Saturday, May 11, 2019

india vietnam target $15billion trade by 2020



వియత్నాంతో భారత్ రూ.లక్ష కోట్ల ద్వైపాక్షిక వాణిజ్యం దిశగా అడుగులు
భారత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు నాలుగు రోజుల వియత్నాం పర్యటనలో భాగంగా శనివారం ఆ దేశ నేతల్ని కలుసుకున్నారు. ఆయన వియత్నాం వైస్ ప్రెసిడెంట్ డాంగ్ థి న్యాగో థిన్, ప్రధానమంత్రి నగైయెన్ జువాన్ ఫాక్ తదితర నేతలతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఉభయ దేశాల నేతలు ద్వైపాక్షిక వాణిజ్యం, రాజకీయ, రక్షణ, భద్రత తదితర అంశాలపై చర్చలు జరిపారు. భారత్, వియత్నాంలు సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసుకోవాలని ఆకాంక్షించాయి. న్యాగోథిన్ ను భారత్ లో పర్యటించాల్సిందిగా వెంకయ్యనాయుడు ఆహ్వానించారు. ఆగ్నేయాసియా (ఏషియాన్)లో భాగస్వామ్య దేశాలైన భారత్, వియత్నాంలు 2020 నాటికి ద్వైపాక్షిక వాణిజ్యాన్ని రూ.లక్షా 4వేల కోట్ల (15బిలియన్ డాలర్లు) స్థాయికి విస్తరించాలని లక్ష్యంగా పెట్టుకున్నాయి. గత ఏడాదిగా ఉభయ దేశాలు రూ.94 వేల కోట్ల ద్వైపాక్షిక వాణిజ్యం కొనసాగిస్తున్నాయి. 2007 నుంచి ఇరు దేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యం అమలులో ఉండగా ద్వైపాక్షిక వాణజ్యం రూ.54వేల కోట్ల స్థాయిలో జరిగింది. ప్రత్యేకించి ఈ ఏడాది నుంచి ఐ.టి.రంగం, ఎనర్జీ, పునరుత్పాదక శక్తి రంగం, మౌలికసౌకర్యాలు, ఆధునిక వ్యవసాయం, ఆయిల్, గ్యాస్ ఉత్పాదన తదితర రంగాల్లో ద్వైపాక్షిక వాణిజ్యం ద్వారా ముందడుగు వేయాలని నిర్ణయించాయి.


fani cyclonic storm:south central railway loses around Rs.3 crore


 దక్షిణ మధ్య రైల్వేకు ఫొని నష్టం రూ.2.98కోట్లు
గత వారం బీభత్సం సృష్టించిన ఫొని తుపాన్ ధాటికి దక్షిణ మధ్య రైల్వే(ఎస్.సి.ఆర్) సుమారు రూ.2.98 కోట్లు నష్టపోయింది. తుపాన్ సమయంలో 137 రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి. దాంతో రూ.2,97,92,581 ఆదాయాన్ని కోల్పోయినట్లు ఎస్.సి.ఆర్ వర్గాలు తెలిపాయి. కొన్ని రైళ్లు పాక్షికంగా రద్దయితే మరికొన్ని వేరే మార్గాలకు మళ్లించి నడిపారు. కొన్నింటిని పూర్తిగా రద్దు చేశారు. ప్రయాణికుల భద్రతకే పూర్తి ప్రాధాన్యం ఇచ్చి రైల్వే వర్గాలు ఈ నిర్ణయం తీసుకున్నాయి. ఫొని తుపాన్ విరుచుకుపడుతున్న సమయానికే ఎస్.సి.ఆర్ సర్వసన్నద్ధతతో ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టి పెట్టింది. తుపాన్ అనంతరం మే4,5 తేదీల్లో మూడు ప్రత్యేక రైళ్లను సికింద్రాబాద్-భువనేశ్వర్, విజయవాడ-హౌరా, సికింద్రాబాద్-హౌరాలకు నడిపింది. మొత్తం 3,034 మంది వీటిల్లో ప్రయాణించారు. తద్వారా రూ.20.90 లక్షల ఆదాయం వచ్చింది. ఫొని మే3న ఒడిశాలోని పూరిని అతలాకుతంల చేసిన సంగతి తెలిసిందే. తుపాన్ తాకిడికి కోటీ 50లక్షల మంది ఇబ్బందుల పాలయ్యారు. 14 జిల్లాల్లో కనీస, నిత్యావసర సేవలకు విఘాతం కల్గింది. విద్యుత్, నీరు, కమ్యూనికేషన్ వ్యవస్థలు లేక జనం ఇక్కట్లకు గురయ్యారు. 

