Monday, February 1, 2021

Women SI carried unidentified dead body on her shoulder for 2 kilometers and performing his last rites in Srikakulam district of Andhra Pradesh

యాచకుడి శవానికి మహిళా ఎస్.ఐ అంతిమసంస్కారం 

పోలీసుల్లోనూ మానవతా మూర్తులుంటారని ఓ మహిళా ఎస్.ఐ. నిరూపించారు. ఆంధ్రప్రదేశ్ లోని శ్రీకాకుళం జిల్లా పలాస కాశీబుగ్గ మున్సిపాలిటీ పరిధిలో గల అడవికొత్తూరు గ్రామ పొలాల్లో ఓ గుర్తుతెలియని వృద్ధుడి శవం పడిఉందనే సమాచారంతో ఎస్.ఐ. శిరీష అక్కడకు చేరుకున్నారు. ఆ వ్యక్తి ఎవరైఉంటారనే విషయమై ఆరా తీశారు. అతను బిచ్చగాడని తెలిసింది. అయితే అక్కడి నుంచి శవాన్ని తరలించేందుకు స్థానికులు ముందుకు రాలేదు. దాంతో ఆమె స్వయంగా తన భుజాలపై మృతదేహాన్ని మోసుకెళ్లడానికి సిద్ధమయ్యారు. దాంతో కొందరు ఎస్సై ఔదార్యానికి చలించి సహాయంగా భుజం కలిపారు. దాంతో అందరూ కలిసి రెండు కిలోమీటర్ల మేర పొలం గట్లపై ఆ శవాన్ని మోసుకొచ్చి అంత్యక్రియల కోసం ఏర్పాట్లు చేశారు. వీరికి లలితా చారిటబుల్ ట్రస్ట్ చేయూతనందించింది. ఎస్సై శిరీష చూపిన చొరవకు పోలీసులతో పాటు స్థానికుల నుంచి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. డీజీపీ గౌతమ్ సవాంగ్ స్పందిస్తూ ట్విట్టర్ ద్వారా శిరీషని ప్రత్యేకంగా అభినందించారు.

Saturday, January 30, 2021

Telangana congress MLA Jaggareddy says he stands for United Andhra Pradesh in Vijayawada

కాంగ్రెస్ పై ఏపీ ప్రజలకి కోపం వచ్చింది: టీఎస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి

తెలంగాణ ఫైర్ బ్రాండ్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి తను సమైక్యాంధ్రనే కోరుకున్నానని పేర్కొన్నారు. ఆయన విజయవాడ వచ్చిన సందర్భంగా మీడియాతో ముచ్చటించారు. రాష్ట్రానికి విచ్చేసిన జగ్గారెడ్డికి ఏపీసీసీ అధ్యక్షుడు సాకే శైలజానాథ్ స్వాగతం పలికారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో తెలంగాణ, రాయలసీమ, ఆంధ్ర ప్రాంతాలను దివంగత వై.ఎస్.రాజశేఖరరెడ్డి సమానంగా అభివృద్ధి చేశారని ఆయన గుర్తు చేశారు. ఏపీ విడిపోవద్దని తను ముందు నుంచి కోరుకున్నానని పునరుద్ఘాటించారు. రాష్ట్రం సమైక్యంగా ఉండాలని సీమాంధ్రులు, విడిపోవాలని తెలంగాణ వారు కోరుకున్నారని తెలిపారు. అయితే తెలంగాణ ప్రజల సుదీర్ఘకాల ఆకాంక్ష మేరకే కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక రాష్ట్రం ఇచ్చిందన్నారు. రాష్ట్ర విభజనతో కాంగ్రెస్ పార్టీ పై ఏపీ ప్రజలు చాలా గుర్రుగా ఉన్నారన్నారు. కాంగ్రెస్ మళ్లీ రాష్ట్రంలో అధికారంలోకి వస్తేనే ప్రజలకు మేలు చేకూరుతుందని చెప్పారు. కాంగ్రెస్ పాలన ద్వారానే అన్ని కులాలు, మతాలు సంఘటితమై రాష్ట్రం అభివృద్ధిలోకి వస్తుందన్నారు. మళ్లీ కాంగ్రెస్‌కు అధికారాన్ని ఇవ్వాలని ఏపీ ప్రజలకు జగ్గారెడ్డి  విజ్ఞప్తి చేశారు.

