Saturday, May 11, 2019

fani cyclonic storm:south central railway loses around Rs.3 crore


 దక్షిణ మధ్య రైల్వేకు ఫొని నష్టం రూ.2.98కోట్లు
గత వారం బీభత్సం సృష్టించిన ఫొని తుపాన్ ధాటికి దక్షిణ మధ్య రైల్వే(ఎస్.సి.ఆర్) సుమారు రూ.2.98 కోట్లు నష్టపోయింది. తుపాన్ సమయంలో 137 రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి. దాంతో రూ.2,97,92,581 ఆదాయాన్ని కోల్పోయినట్లు ఎస్.సి.ఆర్ వర్గాలు తెలిపాయి. కొన్ని రైళ్లు పాక్షికంగా రద్దయితే మరికొన్ని వేరే మార్గాలకు మళ్లించి నడిపారు. కొన్నింటిని పూర్తిగా రద్దు చేశారు. ప్రయాణికుల భద్రతకే పూర్తి ప్రాధాన్యం ఇచ్చి రైల్వే వర్గాలు ఈ నిర్ణయం తీసుకున్నాయి. ఫొని తుపాన్ విరుచుకుపడుతున్న సమయానికే ఎస్.సి.ఆర్ సర్వసన్నద్ధతతో ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టి పెట్టింది. తుపాన్ అనంతరం మే4,5 తేదీల్లో మూడు ప్రత్యేక రైళ్లను సికింద్రాబాద్-భువనేశ్వర్, విజయవాడ-హౌరా, సికింద్రాబాద్-హౌరాలకు నడిపింది. మొత్తం 3,034 మంది వీటిల్లో ప్రయాణించారు. తద్వారా రూ.20.90 లక్షల ఆదాయం వచ్చింది. ఫొని మే3న ఒడిశాలోని పూరిని అతలాకుతంల చేసిన సంగతి తెలిసిందే. తుపాన్ తాకిడికి కోటీ 50లక్షల మంది ఇబ్బందుల పాలయ్యారు. 14 జిల్లాల్లో కనీస, నిత్యావసర సేవలకు విఘాతం కల్గింది. విద్యుత్, నీరు, కమ్యూనికేషన్ వ్యవస్థలు లేక జనం ఇక్కట్లకు గురయ్యారు. 

No comments:

Post a Comment