వీడిన ఏలూరు వింత వ్యాధి మిస్టరీ
ఎట్టకేలకు ఏలూరు వింత వ్యాధి గుట్టును కేంద్ర వైద్య బృందాలు రట్టు చేశాయి. కూరగాయల్లో మోతాదు మించిన పురుగుల మందులు వాడకం, అదే విధంగా కల్తీ బియ్యం కూడా కారణమని ప్రాథమికంగా అంచనాకు వచ్చారు. వింత వ్యాధి బారిన పడిన బాధితుల రక్తంలో సీసం, నికెల్ ఉన్నట్లుగా ఢిల్లీ ఎయిమ్స్ తెలిపింది. మరికొన్ని సంస్థలు మాత్రం బాధితులు తీసుకున్న ఆహారంలో పురుగుల మందు వంటి రసాయన అవశేషాలు ఉన్నట్లుగా ప్రాథమిక పరిశోధన ఫలితాల్లో వెల్లడించాయి. మూర్చ, నోట్లో నురగ, తలనొప్పి, వికారం, వాంతులు, మతిమరపు, వెన్నునొప్పి, ఆందోళన వంటి లక్షణాలతో వందల మంది గత వారంలో ఆసుపత్రుల పాలయ్యారు. ఈ వ్యాధి వల్ల ఇప్పటికే 622 మంది ఆస్పత్రుల్లో చికిత్సలు పొందారు. అందులో ఒకరు మృత్యుపాలయిన సంగతి తెలిసిందే. బాధితుల్లో 90శాతం మంది డిశ్చార్జి అయ్యారు. అయితే గాలి, నీరు ద్వారా వింత వ్యాధి ప్రబలలేదని స్పష్టమయింది. అలాగే పాలు, మాంసాహారం కారణం కాదని సమాచారం. కార్తీక మాసం కావడంతో చికెన్, మటన్ విక్రయాలు కూడా తగ్గాయి. అదీ గాక బాధితుల్లో 83 శాతం మంది వ్యాధికి గురైన సమయంలో కేవలం శాకాహారం భోజనమే చేసినట్లు చెప్పారు. తాజా నివేదిక ప్రకారం కూరగాయల్లో పురుగుల మందుల అవశేషాలు కనిపించాయి. బియ్యంలో పాస్పరస్ ఆనవాళ్లు లభించినట్లు తెలుస్తోంది.