Wednesday, March 9, 2022

CM KCR announces mega recruitment process for 91,142 jobs

కేసీఆర్.. సూపర్ హిట్

* అసెంబ్లీలో జాబ్స్ బాంబ్

* ప్రభుత్వ మెగా జాబ్ మేళా ప్రకటన

తెలంగాణ అసెంబ్లీలో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అదరగొట్టారు. సుమారు లక్ష ఉద్యోగాల భర్తీ ప్రకటనతో సూపర్ హిట్ కొట్టారు. ఉభయ తెలుగు రాష్ట్రాలనే కాక యావత్ దేశం దృష్టిని ఆయన అలవోకగా సాధించారు. ఒకే దెబ్బకు రెండు పిట్టలు చందంగా ఆయన ఇటు రాష్ట్రంలో ప్రతిపక్షాలకి, అటు కేంద్రంలో మోదీ సర్కారుకి నోటమాట రానట్లుగా జాబ్ బాంబ్ పేల్చారు. బుధవారం ఉదయం సరిగ్గా 10 గంటలకు ప్రసంగం మొదలు పెట్టిన కేసీఆర్ ఏకబిగిన గంట సేపు గుక్కతిప్పుకోకుండా మాట్లాడారు. తెలంగాణలో ఇప్పటి వరకు ఖాళీగా ఉన్న మొత్తం 91142 ఉద్యోగాల్ని ఈరోజే నోటిఫై చేస్తున్నామన్నారు. తక్షణం 80039 నియామకాలకు నోటిఫికేషన్ విడుదల చేయబోతున్నట్లు సభ్యుల చప్పట్ల మధ్య ఘనంగా ప్రకటించారు. అదేవిధంగా 11103 కాంట్రాక్ట్ ఉద్యోగాల్ని పర్మినెంట్ చేస్తున్నామన్నారు. ఇకపై రాష్ట్రంలో కాంట్రాక్ట్ ఉద్యోగాలు ఉండవని చెప్పారు. ప్రతి ఏడాది ఉద్యోగ భర్తీ కేలండర్ విడుదల చేయనున్నట్లు సీఎం తెలిపారు. ఒక్క హోంశాఖలోనే 18334 ఉద్యోగాల భర్తీ ఉంటుందన్నారు. అలాగే విద్యాశాఖలో 20వేల పైచిలుకు పోస్టుల నియామకం చేపట్టనున్నట్లు చెప్పారు. వైద్యశాఖలో 12,755, బీసీ సంక్షేమశాఖ 4311, రెవెన్యూశాఖ 3560, ట్రైబల్ వెల్ఫేర్ 2399 పోస్టులు భర్తీ చేయనున్నారు.  ఈ పోస్టుల్లో 95శాతం స్థానికులకు రిజర్వేషన్ ఉంటుందని మిగిలిన 5 శాతం ఓపెన్ కేటగిరీ భర్తీ చేస్తామని సీఎం సగర్వంగా ప్రకటించారు.  తెలంగాణలో 11 ఏళ్ల తర్వాత గ్రూపుల ఉద్యోగాలు భర్తీ చేయనున్నారు. గ్రూప్-1: 503 పోస్టులు, గ్రూప్-2:582 గ్రూప్-3: కింద1373 గ్రూప్-4: 9168 ఉద్యోగ నియామకాలు చేపట్టనున్నామన్నారు. ఓసీలకు 44 ఏళ్లు, ఎస్సీ, ఎస్టీ, బీసీలకు 49 ఏళ్లుగా గరిష్ఠ వయో పరిమితిని ప్రకటించడం విశేషం.

No comments:

Post a Comment