప్రేమ ఎందుకు కల్గింది?:రాహుల్
హఠాత్తుగా ప్రధాని మోదీకి కేరళపై ఎందుకు ప్రేమ పుట్టిందో అర్థం కావడం లేదని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ చమత్కరించారు. తనకు ఘన విజయాన్ని కట్టబెట్టిన వాయ్ నాడ్ నియోజకవర్గ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపేందుకు మూడ్రోజుల పాటు కేరళ పర్యటనకు రాహుల్ విచ్చేసిన విషయం విదితమే. ఆదివారం(జూన్9) ఆయన పర్యటన ముగించుకుని ఢిల్లీ తిరిగి వెళ్లారు. అంతకు ముందు ఆయన కోజికోడ్ విమానాశ్రయంలో ఢిల్లీ తిరిగి వెళ్లే ముందు విలేకర్లతో ముచ్చటించారు. మోదీ బీజేపీ పాలిత రాష్ట్రాలపై చూపిన మమకారం బీజేపీయేతర ప్రభుత్వాలపై ఎప్పుడూ చూపలేదనడానికి అనేక ఉదాహరణలున్నాయన్నారు. ముఖ్యంగా కేరళలో సీపీఐ(ఎం) నేతృత్వంలోని సంకీర్ణ కూటమి ప్రభుత్వం పాలన చేస్తుండగా ప్రధాని మోదీకి ఆకస్మికంగా ఈ రాష్ట్రంపై ప్రేమ కల్గడం అనుమానాలకు తావిస్తోందని రాహుల్ వ్యాఖ్యానించారు. రాహుల్ కేరళ పర్యటనలో ఉండగానే ప్రధాని మోదీ రెండ్రోజుల పాటు తొలి విదేశీ పర్యటన (మాల్దీవులు, శ్రీలంక)కు వెళ్తూ శనివారం హఠాత్తుగా గురువాయూర్ శ్రీకృష్ణ ఆలయాన్ని సందర్శించడానికి వచ్చిన సంగతి తెలిసిందే. రాహుల్ కేరళ పర్యటనలో వాయ్ నాడ్, మలప్పురం, కోజికోడ్ జిల్లాల్లో విస్తృతంగా పర్యటించి ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఆయన ఎంగపుజ్హ, ముక్కం పట్టణాల్లో రోడ్ షోల్లో పాల్గొని ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. మోదీ దేశాన్ని విభజించి పాలిస్తున్నారని విమర్శించారు. ప్రధాని మోదీ కేరళను ఉత్తరప్రదేశ్ తో సమానంగా ఆదరిస్తారని తాను భావించడం లేదని రాహుల్ అన్నారు.

49 ఏళ్లకు.. నర్సు రాజమ్మను కలుసుకున్న రాహుల్

ఢిల్లీ హోలీ ఫ్యామిలీ ఆసుపత్రిలో అప్పుడే పుట్టిన తనను చేతుల్లోకి తీసుకున్న నర్సు రాజమ్మ వావిథిల్ ను ఆదివారం రాహుల్ గాంధీ కలుసుకున్నారు. రాజీవ్ గాంధీ, సోనియా గాంధీలకు తొలిసంతానంగా రాహుల్ 1970 జూన్ 19న జన్మించినప్పుడు రాజమ్మ ట్రైనీ నర్సుగా అదే ఆసుపత్రిలో పనిచేస్తున్నారు. సోనియా ప్రసవం సమయంలో విధులు నిర్వర్తించిన రాజమ్మ..రాహుల్ ను తొలిసారి చేతుల్లోకి తీసుకున్నారు. రాహుల్ వాయ్ నాడ్ లో పోటీ చేస్తున్నారని తెలిసి సంబరపడిన రాజమ్మ ఆయనను కలుసుకోవాలని ఆకాంక్ష వ్యక్తం చేశారు. ప్రస్తుతం పదవీ విరమణ చేసి కేరళలోనే ఉంటున్న రాజమ్మను తన పర్యటన సందర్భంగా రాహుల్ ప్రత్యేకంగా పిలిపించుకుని కొద్దిసేపు ఆమెతో ముచ్చటించారు.