Friday, January 29, 2021

Andhra Pradesh Grama volunteer died in attack in Guntur

అసభ్యంగా ప్రవర్తించాడని వాలంటీర్ హత్య

ఆంధ్రప్రదేశ్‌ గ్రామ వాలంటీర్ ఓ యువతితో అసభ్యంగా ప్రవర్తించాడని ఆమె తల్లిదండ్రులు దాడి చేసి చంపిన ఘటన ఇది. గుంటూరు జిల్లా ఉప్పలపాడులో ఈ దారుణం చోటుచేసుకుంది. 21 ఏళ్ల నంబల నాగరాజు గ్రామ వాలంటీర్‌గా పనిచేస్తున్నాడు. అయితే అతను ఓ యువతితో అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నాడని ఆరోపణలున్నాయి. విషయం తెలుసుకున్న యువతి కుటుంబ సభ్యులు అతనిపై దాడికి పాల్పడ్డారు. తీవ్రంగా గాయపడిన నాగరాజును వినుకొండ ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్పించారు. అయితే అతని పరిస్థితి విషమించడంతో మెరుగైన వైద్యం కోసం నరసరావుపేటకు తీసుకెళ్తుండగా ప్రాణాలు విడిచాడు. వినుకొండ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సమయంలో నాగరాజు మాట్లాడుతూ తను నిద్రలో ఉండగా తలుపులు తీసుకొని వచ్చిన దుండగులు తనపై దాడికి పాల్పడ్డారన్నాడు. ఓ యువతితో వచ్చిన వివాదంతోనే ఆమె బంధువులు తనపై దాడి చేశారని చెప్పాడు. యువతి పట్ల వాలంటీరు అనుసరించిన తీరే ఈ దాడికి కారణమని స్థానికులు పేర్కొంటున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Wednesday, January 20, 2021

Joe Biden sworn in as America`s 46th President

 అమెరికా అధ్యక్షుడిగా జై బైడెన్ ప్రమాణస్వీకారం

అమెరికా ప్రజాస్వామ్యం గెలిచింది.. ఈ గెలుపు ప్రతి అమెరికా పౌరుడిది అని కొత్త శ్వేతసౌధాధిపతి జోబైడెన్ ఉద్ఘాటించారు. ప్రెసిడెంట్ గా బైడన్, వైస్ ప్రెసిడెంట్ గా కమలా హ్యారిస్ లు జనవరి 20 బుధవారం పదవీ ప్రమాణాలు చేశారు. తొలుత కమలా ప్రమాణస్వీకారం చేయగా తర్వాత బైడెన్ ప్రమాణం చేశారు. అనంతరం జాతినుద్దేశించి అధ్యక్షుడిగా తొలి ప్రసంగం చేశారు. మహోన్నత అమెరికా చరిత్రలో ఈ రోజు సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ రోజు `అమెరికా డే` గా పేర్కొన్నారు. చరిత్రలో అమెరికా ఎన్నో సవాళ్లను ఎదుర్కొని అగ్రరాజ్యంగా నిలిచిందన్నారు.  అమెరికా భవిత కోసం ప్రతి ఒక్కరితో కలిసి పనిచేస్తానని బైడెన్ హామీ ఇచ్చారు. ఉగ్రవాదం పీచమణిచేందుకు మరోసారి అమెరికా ఏకతాటిపై ముందుకు సాగాలని ఆకాంక్షించారు. వర్ణ, మత వివక్షలకు తమ పాలనలో తావు ఉండబోదన్నారు. ఇటీవల అమెరికా క్యాపిటల్ హిల్ పై జరిగిన దాడి, హింసతో నెలకొన్న భయాందోళనల్ని యావత్ దేశ ప్రజలు సంఘటితంగా నిలిచి పటాపంచలు చేశారన్నారు. ఈ ప్రమాణస్వీకార కార్యక్రమంలో పూర్వ అమెరికా అధ్యక్షులు బిల్ క్లింటన్, జార్జిబుష్ జూనియర్, బరాక్ ఒబామా హాజరయ్యారు. కానీ ఇప్పటికీ ఎన్నికల్లో తనే గెలిచాననే భ్రమలో ఉన్న (తాజా) మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ మాత్రం ఈ వేడుకకు గైర్హాజరయ్యారు.