Friday, May 10, 2019

amazon in talks with workers in Poland as another strike looms

   ఉద్యోగులతో నేరుగా చర్చలకు సిద్ధమైన అమెజాన్



 
జీతాల పెంపును కోరుతూ సమ్మెకు సిద్ధమవుతున్న అమెజాన్ పొలాండ్ డిస్ట్రిబ్యూషన్ కేంద్రం ఉద్యోగులతో సంస్థ యాజమాన్యం శుక్రవారం (మే10) చర్చలకు సిద్ధమని ప్రకటించింది. ఈ ఏడాది స్పెయిన్, జర్మనీ కేంద్రాల్లోనూ ఉద్యోగులు అధిక జీతాలు, మంచి పని పరిస్థితులు కల్పించాలని కోరుతూ సమ్మె బాట పట్టారు. పోలాండ్ లో ప్రస్తుతం ఉద్యోగుల కోరికల్ని సంస్థ పరిగణనలోకి తీసుకుందని సత్వరం వాటిని నెరవేర్చే దిశగా వారితో నేరుగా చర్చలు జరిపేందుకు సిద్ధంగా ఉన్నట్లు అమెజాన్ అధికార ప్రతినిధి ప్రతికలకు తెలిపారు. పోలాండ్ కేంద్రంలో తమ వ్యాపార కార్యక్రమాలు సజావుగా సాగుతున్నాయన్నారు. అయితే గురువారం ఉద్యోగ సంఘాలు తమకు గంటకు చెల్లించే రూ.320-360 (17.5 19.5 జ్లోటీలు) మొత్తాన్ని రెట్టింపు చేయాలని ఆందోళనకు దిగాయి. అమెజాన్ సంస్థ తమ డిమాండ్లను ఇంతవరకు పట్టించుకోలేదని ఉద్యోగ సంఘం మారియా మలినొవ్ స్కా పేర్కొంది. పోలాండో లో అమెజాన్ లో ప్రస్తుతం 14000 మంది పనిచేస్తుండగా మారియా మలినొవ్ స్కా సంఘంలో వెయ్యి మంది సభ్యులున్నారు. ఏప్రిల్ లో సంస్థ ఇక్కడ ముగ్గురు ఉద్యోగుల్ని తొలగించింది. వారు బహిరంగంగానే యెల్లో జాకెట్ (ఇంధనం పన్ను పెంపుపై నిరసన) ఉద్యమానికి మద్దతు తెల్పుతూ సంస్థ నియమ నిబంధనలు, విలువలకు తిలోదకాలిచ్చారని యాజమాన్యం వారిని విధుల నుంచి తప్పించింది. దాంతో యెల్లో జాకెట్ ఉద్యమకారులు ఆ ఉద్యోగులకు సంఘీభావం తెల్పుతూ ఫేస్ బుక్ మెసేజ్ ల ద్వారా ఆందోళనకు తెరతీశారు. అమెజాన్ కేంద్రాల ముట్టడికి యత్నించారు. తాజాగా అమెజాన్ పోలాండ్ కేంద్రం సంస్థ ఉద్యోగ సంఘాల నుంచి నిరసనల్ని ఎదుర్కొంటోంది.