brazen misuse of law editors guild of india condemns arrests of journalists and news channel head


యూపీ సీఎం పరువుకు నష్టం కల్గించారనే ఆరోపణలపై

ముగ్గురు జర్నలిస్టుల అరెస్ట్:ఖండించిన ఎడిటర్స్ గిల్డ్
ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ పై అభ్యంతరకర వార్తలను ప్రసారం చేశారంటూ జర్నలిస్టుల్ని అరెస్ట్ చేయడాన్ని ఎడిటర్స్ గిల్డ్ ఖండించింది. ఓ మహిళ యూపీ సీఎంను వివాహం చేసుకోవాలనుకుంటోందంటూ ప్రఖ్యాత జర్నలిస్ట్ కనొజియా ఓ వీడియోను ట్విటర్ లో షేర్ చేశారు. దాంతో ఆయనను లక్నోలో శనివారం (జూన్8) యూపీ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ వీడియోను నోయిడాలోని ఓ జాతీయ టీవీ చానల్ ప్రసారం చేసింది. ఈ ప్రసారానికి ఇషాంత్ సింగ్, అనుజ్ శుక్లా బాధ్యులుగా గుర్తించి వారిద్దర్ని ఆదివారం అరెస్ట్ చేశారు. ఆ చానల్ కు ప్రసారాల లైసెన్స్ కూడా లేదని పోలీసులు తెలిపారు. ఈ ముగ్గురు జర్నలిస్టులు సీఎం ఆదిత్యనాథ్ పరువుకు భంగం కల్గించేలా వార్తలను ప్రసారం చేసినందుకు గాను అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. తొలుత ఆ మహిళ లక్నోలోని సీఎం కార్యాలయం బయట విలేకర్లతో మాట్లాడుతూ ఆదిత్యనాథ్ తో తనకు సంబంధముందని ఆయనను పెళ్లి చేసుకోవాలనుంటున్నట్లు పేర్కొంది. ఆ వీడియో తర్వాత ట్విటర్, ఫేస్ బుక్ వంటి సోషల్ మీడియాలో వైరల్ అయింది. జర్నలిస్టుల్ని నిర్హేతుకంగా ఏకపక్షంగా అరెస్టు చేశారని ఇది న్యాయవిరుద్ధమంటూ ఎడిటర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియా వ్యాఖ్యానించింది. పోలీసుల చర్యను ఖండిస్తూ గిల్డ్ పత్రికా స్వేచ్ఛను హరించారని విలేకర్లను భయభ్రాంతులకు గురి చేస్తున్నట్లుగా వ్యవహరిస్తున్నారని ఆరోపించింది. ఓ మహిళ మనోభావనను నిష్పక్షపాతంగా ప్రసారం చేయడం, సామాజిక మాధ్యమంలో పోస్టు చేయడం సీఎం పరువుకు భంగం కల్గించే నేరానికి పాల్పడినట్లుగా ఎలా భావిస్తారని ప్రశ్నించింది. కర్ణాటకలోనూ ఇటీవల ఇదే తరహాలో పోలీసులు వ్యవహరించారని తప్పుబట్టింది. ప్రాథమిక దర్యాప్తు నివేదిక(ఎఫ్.ఐ.ఆర్) సైతం లేకుండా సుమోటాగా పోలీసులు కేసు నమోదు చేశారని పేర్కొంది. ఈ చర్య అధికారాన్ని అడ్డం పెట్టుకొని చట్టాన్ని దుర్వినియోగం చేయడంగా అభివర్ణించింది. పరువునష్టం కేసుల్ని నేరపూరిత కేసుల జాబితా నుంచి తొలగించాలన్న డిమాండ్ ను ఎడిటర్స్ గిల్డ్ పునరుద్ఘాటించింది. భారత శిక్షాస్మృతి(ఐ.పి.సి)లోని ఐ.టి.చట్టం సెక్షన్ 66 ప్రకారం నేరపూరిత కేసుగా పరువునష్టం కేసుని చొప్పించారంది. ఉద్దేశపూర్వకంగా, ప్రతీకారేచ్ఛతో జర్నలిస్టులపై నేరపూరిత పరువునష్టం కేసులు పెడుతున్నారని విమర్శించింది.