Thursday, May 16, 2019

mp teacher who got student slapped 168 times arrested



విద్యార్థిని హోంవర్క్ చేయలేదని 168 చెంపదెబ్బలు.. టీచర్ అరెస్ట్

హోంవర్క్ చేసుకురాలేదని ఓ విద్యార్థినిని పాఠశాల ఉపాధ్యాయుడు 168 చెంపదెబ్బల కఠిన దండన విధించి జైలు పాలయిన ఘటన ఇది. మధ్యప్రదేశ్ లోని జబువా జిల్లాలో ఈ దారుణం జరిగింది. తాండ్లా పట్టణంలోని జవహర్ నవోదయ పాఠశాలలో ఆరో తరగతి చదువుతున్న బాలిక ఆరోగ్యం సరిగ్గా లేక 2018 జనవరి 1 నుంచి 10 వరకు స్కూలుకు రాలేదు. తర్వాత రోజు స్కూలుకు వచ్చిన బాలిక హోంవర్క్ చేయలేదని ఆగ్రహం చెందిన మనోజ్ వర్మ(35) తోటి విద్యార్థులతో 168 చెంపదెబ్బలు కొట్టించాడు. వారానికి ఆరు రోజులు ఒక్కొక్కరూ రెండేసి చెంప దెబ్బలు చొప్పున ఆ బాలికను కొట్టాలని 14 మంది తోటి విద్యార్థులను ఆదేశించాడు.  ఉపాధ్యాయుడు ఆ విధంగా తమ బిడ్డకు శిక్ష అమలు చేశాడని ఆవేదన చెందిన బాలిక తండ్రి శివప్రసాద్ సింగ్ బాలికా సంరక్షణ చట్టం కింద పోలీసులకు ఫిర్యాదు చేశారు. జరిగిన అవమానంతో తల్లిడిల్లిన తమ పాప మానసిక ఆరోగ్యం దెబ్బతినడంతో స్థానిక ఆసుపత్రిలో చికిత్స చేయించామన్నారు. అప్పటి నుంచి ఆ విద్యార్థిని స్కూలుకు వెళ్లేందుకు నిరాకరిచింది. శివప్రసాద్ జరిగిన ఘోరాన్ని స్కూల్ యాజమాన్యం దృష్టికి తీసుకువెళ్లారు. దాంతో వారు ఈ ఘటన దర్యాప్తునకు కమిటీని ఏర్పాటు చేశారు. కమిటీ విచారణలో నిజమని తేలడంతో తాండ్లా పట్టణ పోలీసులు సోమవారం (మే13) ఉపాధ్యాయుడు మనోజ్ వర్మను అరెస్టు చేసి జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ ఫస్ట్ క్లాస్ కోర్టులో హాజరుపరిచారు. కేసు పూర్వపరాలను పరిశీలించిన మేజిస్ట్రేట్ జైపటిదార్ నిందితుడికి బెయిల్ ఇవ్వడానికి నిరాకరిస్తూ 14 రోజుల రిమాండ్ విధించారు. అదే రోజు జైలుకు తరలించాల్సిందిగా ఆదేశాలిచ్చారు.

Wednesday, May 15, 2019

i`ll fight it won't apologise for sharing mamata's photo: bjp activist



జైల్లో చాలా ఇబ్బంది పెట్టారు..క్షమాపణలు చెప్పను: ప్రియాంక శర్మ
`నేనేమీ క్షమాపణలు చెప్పేంత తప్పు చేయలేదు..ఈ కేసుపై పోరాడతా` అని మమతా బెనర్జీ ఫొటో మార్ఫింగ్ కేసులో అరెస్టయిన బీజేపీ యువమోర్చా కార్యకర్త ప్రియాంక శర్మ అన్నారు. న్యూయార్క్ మెట్ గాలాలో పాల్గొన్న ప్రియాంకచోప్రా ఫొటోలో సీఎం మమత ఫొటోను మార్ఫింగ్ చేయడమే కాకుండా తన ఫేస్ బుక్ అకౌంట్ లో పోస్టు చేయడం, ఇతర సామాజిక మాధ్యమాల ద్వారా షేర్ చేయడంతో పశ్చిమబెంగాల్ ప్రభుత్వం ఆమెను అరెస్టు చేసి జైల్లో పెట్టింది.  సుప్రీంకోర్టు బెయిల్ ఇవ్వడంతో బుధవారం(మే15) ఉదయం ఆమె అలీపూర్ జైలు నుంచి విడుదలై బయటకు వచ్చారు.  ఈ సందర్భంగా ఆమె విలేకర్ల తో మాట్లాడుతూ జైలులో తన పట్ల చాలా క్రూరంగా ప్రవర్తించారని చెప్పారు. జైలర్ తనను జైలు గది లోకి నెట్టి తలుపు వేశారన్నారు. అప్పుడు ఆయనతో తనేమీ నేరస్తురాలిని కాదని ఈ విధంగా నెట్టడమేంటని ప్రశ్నించానన్నారు. జైలులో పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయని ప్రియాంక శర్మ చెప్పారు. జైలుకు తరలించడంపై తన కుటుంబంతో పాటు తను కూడా వేదన చెందానన్నారు. ప్రియాంకశర్మ విడుదల సందర్భంగా దక్షిణ కోల్ కతాలో గల జైలుకు పెద్ద సంఖ్యలో బీజేపీ యువమోర్చా కార్యకర్తలు చేరుకుని ఆమెకు ఆహ్వానం పలికారు.

