Wednesday, May 15, 2019

madona`s performance in doubt may 18 Eurovision conest



యూరో విజన్ లో మడోనా పాల్గొనడం అనుమానమే!
ఇజ్రాయిల్ నగరం టెల్ అవివ్ లో మే18న జరుగనున్న యూరో విజన్ పాటల ప్రదర్శనలో ప్రఖ్యాత పాప్ గాయని మడోనా పాల్గొనడం అనుమానంగానే ఉంది. మడోనా పాల్గొంటున్నట్లు ఆమె తరఫు అమెరికా, బ్రిటన్ ప్రచారకర్తలు ఏప్రిల్ లోనే ప్రకటించారు. అయితే ఇంతవరకు ఆమె ఇందుకు సంబంధించిన ఒప్పందంపై సంతకం చేయలేదని యూరోవిజన్ ఎగ్జిక్యూటివ్ సూపర్ వైజర్ జాన్ ఒలా శాండ్ తెలిపారు. ఆమె కాంట్రాక్ట్ పై సంతకం పెడితేనే తమ వేదికపై ప్రదర్శన ఇవ్వగలరన్నారు. తొలుత మడోనా రెండు పాటలు ప్రదర్శించనున్నట్లు ప్రచారం జరిగింది. తాజా ఆల్బమ్ `మేడమ్ ఎక్స్` నుంచి ఓ పాట, 1989లో పేరొందిన తన మరో పాటను ఆమె వేదికపై ప్రదర్శిస్తారని భావించారు. 2010  నుంచి యూరోవిజన్ ను నిర్వహిస్తున్న శాండ్ మాట్లాడుతూ ఇంకా మడోనాతో సంప్రదింపులు జరుపుతున్నామని చెప్పారు. తమ వేదికపై ప్రఖ్యాత కళాకారులు పాల్గొనాలనే కోరుకుంటామని అయితే అందుకు కొన్ని నియమనిబంధనలు కూడా పెట్టుకున్నామని వివరించారు. మే18న యూరో విజన్ కార్యక్రమంలో ద్వితీయ అర్ధభాగం మడోనా పాటల ప్రదర్శనకు ఏర్పాట్లు చేశారు. బుధవారం ఆమె టెల్ అవివ్ చేరుకుని రిహార్సల్స్ లో పాల్గొనాల్సి ఉంది. ఒకవేళ మడోనా ప్రోగ్రాం రద్దయితే ప్రత్యామ్నాయ ఏర్పాట్లపైన యూరో విజన్ దృష్టి సారించినట్లు తెలుస్తోంది.

Tuesday, May 14, 2019

zimbabwe sold 97 elephants to china dubai for $2.7m



చైనా దుబాయ్ లకు ఏనుగుల్ని విక్రయించిన జింబాబ్వే
మా దేశంలో ఏనుగుల సంఖ్య పెరిగిపోతోంది.. వాటిని కాపాడుతూ పోషించే శక్తి మాకు లేదు.. అమ్మేస్తాం.. కొంటారా.. అంటోంది ఆఫ్రికా దేశం జింబాబ్వే. అందుకు తగ్గట్లు గానే ఆరేళ్లలో వంద లోపు ఏనుగుల్ని ఆ దేశం విక్రయాల ద్వారా వదిలించుకుంది. ఇటీవల లెక్కల ప్రకారం ఏనుగుల విక్రయం ద్వారా రూ.14 కోట్ల 55 లక్షలు(2.7మిలియన్ డాలర్లు) ఆర్జించింది. 2012 నుంచి ఇప్పటి వరకు చైనా, దుబాయ్ లకు జింబాబ్వే 97 ఏనుగుల్ని విక్రయించింది. ఇందులో చైనాకు అత్యధికంగా 93 ఏనుగుల్ని, దుబాయ్ కి నాలుగు ఏనుగుల్ని అమ్మేసింది. ఈ విషయన్ని ఆ దేశ పర్యాటక శాఖ మంత్రి ప్రిస్కా ముఫ్మిర వార్తా సంస్థలకు తెలిపారు. విక్రయించిన ఏనుగులన్నీ రెండు మూడేళ్ల లోపువేనన్నారు. తమ అభరణ్యాలు, ఇతర పార్కుల్లో 55 వేల ఏనుగుల్ని మాత్రమే సంరక్షించగలమని అయితే ప్రస్తుతం జింబాబ్వేలో 85 వేల ఏనుగులున్నట్లు ఆయన వివరించారు. ఒక్కో ఏనుగును కనీసం రూ.9లక్షల నుంచి రూ.29లక్షలకు ($13,500- $41,500) విక్రయించామన్నారు. ముఖ్యంగా వేటగాళ్ల బారి నుంచి ఏనుగుల్ని రక్షించడం కూడా ఆఫ్రికా దేశాలకు ఇబ్బందిగానే పరిణమించింది. వాటిని సంరక్షించేందుకు అయ్యే ఖర్చును ఆ దేశాలు భరించే స్థితిలో లేవు. ఈ నేపథ్యంలో అవసరమైన దేశాలకు వాటిని విక్రయించడమే మార్గమని భావిస్తున్నాయి. బోట్స్వానా రాజధాని కసానే లో ఇటీవల జరిగిన ఎలిఫాంట్ సమ్మిట్ సందర్భంగా బోట్స్వానా, జాంబియా, నమిబియా, జింబాబ్వే దేశాల నేతలు ఈ విషయంలో ఏకాభిప్రాయానికి వచ్చారు. ఈ విక్రయాల్లో ప్రస్తుతం జింబాబ్వే ముందు వరుసలో ఉంది.

