Tuesday, December 27, 2022

Covid BF-7 Sub Variant Scare: Mock Drill In Hospitals Across Country

దేశ వ్యాప్తంగా కోవిడ్ మాక్ డ్రిల్

ఒమిక్రాన్ సబ్ వేరియంట్ బి.ఎఫ్-7 ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో దేశ వ్యాప్తంగా మంగళవారం మాక్ డ్రిల్ చేపట్టారు. కేంద్ర వైద్య,ఆరోగ్య శాఖ మార్గదర్శకత్వంలో అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని ఆసుపత్రుల్లో ప్రభుత్వ యంత్రాంగం కరోనా నియంత్రణకు సమాయత్తమయింది. గత కొన్ని రోజులుగా చైనా, జపాన్ , హాంకాంగ్, దక్షిణకొరియా తదితర దేశాల్లో బి.ఎఫ్-7 కల్లోలం సృష్టిస్తోంది. దాంతో దేశంలో మోదీ సర్కారు అప్రమత్తమయింది. వ్యాక్సిన్లు, మందులతో పాటు, ఆక్సిజన్ సిలిండర్లు, ఆసుపత్రుల్లో బెడ్లు తదితరాల్ని సిద్ధం చేసుకోవాలని ఇటీవల ఆయా రాష్ట్ర ప్రభుత్వాలను కేంద్రం ఆదేశించింది. అందులో భాగంగా ఈరోజు దేశం మొత్తం కరోనా సన్నద్ధతపై మాక్ డ్రిల్ చేపట్టింది. కొత్త వేరియంట్ ప్రభావం మనదేశంపై అంతగా ఉండకపోవచ్చునంటూనే జాగ్రత్తలు తప్పక పాటించాలని కేంద్రం కోరుతోంది. ఇటీవల మన్ కీ బాత్ కార్యక్రమం సందర్భంగా మోదీ ఇదే విషయాన్ని స్పష్టం చేశారు. బహిరంగ ప్రదేశాల్లో మళ్లీ మాస్కుల్ని తప్పనిసరి చేయాలని కూడా కేంద్ర ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది.

Wednesday, December 21, 2022

CM YSJagan send Tab gifts with Byjus content to 8th class students of A.P

8వ తరగతి విద్యార్థులకు ట్యాబ్ ల పంపిణీ

ఏపీలోని ఎనిమిదో తరగతి విద్యార్థులకు ట్యాబ్ లను బహుమతిగా అందించే కార్యక్రమానికి సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి శ్రీకారం చుట్టారు. బాపట్ల జిల్లాలోని యడ్లపల్లి జడ్పీ హైస్కూల్ లో బుధవారం ఉదయం ఈ సందర్భంగా ఏర్పాటైన సభలో ఆయన మాట్లాడారు. డిజిటల్ విప్లవంలో విద్యార్థుల్ని సైతం భాగస్వాముల్ని చేయడమే తమ ప్రభుత్వ లక్ష్యమన్నారు. బాలబాలికలు నాణ్యమైన విద్యను అందిపుచ్చుకోవాలనే బైజూస్ కంటెంట్ తో కూడిన ట్యాబ్ లను కానుకగా అందిస్తున్నట్లు చెప్పారు. ఇక ప్రతిఏటా ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలలకు చెందిన ఎనిమిదో తరగతి విద్యార్థులకు ట్యాబ్ లను అందజేస్తామన్నారు. ఈ ఏడాదికి సంబంధించి వారం రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఆయా నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేల చేతుల మీదుగా ట్యాబ్ ల పంపిణీ జరుగనుంది. రాష్ట్రంలోని 9703 పాఠశాలల్లో విద్యనభ్యసిస్తున్న 4,59,564 మంది పిల్లలకు, 59,176 మంది ఉపాధ్యాయులకు వీటిని అందించనున్నారు.  ఇందుకుగాను రూ.686 కోట్లను వెచ్చించి మొత్తం 5,18,740 ట్యాబ్ లను పంపిణీ చేయనున్నారు. వీటితో పాటు బైజూస్ కంటెంట్ ను అందించనున్నారు. ఇంటర్నెట్ లేకుండా ట్యాబ్ ల్లో ఆ పాఠాలను చూసి పిల్లలు నేర్చుకునేందుకు ఏర్పాటు చేశారు. ఈరోజు సీఎం జగన్ 50వ పుట్టిన రోజు సందర్భంగా బాలలు ముక్తకంఠంతో శుభాకాంక్షలు తెలిపారు.

Tuesday, November 15, 2022

Tollywood Legendary Veteran Hero SuperStar Krishna

ఆయనే కీర్తి.. ఆయనో స్ఫూర్తి

తెలుగు చలనచిత్రసీమ పరిశ్రమగా ఎదిగి మూడు పువ్వులు, ఆరుకాయలుగా వర్ధిల్లడానికి అహర్నిశలు కృషి చేసిన వారిలో సూపర్ స్టార్ కృష్ణ ఒకరు. అత్యధిక చిత్రాల్లో నటించిన కథనాయకుడిగానే కాక నిర్మాతగా, స్టూడియో అధినేతగా, దర్శకుడిగా తనదైన ముద్ర వేసిన ప్రతిభావంతుడు. 1964 తేనె మనసులు మొదలు, 2016 శ్రీశ్రీ వరకు ఆయన 350కి పైగా సినిమాల్లో నటించి వేలమందికి పని కల్పించిన మహనీయుడు. ఆయన ప్రేక్షకులు, అభిమానుల్ని అలరించడంతో పాటు నిర్మాతల హీరోగా పేరొందిన కీర్తి పతాక. అన్నింటికి మించి మంచి మనసున్న నటశేఖర్ కృష్ణ యావత్ టాలీవుడ్ కి స్ఫూర్తి ప్రదాత. తెలుగు సినీ సీమలో ఆయనదో సువర్ణాధ్యాయం.

Wednesday, November 9, 2022

visakha steel plant employees bike rally against privatization

స్టీల్ ప్లాంట్ కార్మికుల బైక్ ర్యాలీ

విశాఖపట్టణం ఉక్కు కర్మాగారం (ఆర్.ఐ.ఎన్.ఎల్) కార్మికులు నగరంలో బైక్ ర్యాలీ చేపట్టారు. బుధవారం ఉదయం కూర్మానపాలెంలో గల ప్లాంట్ మెయిన్ గేట్ నుంచి జీవీఎంసీ గాంధీ విగ్రహం వరకు నిర్వహించిన ర్యాలీలో ఎంప్లాయీస్ పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అయితే నగరంలో పోలీస్ యాక్ట్ సెక్షన్ 30 అమలులో ఉన్నందున ర్యాలీలకు అనుమతి లేదని ఆ శాఖ ప్రకటించింది. దాంతో ఎక్కడికక్కడ ర్యాలీని అడ్డుకునేందుకు పోలీసులు విఫలయత్నం చేశారు. ఇదిలావుండగా విశాఖ ఉక్కు కర్మాగారం ప్రయివేటీకరణ ప్రయత్నాలకు నిరసనగా కార్మికులు చేపట్టిన ఆందోళన 635వ రోజుకు చేరుకుంది. ప్రధాని మోదీ ఈనెల 12 నగర పర్యటనకు రానున్న నేపథ్యంలో ప్లాంట్ ఎంప్లాయీస్ నిరసన తీవ్రతను పెంచారు. ఆ రోజు నేరుగా ప్రధానిని కలిసి వినతిపత్రం సమర్పించాలని విశాఖ ఉక్కు కర్మాగార పరిరక్షణ సమితి నిర్ణయించింది.