madona`s performance in doubt may 18 Eurovision conest



యూరో విజన్ లో మడోనా పాల్గొనడం అనుమానమే!
ఇజ్రాయిల్ నగరం టెల్ అవివ్ లో మే18న జరుగనున్న యూరో విజన్ పాటల ప్రదర్శనలో ప్రఖ్యాత పాప్ గాయని మడోనా పాల్గొనడం అనుమానంగానే ఉంది. మడోనా పాల్గొంటున్నట్లు ఆమె తరఫు అమెరికా, బ్రిటన్ ప్రచారకర్తలు ఏప్రిల్ లోనే ప్రకటించారు. అయితే ఇంతవరకు ఆమె ఇందుకు సంబంధించిన ఒప్పందంపై సంతకం చేయలేదని యూరోవిజన్ ఎగ్జిక్యూటివ్ సూపర్ వైజర్ జాన్ ఒలా శాండ్ తెలిపారు. ఆమె కాంట్రాక్ట్ పై సంతకం పెడితేనే తమ వేదికపై ప్రదర్శన ఇవ్వగలరన్నారు. తొలుత మడోనా రెండు పాటలు ప్రదర్శించనున్నట్లు ప్రచారం జరిగింది. తాజా ఆల్బమ్ `మేడమ్ ఎక్స్` నుంచి ఓ పాట, 1989లో పేరొందిన తన మరో పాటను ఆమె వేదికపై ప్రదర్శిస్తారని భావించారు. 2010  నుంచి యూరోవిజన్ ను నిర్వహిస్తున్న శాండ్ మాట్లాడుతూ ఇంకా మడోనాతో సంప్రదింపులు జరుపుతున్నామని చెప్పారు. తమ వేదికపై ప్రఖ్యాత కళాకారులు పాల్గొనాలనే కోరుకుంటామని అయితే అందుకు కొన్ని నియమనిబంధనలు కూడా పెట్టుకున్నామని వివరించారు. మే18న యూరో విజన్ కార్యక్రమంలో ద్వితీయ అర్ధభాగం మడోనా పాటల ప్రదర్శనకు ఏర్పాట్లు చేశారు. బుధవారం ఆమె టెల్ అవివ్ చేరుకుని రిహార్సల్స్ లో పాల్గొనాల్సి ఉంది. ఒకవేళ మడోనా ప్రోగ్రాం రద్దయితే ప్రత్యామ్నాయ ఏర్పాట్లపైన యూరో విజన్ దృష్టి సారించినట్లు తెలుస్తోంది.

Tuesday, May 14, 2019

zimbabwe sold 97 elephants to china dubai for $2.7m



చైనా దుబాయ్ లకు ఏనుగుల్ని విక్రయించిన జింబాబ్వే
మా దేశంలో ఏనుగుల సంఖ్య పెరిగిపోతోంది.. వాటిని కాపాడుతూ పోషించే శక్తి మాకు లేదు.. అమ్మేస్తాం.. కొంటారా.. అంటోంది ఆఫ్రికా దేశం జింబాబ్వే. అందుకు తగ్గట్లు గానే ఆరేళ్లలో వంద లోపు ఏనుగుల్ని ఆ దేశం విక్రయాల ద్వారా వదిలించుకుంది. ఇటీవల లెక్కల ప్రకారం ఏనుగుల విక్రయం ద్వారా రూ.14 కోట్ల 55 లక్షలు(2.7మిలియన్ డాలర్లు) ఆర్జించింది. 2012 నుంచి ఇప్పటి వరకు చైనా, దుబాయ్ లకు జింబాబ్వే 97 ఏనుగుల్ని విక్రయించింది. ఇందులో చైనాకు అత్యధికంగా 93 ఏనుగుల్ని, దుబాయ్ కి నాలుగు ఏనుగుల్ని అమ్మేసింది. ఈ విషయన్ని ఆ దేశ పర్యాటక శాఖ మంత్రి ప్రిస్కా ముఫ్మిర వార్తా సంస్థలకు తెలిపారు. విక్రయించిన ఏనుగులన్నీ రెండు మూడేళ్ల లోపువేనన్నారు. తమ అభరణ్యాలు, ఇతర పార్కుల్లో 55 వేల ఏనుగుల్ని మాత్రమే సంరక్షించగలమని అయితే ప్రస్తుతం జింబాబ్వేలో 85 వేల ఏనుగులున్నట్లు ఆయన వివరించారు. ఒక్కో ఏనుగును కనీసం రూ.9లక్షల నుంచి రూ.29లక్షలకు ($13,500- $41,500) విక్రయించామన్నారు. ముఖ్యంగా వేటగాళ్ల బారి నుంచి ఏనుగుల్ని రక్షించడం కూడా ఆఫ్రికా దేశాలకు ఇబ్బందిగానే పరిణమించింది. వాటిని సంరక్షించేందుకు అయ్యే ఖర్చును ఆ దేశాలు భరించే స్థితిలో లేవు. ఈ నేపథ్యంలో అవసరమైన దేశాలకు వాటిని విక్రయించడమే మార్గమని భావిస్తున్నాయి. బోట్స్వానా రాజధాని కసానే లో ఇటీవల జరిగిన ఎలిఫాంట్ సమ్మిట్ సందర్భంగా బోట్స్వానా, జాంబియా, నమిబియా, జింబాబ్వే దేశాల నేతలు ఈ విషయంలో ఏకాభిప్రాయానికి వచ్చారు. ఈ విక్రయాల్లో ప్రస్తుతం జింబాబ్వే ముందు వరుసలో ఉంది.