Friday, May 31, 2019

Neither now nor in future nithish sayson possibility of jd(u)joining modi government



భవిష్యత్ లో కూడా మోదీ ప్రభుత్వంలో చేరబోం:సీఎం నితిష్
దేశ రాజధాని ఢిల్లీ చేరుకున్న బిహార్ ముఖ్యమంత్రి నితిష్ కుమార్ ఎన్డీయే సర్కార్ కు షాక్ ఇచ్చారు. శుక్రవారం(మే31) ఇక్కడకు వచ్చిన సందర్భంగా ఆయన విలేకర్లతో మాట్లాడారు. కేంద్రంలోని ప్రస్తుత మోదీ ప్రభుత్వంలో ఇప్పుడే కాదు భవిష్యత్ లో కూడా చేరబోమని తేల్చి చెప్పేశారు. అయితే ఎన్డీయే మిత్రపక్షంగా తాము కొనసాగుతూనే ఉంటామన్నారు. కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడిన వేళ తాము తొలుత తీసుకున్న నిర్ణయమే మున్ముందు కొనసాగుతుందని స్పష్టం చేశారు. జనతాదళ్ (యునైటెడ్) కీలక సంఘం(కోర్ కమిటీ) తీవ్రంగా చర్చించాకే ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. ఎన్డీయే పక్షాల ఐక్యతకు చిహ్నంగా కేంద్ర మంత్రివర్గంలో చేరాలన్న బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా ఆహ్వానాన్ని ఆయన తిరస్కరించారు. తాజా కేంద్ర మంత్రివర్గంలో తొలుత జె.డి(యు) చేరాలనుకున్నా తర్వాత పార్టీలో కీలక చర్చల అనంతరం చేరరాదనే తుది నిర్ణయం తీసుకున్నట్లు నితిష్ తెలిపారు. కేవలం ఐక్యతా చిహ్నంగా ఉండేందుకే సంకీర్ణ ప్రభుత్వంలో చేరాలనుకోవడం లేదన్నారు. బిహార్ లో సంకీర్ణ ప్రభుత్వం ఉన్నమాట(బీజేపీతో కలిసి) వాస్తవమేనంటూ ఆయన తమ ప్రభుత్వంలో కచ్చితమైన దామాషాలో భాగస్వామ్య పక్షాలకు పదవులిచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. వాజ్ పేయి హయాంలోని ఎన్డీయే ప్రభుత్వంలోనూ మిత్రపక్షాలకు సముచిత స్థానం లభించిందని చెప్పారు.

