సీఎం కేసీఆర్ కి స్వల్ప అనారోగ్యం
తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు స్వల్ప అనారోగ్యానికి గురయ్యారు. శుక్రవారం ఉదయం ఆయనకు ఎడమవైపు ఛాతీలో కొద్దిగా నొప్పి వచ్చింది. దాంతో కేసీఆర్ ని హుటాహుటిన హైదరాబాద్ లోని యశోదా ఆసుపత్రికి తరలించారు. ఆయనకు వైద్యులు యాంజియోగ్రామ్, సీటీ స్కాన్ పరీక్షలు నిర్వహించారు. పరీక్షల నివేదికలు రావాల్సి ఉంది. అయితే ఈ ఆరోగ్య పరీక్షలు ఏటా యథావిధిగా నిర్వహించేవేనని టీఆర్ఎస్ వర్గాలు పేర్కొన్నాయి. రెండ్రోజులుగా కేసీఆర్ కొంచెం నలతగా ఉన్నారని ఆయన వ్యక్తిగత వైద్యులు డా.ఎమ్వీరావు చెప్పారు. ఆయన ఎడమచెయ్యి లాగుతుందని తెలిపారన్నారు. భయపడాల్సింది ఏమీ లేదని కొద్దిపాటి ఇన్ఫెక్షన్ మాత్రమేనని డాక్టర్ రావు చెప్పారు. పరీక్షల సందర్భంగా ఆసుపత్రిలో ఆయన వెంట సతీమణి శోభ, కుమార్తె కవిత, మనుమడు హిమాన్షు, ఇతర కుటుంబసభ్యులు ఎంపీ సంతోష్ కుమార్ ఉన్నారు. అయితే అనారోగ్యం కారణంగా ఈరోజు ఏర్పాటైన కేసీఆర్ యాదాద్రి పర్యటన రద్దయింది. లక్ష్మీనరసింహస్వామి కల్యాణోత్సవంలో ఆయన పాల్గొనాల్సి ఉంది.