ఏపీలో ఈ-వాచ్ యాప్
ఆంధ్రప్రదేశ్ లో ఈనెలలో జరగనున్న పంచాయతీ ఎన్నికలపై సమగ్ర నిఘా ఉంచేలా
రాష్ట్ర ఎన్నికల సంఘం ఈ-వాచ్ యాప్ ను ఈ రోజు (బుధవారం) ప్రారంభించింది. ఎన్నికలను
పూర్తి పాదర్శకంగా నిర్వహించేందుకే యాప్ ను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు ఎస్ఈసీ
నిమ్మగడ్డ రమేష్ కుమార్ తెలిపారు. యాప్ ద్వారా స్వీకరించిన ఫిర్యాదులను ఎస్ఈసీ
నుంచి జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో
పాటు సంబంధిత అధికారులకు ఫార్వార్డ్ చేస్తామన్నారు. రేపటి నుంచి గూగుల్ ప్లే
స్టోర్ లో యాప్ అందుబాటులో ఉంటుందని నిమ్మగడ్డ తెలిపారు. యాప్ ద్వారా చేసిన
ఫిర్యాదులు పరిష్కారమయ్యాయా లేదా అనేది కాల్ సెంటర్ ద్వారా పర్యవేక్షిస్తామన్నారు.
ఎన్నికల పట్ల ప్రజల్లో నమ్మకాన్ని కలిగించేందుకు టెక్నాలజీ సాయంతో సరికొత్త యాప్
ను అందుబాటులోకి తెచ్చామని ఆయన వివరించారు. అయితే ఈ యాప్ పూర్తిగా ప్రయివేటని
అధికారిక కార్యకలాపాలకు వినియోగించరాదంటూ రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు వెళ్లింది.
యాప్ ను తీవ్రంగా వ్యతిరేకిస్తున్న ప్రభుత్వం దాన్ని నిలిపేయాలంటూ హైకోర్టులో హౌస్
మోషన్ పిటిషన్ దాఖలు చేసింది.