Thursday, May 30, 2019

Narendra modi ys jagan sworn-in their respective government head posts



పీఎంగా మోదీ సీఎంగా జగన్ ప్రమాణ స్వీకారం
ప్రధానిగా నరేంద్ర మోదీ, ఆంధ్రప్రదేశ్ సీఎంగా వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డిలు గురువారం(మే30) ప్రమాణ స్వీకారం చేశారు. మోదీ రెండోసారి ప్రధానిగా ప్రమాణం స్వీకారం చేయగా ఏపీ రెండో ముఖ్యమంత్రిగా జగన్ తొలిసారి ప్రమాణ స్వీకారం చేశారు. దేశ రాజధాని ఢిల్లీ, ఏపీ రాజధాని అమరావతిల్లో అత్యంత వైభవంగా ప్రమాణ స్వీకార కార్యక్రమాలు జరిగాయి. రాష్ట్రపతి భవన్ లో గురువారం రాత్రి 7గంటలకు రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ప్రధానిగా మోదీతో ప్రమాణ స్వీకారం చేయించారు. మోదీతో పాటు 58 మంది లోక్ సభ, రాజ్యసభలకు చెందిన సభ్యులు మంత్రులుగా ప్రమాణం చేశారు. వీరిలో 25మంది కేంద్రమంత్రులుగా, 9 మంది స్వతంత్ర ప్రతిపత్తిగల సహాయమంత్రులుగా, మరో 24 మంది సహాయమంత్రులుగా ప్రమాణం చేశారు. తెలుగువారిలో తెలంగాణ నుంచి కిషన్ రెడ్డి సహాయమంత్రిగా ప్రమాణం చేయగా ఆరుగురు మహిళా మంత్రులు గురువారం ప్రమాణ స్వీకారం చేశారు. స్మృతి ఇరానీ, నిర్మలా సీతారామన్, హర్ సిమ్రత్ కౌర్ బాదల్, సాధ్వి నిరంజన్ జ్యోతి, రేణుకాసింగ్ సరుతా, దేవశ్రీ చౌదురి మంత్రులుగా ప్రమాణం చేశారు. కార్యక్రమానికి బీజేపీ కురువృద్ధులు అద్వానీ, మనోహర్ జోషి, యూపీఏ చైర్ పర్సన్ సోనియా గాంధీ, కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, గులాం నబీ అజాద్  తదితర ప్రముఖులు హాజరైన వారిలో ఉన్నారు. అలాగే ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి ఈ వేడుకలో పాల్గొన్నారు. ప్రమాణ స్వీకారానికి ఆయా రాష్ట్రాల సీఎంలు మమతా బెనర్జీ(పశ్చిమబెంగాల్), నవీన్ పట్నాయక్(ఒడిశా), పినరయి విజయన్(కేరళ), వై.ఎస్.జగన్(ఏపీ), కేసీఆర్(తెలంగాణ), అమరీందర్ సింగ్(పంజాబ్), భూపేశ్ భగల్(ఛత్తీస్ గఢ్), కమల్ నాథ్(మధ్యప్రదేశ్), అశోక్ గెహ్లాట్(రాజస్థాన్)లు హాజరుకాలేదు.
విభజిత ఆంధ్రప్రదేశ్ రెండో ముఖ్యమంత్రిగా వై.ఎస్.జగన్ తో గవర్నర్ నరసింహన్ మధ్యాహ్నం 12.23 నిమిషాలకు ప్రమాణ స్వీకారం చేయించారు. జగన్ ఒక్కరే ఈరోజు ప్రమాణస్వీకారం చేశారు. విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో జరిగిన ప్రమాణ స్వీకార కార్యక్రమానికి తెలంగాణ సీఎం కేసీఆర్, తమిళనాడు ప్రతిపక్ష నాయకుడు ఎం.కె.స్టాలిన్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ప్రమాణం చేసిన అనంతరం జగన్ ప్రసంగిస్తూ అవినీతి రహిత సుపరిపాలన అందిస్తానని చెప్పారు. వృద్ధాప్య పింఛన్లపై తొలి సంతకం చేసిన జగన్ మొదటి ఏడాది రూ.2250 తర్వాత ఏడాది రూ.2500, ఆపై ఏడాది రూ.2750 చొప్పున అవ్వా,తాతలకు అందిస్తానంటూ ఆ మొత్తాన్ని క్రమంగా పెంచుకుంటూ వెళ్తానని చెప్పారు. గ్రామ వాలంటీర్ ఉద్యోగాలకు సంబంధించి రెండో సంతకం చేశారు. ప్రతి గ్రామానికి 10 మంది చొప్పున రాష్ట్రం మొత్తం లక్షా50వేల గ్రామ వాలంటీర్ల నియామకాలు చేపడతామన్నారు. వారికి వేతనంగా నెలకు రూ.5వేలు చెల్లిస్తామని వారికి మెరుగైన ఉపాధి లభించే వరకు వాలంటీర్లగా కొనసాగుతారన్నారు. రాష్ట్రంలో యువతకు మొత్తం 4 లక్షల ఉద్యోగాలు కల్పించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు జగన్ వివరించారు.