Thursday, May 9, 2019

indian christian serves iftar to nearly 800 muslim workers

యూఏఈలో ఇఫ్తార్ విందు ఇచ్చిన భారతీయ క్రైస్తవ వ్యాపారవేత్త


యూఏఈ(యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్)లో వ్యాపారం నిర్వహిస్తున్న భారతీయ క్రిస్టియన్ సాజి చెరియన్(49) రంజాన్ సందర్భంగా సంస్థలోని సిబ్బందికి బుధవారం ఇఫ్తార్ విందు ఇచ్చారు. ముస్లింల పవిత్ర రంజాన్ మాసం ఈ నెల 7 బుధవారం ప్రారంభమైన సంగతి తెలిసిందే. కేరళలోని కాయంకుళంకు చెందిన సాజి గత ఏడాది ఇక్కడ సుమారు రూ.కోటి 96 లక్షలతో (1.3 మిలియన్ దిర్హామ్) మసీదు నిర్మించారు. తమ సంస్థలో పనిచేసే ఒక్కో ఉద్యోగి నెలకు రూ.15 వేలు(800 దిర్హామ్లు) సంపాదిస్తారు. వారు ప్రతి రంజాన్ మాసంలో సమీపంలోని మసీదులకు టాక్సీల్లో రోజూ ప్రార్థనలకు వెళ్లి రావడానికి రూ.380(20  దిర్హామ్లు) ఖర్చు చేస్తుండడాన్ని గమనించిన ఆయన వారికి ఆ ఖర్చులు లేకుండా చేయాలని మసీదు నిర్మించారని తెలుస్తోంది. 2003లో యూఏఈ(దుబాయ్) చేరిన సాజి సొంతంగా వ్యాపారవేత్తగా ఎదిగారు. తమ సంస్థలో పనిచేసే సిబ్బందికి ఉచిత నివాస సదుపాయాన్ని కల్పించారు. ఫుజర్హాలో ఆయన ఇచ్చిన ఇఫ్తార్ విందులో సంస్థలో పనిచేసే 800 మంది సిబ్బందితో పాటు సమీప కంపెనీలకు చెందిన సీనియర్ ఉద్యోగులు పలువురు పాల్గొన్నారు. గత ఏడాది రంజాన్ సందర్భంగా ప్రారంభించిన మసీదులో ఈ రంజాన్ మాసం అంతా ప్రార్థనల్లో పాల్గొనే ముస్లిం సోదరులందరికీ ఇఫ్తార్ విందు ఇవ్వనున్నట్లు ఈ సందర్భంగా సాజి తెలిపారు. ఖర్జురాలు, తాజా పండ్లు, చిరు ఆహార పదార్ధాలు, పండ్ల రసాలులతో విందు నిర్వహిస్తామన్నారు. రకరకాల బిర్యానీలను రుచి చూపించనున్నట్లు చెప్పారు. విందులో తరతమ స్థాయీ భేదాల్లేకుండా సిబ్బంది, ఉన్నతోద్యోగులంతా ఒక్కచోట చేరి ఇఫ్తార్ విందు ఆరగించడం ఆనందాన్నిస్తోందని సాజి పేర్కొన్నారు. అల్ హయల్ ఇండస్ట్రియల్ ఏరియాలోని ఈస్ట్ విల్లే రియల్ ఎస్టేట్ కాంప్లెక్స్ లోగల మసీదులో 250 మంది ఒకేసారి ప్రార్థనల్లో పాల్గొనే అవకాశం ఉంది. దాన్ని ఆనుకుని ఉన్న మైదానంలో ఒకేసారి మరో 700 మంది ప్రార్థనల్లో పాల్గొనవచ్చని సాజి వివరించారు. పాకిస్థాన్ కు చెందిన బస్ డైవర్ అబ్దుల్ ఖయ్యూం(63) సాజి ఇఫ్తార్ విందు నిర్వహణ ఆమోఘంగా ఉందని కొనియాడారు. ఇటువంటి మంచి వ్యక్తులు ఇంకా ఉండబట్టే ప్రపంచం ఇంకా మనుగడ సాగిస్తోందని ఉద్వేగంతో పేర్కొన్నారు.