కాంగ్రెస్ పై ఏపీ ప్రజలకి కోపం వచ్చింది: టీఎస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి
తెలంగాణ ఫైర్ బ్రాండ్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి తను సమైక్యాంధ్రనే కోరుకున్నానని పేర్కొన్నారు. ఆయన విజయవాడ వచ్చిన సందర్భంగా మీడియాతో ముచ్చటించారు. రాష్ట్రానికి విచ్చేసిన జగ్గారెడ్డికి ఏపీసీసీ అధ్యక్షుడు సాకే శైలజానాథ్ స్వాగతం పలికారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో తెలంగాణ, రాయలసీమ, ఆంధ్ర ప్రాంతాలను దివంగత వై.ఎస్.రాజశేఖరరెడ్డి సమానంగా అభివృద్ధి చేశారని ఆయన గుర్తు చేశారు. ఏపీ విడిపోవద్దని తను ముందు నుంచి కోరుకున్నానని పునరుద్ఘాటించారు. రాష్ట్రం సమైక్యంగా ఉండాలని సీమాంధ్రులు, విడిపోవాలని తెలంగాణ వారు కోరుకున్నారని తెలిపారు. అయితే తెలంగాణ ప్రజల సుదీర్ఘకాల ఆకాంక్ష మేరకే కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక రాష్ట్రం ఇచ్చిందన్నారు. రాష్ట్ర విభజనతో కాంగ్రెస్ పార్టీ పై ఏపీ ప్రజలు చాలా గుర్రుగా ఉన్నారన్నారు. కాంగ్రెస్ మళ్లీ రాష్ట్రంలో అధికారంలోకి వస్తేనే ప్రజలకు మేలు చేకూరుతుందని చెప్పారు. కాంగ్రెస్ పాలన ద్వారానే అన్ని కులాలు, మతాలు సంఘటితమై రాష్ట్రం అభివృద్ధిలోకి వస్తుందన్నారు. మళ్లీ కాంగ్రెస్‌కు అధికారాన్ని ఇవ్వాలని ఏపీ ప్రజలకు జగ్గారెడ్డి విజ్ఞప్తి చేశారు.
No comments:
Post a Comment