116 iron nails wire removed from man's stomach in rajasthan faridabad



రాజస్థాన్ లో వ్యక్తి పొట్ట నుంచి 112 మేకుల్ని వెలికితీసిన వైద్యులు
రాజస్థాన్ లో ఓ వ్యక్తి కడుపులో వందల సంఖ్యలో మేకుల్ని కనుగొన్న వైద్యులు ఆశ్చర్యానికి గురయిన ఘటన ఇది. తీవ్రంగా కడుపు నొప్పితో బాధ పడుతున్న బుండికి చెందిన 42 ఏళ్ల భోలా శంకర్ కు ఫరిదాబాద్ ప్రభుత్వాసుపత్రి వైద్యులు సోమవారం (మే13) శస్త్ర చికిత్స చేసి మేకుల్ని తొలగించారు. ఏకంగా 6.5 సె.మీ. పొడవుగల 112 మేకుల్ని చూసిన వైద్యులు ఆశ్చర్యచకితులయ్యారు. కొద్ది రోజుల క్రితం డాక్టర్ అనిల్ సైనీ సీటీ స్కాన్, ఎక్స్ రేలు తీసి శంకర్ కడుపులో మేకులున్నట్లు కనుగొన్నారు. అతనికి సోమవారం శస్త్ర చికిత్స నిర్వహించి వాటిని విజయవంతంగా తొలగించారు. శంకర్, అతని కుటుంబ సభ్యులు తోట పనులు చేస్తుంటారు. అంత పొడవాటి మేకుల్ని శంకర్ ఎలా మింగాడన్నది వైద్యులకు అంతుచిక్కడం లేదు. పెద్ద సంఖ్యలో గల ఆ మేకులన్నీ శంకర్ జీర్ణకోశంలోని చిన్న ప్రేవుల్లోకి చేరుకుంటే ప్రాణానికి హాని జరిగేదని డా.సైనీ తెలిపారు.  అంతేగాక అతని కడుపులో నుంచి ఓ ఇనుప తీగను, ఇనుప గుళికను కూడా విజయవంతంగా వెలికి తీశామన్నారు. ప్రస్తుతం శంకర్ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందన్నారు. అతని మానసిక స్థితిపై కూడా పరీక్షలు నిర్వహించాల్సి ఉందని చెప్పారు. ఇదే తరహా శస్త్ర చికిత్సను ఫరిదాబాద్ వైద్యులు 2017లోనూ నిర్వహించి ఓ వ్యక్తి ప్రాణాల్ని కాపాడారు. బద్రియల్(56) కడుపులో నుంచి 2.5 సె.మీ పొడవున్న 150 సూదుల్ని నాడు వైద్యులు తొలగించారు.

Monday, May 13, 2019

will federal front has a chance to play a role in indian politics now?


