Saturday, February 6, 2021

TDP leader Ganta Srinivasa Rao from Visakha resigns MLA post

టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాస్‌ రాజీనామా

విశాఖపట్నంకు చెందిన టీడీపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి గంటా శ్రీనివాస్‌ రాజీనామా చేశారు. వైజాగ్ స్టీల్‌ ప్లాంట్‌ను ప్రైవేటు పరం చేస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి నిరసనగా ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. అయితే స్టీల్‌ప్లాంట్‌పై కేంద్ర ప్రభుత్వం నిర్ణయం అమల్లోకి వచ్చిన తర్వాతే తన రాజీనామా ఆమోదించాలని స్పీకర్ తమ్మినేని సీతారాంను కోరారు. ఈ సందర్భంగా గంటా మీడియాతో మాట్లాడారు. స్టీల్ ప్లాంట్ వల్లే విశాఖకు ఉక్కు నగరంగా పేరొచ్చిందన్నారు. ఇక్కడ ఉక్కు కర్మాగారాన్ని ప్రయివేటు పరం చేయడమంటే మనిషి తలను మొండెం నుంచి వేరుచేయడమేనని ఆవేదన వ్యక్తం చేశారు.  రాజకీయాలకు అతీతంగా అన్ని పార్టీల నేతలు తమ పదవులకు రాజీనామాలిచ్చి ఉద్యమంలో పాల్గొనగలరనే ఆశాభావం వ్యక్తం చేశారు. మరోవైపు స్టీల్‌ప్లాంట్‌ ఉద్యోగ, కార్మిక సంఘాలు నిరసనల్ని ఉద్ధృతం చేశాయి.  స్థానిక వైఎస్సార్‌సీపీ నేతలు కూడా వారికి మద్దతుగా నిలవడం విశేషం. శనివారం నగరంలో చేపట్టిన ఆందోళనలో అందరూ పాల్గొని భారీ ర్యాలీ నిర్వహించారు. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అంటూ నాడు ఉద్యమకారులు చేసిన త్యాగాలను వృథా కానివ్వబోమని ఎట్టి పరిస్థితిలోనూ విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ను ప్రయివేటీకరణ కానివ్వబోమని ప్రతినబూనారు.

Wednesday, February 3, 2021

Andhra Pradesh Government files petition to ban e-watch app released by state election commissioner Nimmagadda Ramesh Kumar

ఏపీలో ఈ-వాచ్ యాప్

ఆంధ్రప్రదేశ్ లో ఈనెలలో జరగనున్న పంచాయతీ ఎన్నికలపై సమగ్ర నిఘా ఉంచేలా రాష్ట్ర ఎన్నికల సంఘం ఈ-వాచ్ యాప్ ను ఈ రోజు (బుధవారం) ప్రారంభించింది. ఎన్నికలను పూర్తి పాదర్శకంగా నిర్వహించేందుకే యాప్ ను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ తెలిపారు. యాప్ ద్వారా స్వీకరించిన ఫిర్యాదులను ఎస్ఈసీ నుంచి జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో పాటు సంబంధిత అధికారులకు ఫార్వార్డ్ చేస్తామన్నారు. రేపటి నుంచి గూగుల్ ప్లే స్టోర్ లో యాప్ అందుబాటులో ఉంటుందని నిమ్మగడ్డ తెలిపారు. యాప్ ద్వారా చేసిన ఫిర్యాదులు పరిష్కారమయ్యాయా లేదా అనేది కాల్ సెంటర్ ద్వారా పర్యవేక్షిస్తామన్నారు. ఎన్నికల పట్ల ప్రజల్లో నమ్మకాన్ని కలిగించేందుకు టెక్నాలజీ సాయంతో సరికొత్త యాప్ ను అందుబాటులోకి తెచ్చామని ఆయన వివరించారు. అయితే ఈ యాప్ పూర్తిగా ప్రయివేటని అధికారిక కార్యకలాపాలకు వినియోగించరాదంటూ రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు వెళ్లింది. యాప్ ను తీవ్రంగా వ్యతిరేకిస్తున్న ప్రభుత్వం దాన్ని నిలిపేయాలంటూ హైకోర్టులో హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేసింది.