Wednesday, May 29, 2019

left reunification is panacea to fight bjp says cpi



బీజేపీని నిలువరించేందుకు వామపక్షాల ఏకీకరణ అత్యవసరం
దేశంలో భారతీయ జనతా పార్టీ ప్రభంజనాన్ని నిలువరించేందుకు వామపక్షాల ఏకీకరణ అత్యవసరమని సీపీఐ పార్టీ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి పిలుపునిచ్చారు. దేశం కాషాయీకరణ ప్రమాదపుటంచున ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. జులై 19 నుంచి21 వరకు జరగనున్న పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో ఈ దిశగా చర్చల్ని ముమ్మరం చేయనున్నట్లు ఆయన చెప్పారు. బుధవారం(మే29) విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ ఆయన వామపక్షాలన్నీ ఒక్క పార్టీగా ఏకీకృతం కావాలన్న డిమాండ్ గత కొన్నేళ్లుగా కొనసాగుతోందన్నారు. ఇప్పుడు కూడా పరిస్థితులు ఏకీకరణనే డిమాండ్ చేస్తున్నట్లయితే ఆ దిశగా అన్ని వామపక్షాలు అడుగులేయాల్సి ఉంటుందన్నారు. ఇటీవల ఎన్నికల్లో పార్టీ ఓట్ల శాతం ఒకటి కన్నా తక్కువకు పడిపోయిన నేపథ్యంలో జాతీయపార్టీ హోదాను కూడా కోల్పోవాల్సిన పరిస్థితి ఎదురయింది. లోక్ సభ ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత సీపీఐ జాతీయ కార్యవర్గ భేటీలో సమీక్ష నిర్వహించారు. వామపక్షాల సహా లౌకిక, ప్రజాస్వామ్య పార్టీలు ఈ ఎన్నికల్లో బాగా దెబ్బతినడం వల్లే బీజేపీ కూటమి భారీ విజయాన్ని నమోదు చేయగల్గిందని సుధాకర్ రెడ్డి అన్నారు. లౌకికవాదాన్ని కాపాడే క్రమంలో తమిళనాడులోని డీఎంకే సంకీర్ణ పక్షాలకు గౌరవప్రదమైన సంఖ్యలో స్థానాల్ని కేటాయించిందన్నారు. ఒక్క తమిళనాడు లోనే కాంగ్రెస్, డీఎంకే కూటమితో సీపీఐ రెండు స్థానాల్లో విజయం సాధించింది. దేశంలో 1925లో ఏర్పడిన సీపీఐ పార్టీ ఏ రాజకీయ సిద్ధాంతాన్ని అనుసరించాలనే ఏకైక అంశంపై రెండుగా చీలిపోయింది. 1964 కోల్ కతాలో జరిగిన సీపీఐ ఏడో సర్వసభ్య సమావేశాల్లో చీలిక సంభవించి సీపీఐ(ఎం) ఏర్పడింది.

Tragedy averted, 50 girls rescued from blaze in Janakpuri hostel



అగ్నిప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడ్డ 55 మంది బాలికలు
పశ్చిమ ఢిల్లీలో బుధవారం (మే29) ఘోర అగ్నిప్రమాదం సంభవించింది. అయితే ఈ ప్రమాదం బారినపడ్డ 55 మంది బాలికల్ని సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు. సూరత్ లో ఇటీవల ఓ ఆర్ట్ స్టూడియోలో అగ్నిప్రమాదం జరగ్గా 23 మంది విద్యార్థులు ప్రాణాలు కోల్పోయిన విషయం విదితమే. ఢిల్లీ జనక్ పురి మెట్రో రైల్వే స్టేషన్ కు సమీపంలోని ఓ బాలికలు వసతి గృహం(హాస్టల్)లో బుధవారం తెల్లవారుజామున 3 గంటల సమయంలో అగ్నిప్రమాదం సంభవించింది. భారీ అగ్నికీలలు చుట్టుముట్టగా పిల్లలు అల్లాడిపోయారు. దట్టమైన పొగ ఆ ప్రాంతమంతా వ్యాపించింది. ప్రమాద సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక శకటాలతో సిబ్బంది రంగంలోకి దిగారు. అందులోని బాలికలందర్నీ సురక్షితంగా వెలుపలికి తీసుకువచ్చారు. అయితే వీరిలో ఆరుగురు బాలికలు అస్వస్థతకు గురికాగా వారిని సమీపంలో ఆసుపత్రికి తరలించారు. ప్రాథమిక చికిత్స అనంతరం వీరిలో ఇద్దరు బాలికల్ని డిశ్చార్జ్ చేశారు. మరో నలుగురు చికిత్స పొందుతున్నారు. వీరందరి ఊపిరితిత్తుల్లోకి విపరీతంగా పొగ చూరగొనడంతో అస్వస్థతపాలయ్యారు. మంటలు ఇతర ప్రాంతాలకు వ్యాపించకుండా అగ్నిమాపక సిబ్బంది కట్టడి చేశారు. తీవ్రంగా శ్రమించి వసతి గృహ భవనంలో మంటల్ని అదుపులోకి తెచ్చారు. ప్రమాదానికి గల కారణాలు తెలియరావాల్సి ఉందని ఢిల్లీ ఫైర్ సర్వీస్(డి.ఎఫ్.ఎస్) చీఫ్ ఆఫీసర్ అతుల్ గార్గ్ తెలిపారు. తమకు తెల్లవారు 3సమయంలో సమాచారం అందగా వెంటనే అక్కడకు అగ్నిమాపక శకటాలతో సిబ్బంది చేరుకున్నారన్నారు. మంటల్ని 3.30 సమయానికి పూర్తిగా అదుపులోకి తీసుకువచ్చినట్లు తెలిపారు.