సమాఖ్య కూటమి కల సాకారమయ్యేనా?
భారత రాజకీయాల్లో చెరగని ముద్ర వేసి రాజనీతిజ్ఞత కనబరిచిన నేతల్ని వేళ్ల మీదే లెక్కించొచ్చు. ప్రధానమంత్రులుగా ఆ పాత్రలో ఒదిగిపోయి దేశ విదేశాల్లో కీర్తి పతాకను ఎగురువేసిన కొద్ది మందిలో ప్రథమ ప్రధాని పండిట్ నెహ్రూ, ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ, పి.వి.నరసింహారావు, ఎ.బి.వాజ్ పేయి ముందువరుసలో నిలుస్తారు. కొద్ది కాలమే పరిపాలన సాగించిన లాల్ బహుదూర్ శాస్త్రి విలువల రాజకీయాలకు పెట్టింది పేరు. ప్రస్తుతం ఆ స్థాయి ప్రధాని దేశానికి కావాలని దశాబ్దాల తరబడి భారత్ ప్రజలు ఎదురుచూస్తున్నారు. వారికి ప్రత్యామ్నాయం కనిపిస్తోందా? అన్నదే ప్రశ్న. ఆ ప్రయత్నాలే ఇప్పడు మళ్లీ అధికారంలో ఉన్న, వస్తామని భావిస్తున్న ప్రాంతీయ పార్టీల నాయకులు చేస్తుండడం ప్రశంసార్హం. గత సార్వత్రిక ఎన్నికల్లో ఒంటి చెత్తో భారతీయ జనతా పార్టీని ఢిల్లీ గద్దెనెక్కించిన ఘనత నరేంద్రమోదీదే.
అత్యున్నత ప్రధానమంత్రి కుర్చీలోకి వచ్చిన మోదీ ఆ తర్వాత ఎన్డీయే లోని మిత్ర పక్షాలకు కూడా దూరమయ్యారు. మళ్లీ తాజా సార్వత్రిక ఎన్నికల నాటికే వారితో సయోధ్య కుదర్చుకోగలిగారు. పరిపాలనలో మెరుపులు మాటెలా ఉన్నా మరకలుగా పెద్ద నోట్ల రద్దు అంశం, జీఎస్టీ బీజేపీనే  కలవరపాటుకు గురి చేశాయి. నోట్ల రద్దు నేపథ్యంలో కనీవిని ఎరుగని రీతిలో ఏటీఎం క్యూల్లో నిలబడి 100 మందికి పైగా మృతి చెందడం అత్యంత అపకీర్తిని తెచ్చిపెట్టింది. జీడీపీ కుంగిపోయి ద్రవ్యోల్బణం పెంపునకు బాటలు పరిచింది. మహిళలు బంగారం లెక్కలు చెప్పాలని, రశీదులు చూపాలని కోరి మళ్లీ వెనకడుగు వేశారు. అలాగే బ్యాంక్ ల పరిపుష్టి పేరుతో  జనం డిపాజిట్లను బాండ్లుగా మార్చే యోచన(ఎఫ్.ఆర్.డి.ఐ బిల్లు) మోదీ అంటేనే జనానికి భయాన్ని కల్గించింది. జీఎస్టీ అమలు (స్లాబ్ ల సవరణలతో)తదితరాలతో  సామాన్యులు, వ్యాపారులకు ఇబ్బందులు తెచ్చిపెట్టింది. పైగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో ముందుకు సాగాల్సిన సమాఖ్య స్ఫూర్తికి మోదీ పాలన తూట్లు పొడుస్తోందని పలు రాష్ట్రాలు గగ్గోలు పెట్టాయి. ఈ పరిణామాల వల్లే సమాఖ్య కూటమి ఆలోచన మొగ్గతొడిగింది.
తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావు, తమిళనాడు ప్రతిపక్ష డీఎంకె నేత స్టాలిన్ భేటీ ఈ కోణంలోనే ప్రాధాన్యాన్ని సంతరించుకుంది. సమాఖ్య కూటమి ఏర్పాటు దిశగా ఈ అంశాన్ని భుజాలకెత్తుకున్న కేసీఆర్ ప్రయత్నాలు ఆయనే చెప్పినట్లు ఎన్నికల ఫలితాల తర్వాత జోరందుకోవచ్చు. ప్రత్యామ్నాయం అవసరమైన నాడు కాంగ్రెస్ యేతర, బీజీపీ యేతర కూటమి కచ్చితంగా భారత ప్రధాని పీఠం వైపు చురుగ్గా కదులుతుంది. దేశంలో స్వాతంత్ర్యానంతరం రాకాసి సమస్యగా కనీస సౌకర్యాల లేమి ఇంకా పీడిస్తూనే ఉంది. అందుకు విరుగుడుగా అందరికీ కనీస సౌకర్యాలు అందేటటువంటి కేసీఆర్ మోడల్ ప్లాన్, విజన్ ముమ్మాటికి అక్కరకు వస్తాయి. అయితే ప్రస్తుతం కొనసాగుతున్న సమాఖ్య కూటమి ప్రయత్నాలు మళ్లీ బీజేపీ సారథ్యంలోని ఏన్డీయే కూటమికే లబ్ధి చేకూరుస్తాయా? అనే మూలంలోని లోగుట్టును ప్రాంతీయ పార్టీల నేతలు పరిగణనలోకి తీసుకోవాలి.
పశ్చిమబెంగాల్ లో అధికారంలో ఉన్న టీఎంసీ అధినేత మమతా బెనర్జీ, కేరళలో అధికారంలో ఉన్న వామపక్ష భాగస్వామ్య కూటమి నేత విజయన్, తాజాగా తమిళనాడులో ఈసారి లోక్ సభ ఎన్నికల్లో విజయఢంకా మోగించవచ్చని భావిస్తున్న డీఎంకె అధినేత స్టాలిన్ లతో చర్చలు జరిపామనడం వరకు బాగానే ఉంది. అయితే వీరంతా కేంద్రంలో యూపీఏ పక్షాలవారే. ఎన్డీయే లో అయిదేళ్లగా ఇబ్బందుల పడ్డ ఆ కూటమి పార్టీలతో కూడా ఈపాటికే చర్చలు విస్తృతంగా సాగాలి. ఎవరితో చర్చలు జరిపామో, జరుపుతున్నామో అన్నీ ముందే వెల్లడించం కదా అని కేసీఆర్ వ్యాఖ్యానించారు. కాబట్టి ఆయన ఆ కూటమిలోని అసంతృప్తులతోనూ చర్చలకు అంకురార్పణ చేసినట్లుగానే భావించాలి. వాస్తవానికి ఒక అద్భుతమైన స్థిరమైన లక్ష్యంతో చేపట్టిన బృహత్తర కార్యక్రమమది. దేశ రాజకీయాల్ని మలుపుతిప్పే కోట్ల మంది సాధారణ ప్రజల్లో ఆశలు చిగురింపజేసే మహత్కార్యం.
మహారాష్ట్రలో శివసేన, ఒడిశాలో బిజూజనతాదళ్, బిహార్ లో జనతాదళ్ యునైటెడ్ ఎన్డీయే కూటమితో పలు సందర్భాల్లో పొసగక బహిరంగంగానే బీజేపీపై ధ్వజమెత్తాయి. అదీ ఇప్పటి సార్వత్రిక ఎన్నికలకు కొన్ని నెలల వరకు ఆ పార్టీలు బీజేపీ వైఖరిపై కినుక వహించాయి. సమాఖ్య కూటమి ఏర్పాటుకు తపిస్తున్న నేతలు ఆ పార్టీలతో ఏ మేరకు సత్సంబంధాలు నెరిపారో తెలియాలి. దక్షిణాదిలో బీజేపీకి బలం దాదాపు లేనట్లే. హిందీ బెల్ట్ గా చెప్పుకునే అత్యధిక లోక్ సభ నియోజకవర్గాలు గల 10 రాష్ట్రాల్లోని ప్రాంతీయ పార్టీలతో సమాఖ్య కూటమి విస్తృత చర్చలు చేపట్టాలి. సమాఖ్య కూటమి అడుగులు ఈ ఎన్నికల తర్వాత పెద్దగా ముందుకు పడకపోయినా ఈ ఆలోచన మున్ముందు సాకరమయ్యే అవకాశం నూటికి నూరుపాళ్లు ఉంది.