Monday, February 1, 2021

Women SI carried unidentified dead body on her shoulder for 2 kilometers and performing his last rites in Srikakulam district of Andhra Pradesh

యాచకుడి శవానికి మహిళా ఎస్.ఐ అంతిమసంస్కారం 

పోలీసుల్లోనూ మానవతా మూర్తులుంటారని ఓ మహిళా ఎస్.ఐ. నిరూపించారు. ఆంధ్రప్రదేశ్ లోని శ్రీకాకుళం జిల్లా పలాస కాశీబుగ్గ మున్సిపాలిటీ పరిధిలో గల అడవికొత్తూరు గ్రామ పొలాల్లో ఓ గుర్తుతెలియని వృద్ధుడి శవం పడిఉందనే సమాచారంతో ఎస్.ఐ. శిరీష అక్కడకు చేరుకున్నారు. ఆ వ్యక్తి ఎవరైఉంటారనే విషయమై ఆరా తీశారు. అతను బిచ్చగాడని తెలిసింది. అయితే అక్కడి నుంచి శవాన్ని తరలించేందుకు స్థానికులు ముందుకు రాలేదు. దాంతో ఆమె స్వయంగా తన భుజాలపై మృతదేహాన్ని మోసుకెళ్లడానికి సిద్ధమయ్యారు. దాంతో కొందరు ఎస్సై ఔదార్యానికి చలించి సహాయంగా భుజం కలిపారు. దాంతో అందరూ కలిసి రెండు కిలోమీటర్ల మేర పొలం గట్లపై ఆ శవాన్ని మోసుకొచ్చి అంత్యక్రియల కోసం ఏర్పాట్లు చేశారు. వీరికి లలితా చారిటబుల్ ట్రస్ట్ చేయూతనందించింది. ఎస్సై శిరీష చూపిన చొరవకు పోలీసులతో పాటు స్థానికుల నుంచి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. డీజీపీ గౌతమ్ సవాంగ్ స్పందిస్తూ ట్విట్టర్ ద్వారా శిరీషని ప్రత్యేకంగా అభినందించారు.

Saturday, January 30, 2021

Telangana congress MLA Jaggareddy says he stands for United Andhra Pradesh in Vijayawada

కాంగ్రెస్ పై ఏపీ ప్రజలకి కోపం వచ్చింది: టీఎస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి

తెలంగాణ ఫైర్ బ్రాండ్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి తను సమైక్యాంధ్రనే కోరుకున్నానని పేర్కొన్నారు. ఆయన విజయవాడ వచ్చిన సందర్భంగా మీడియాతో ముచ్చటించారు. రాష్ట్రానికి విచ్చేసిన జగ్గారెడ్డికి ఏపీసీసీ అధ్యక్షుడు సాకే శైలజానాథ్ స్వాగతం పలికారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో తెలంగాణ, రాయలసీమ, ఆంధ్ర ప్రాంతాలను దివంగత వై.ఎస్.రాజశేఖరరెడ్డి సమానంగా అభివృద్ధి చేశారని ఆయన గుర్తు చేశారు. ఏపీ విడిపోవద్దని తను ముందు నుంచి కోరుకున్నానని పునరుద్ఘాటించారు. రాష్ట్రం సమైక్యంగా ఉండాలని సీమాంధ్రులు, విడిపోవాలని తెలంగాణ వారు కోరుకున్నారని తెలిపారు. అయితే తెలంగాణ ప్రజల సుదీర్ఘకాల ఆకాంక్ష మేరకే కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక రాష్ట్రం ఇచ్చిందన్నారు. రాష్ట్ర విభజనతో కాంగ్రెస్ పార్టీ పై ఏపీ ప్రజలు చాలా గుర్రుగా ఉన్నారన్నారు. కాంగ్రెస్ మళ్లీ రాష్ట్రంలో అధికారంలోకి వస్తేనే ప్రజలకు మేలు చేకూరుతుందని చెప్పారు. కాంగ్రెస్ పాలన ద్వారానే అన్ని కులాలు, మతాలు సంఘటితమై రాష్ట్రం అభివృద్ధిలోకి వస్తుందన్నారు. మళ్లీ కాంగ్రెస్‌కు అధికారాన్ని ఇవ్వాలని ఏపీ ప్రజలకు జగ్గారెడ్డి  విజ్ఞప్తి చేశారు.