Thursday, August 22, 2019

Kia Seltos SUV launched by Tiger Shroff in Mumbai


కియా సెల్టాస్ కారును ప్రారంభించిన టైగర్ ష్రాఫ్
మేడ్ ఇన్ ఇండియా కియా సెల్టాస్ కారును కంపెనీ బ్రాండ్ అంబాసిడర్ బాలీవుడ్ స్టార్ టైగర్ ష్రాఫ్ ముంబయిలో గురువారం ప్రారంభించారు. దక్షిణకొరియా దిగ్గజ అటో మోటార్ కార్ప్ కియా కార్ల ఉత్పత్తి కర్మాగారాన్ని భారత్ లో ఆరంభించిన సంగతి తెలిసిందే. ఆంధ్రప్రదేశ్ లోని అనంతపురంలో కియా ఉత్పత్తి కేంద్రంలో తయారైన కియా సెల్టాస్ కారు (రూ.9.7లక్షలు) డిజిల్, పెట్రోల్, టర్బో పెట్రో మోడళ్లలో మార్కెట్ లో లభ్యమౌతోంది. కంపెనీ ప్లాంట్ (పెనుగొండ) లో కియా సెల్టాస్ మోడల్ కు సంబంధించి 5,000 కార్లు సిద్ధంగా ఉన్నాయి. ఈ మోడల్ ఎస్.యు.వి.లకు ఆన్ లైన్ ద్వారా ఇప్పటికే 32,000 బుకింగ్స్ జరిగినట్లు కియా మోటార్స్ ఇండియా ఎండీ, సీఈఓ కుక్యాన్ షిమ్ తెలిపారు. కియా సెల్టాస్ ఎస్.యు.వి.కి ఆసియా దేశాలతో పాటు, యూరప్, లాటిన్ అమెరికా దేశాల్లోనూ డిమాండ్ రావచ్చన్నారు. టర్కీలో తయారవుతున్న హుండై గ్రాండ్ ఐ-10 నియోస్ కు కియా సెల్టాస్ గట్టి పోటీ ఇవ్వొచ్చని భావిస్తున్నారు. యూరప్ మార్కెట్  ప్రధానంగా హుండై గ్రాండ్ ఎన్ సీరిస్ కార్ల విక్రయాలు కొనసాగుతున్నాయి. భారత్ లో గత కొద్ది నెలలుగా విక్రయాల పరంగా ఆటోమొబైల్ పరిశ్రమ గడ్డు పరిస్థితుల్ని ఎదుర్కొంటున్న సమయంలో కియా చాలెంజ్ గా తమ కన్జ్యూమర్ ఫ్రెండ్లీ కార్లను విడుదల చేస్తోంది. ప్రతి మూణ్నెలకో కొత్త మోడల్ కారుతో మార్కెట్లోకి అడుగుపెట్టనున్నామని కియా ప్రకటించడం విశేషం.

Wednesday, August 21, 2019

Madame Tussauds welcomes its new entrant..A Burger


టుస్సాడ్స్ మ్యూజియంలో బర్గర్ బొమ్మ
జీవకళ ఉట్టిపడేలా మైనపు బొమ్మల్ని రూపొందించి ప్రదర్శించే టుస్సాడ్స్ మ్యూజియంలో కొత్త స్టార్ కొలువుదీరాడు.  స్టార్ అంటే హాలీవుడ్, బాలీవుడ్, టాలీవుడో లేదంటే ఏ స్పోర్ట్స్ స్టార్ కాదండోయ్.. స్టార్లతో పాటు వారూవీరు అనే తేడా లేకుండా ప్రపంచవ్యాప్తంగా అందరూ ఇష్టంగా ఆరగించే బర్గర్.. ఈసారి టుస్సాడ్స్ మ్యూజియంలో కొలువుదీరిన కొత్త స్టార్. కె.ఎఫ్.సి. బర్గర్ ను మైనంతో రూపొందించి ఢిల్లీలోని మ్యూజియంలో ప్రదర్శనకు ఉంచారు. తినే బర్గర్ కంటే ఈ టుస్సాడ్స్ (మైనపు) బర్గర్ సైజులో 1.5 రెట్లు పెద్దది. అల్లపు రుచితో ప్రపంచవ్యాప్తంగా నోరూరిస్తున్న తమ జింజర్ బర్గర్ ప్రపంచ ప్రసిద్ధ టుస్సాడ్స్ మ్యూజియంలో కొలువుదీరడం పట్ల కె.ఎఫ్.సి. ఇండియా మార్కెటింగ్ ఆఫీసర్ మోక్ష్ చోప్రా సంతోషం వ్యక్తం చేశారు. కె.ఎఫ్.సి. జింజర్ బర్గర్ కు టుస్సాడ్స్ మ్యూజియంలో స్థానం దక్కి ఓ సెలబ్రెటీ స్టేటస్ పొందడం తమను సంభ్రమాశ్చర్యాలకు గురిచేసిందన్నారు.  అంతరిక్షంలోకి కూడా వెళ్లిన ఏకైక బర్గర్ తమదేనని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. అదేవిధంగా ట్యాటూ (పచ్చబొట్టు) గా తమ బర్గర్ ను పలువురు ముద్రించుకోవడం తెలిసిందేనన్నారు. కె.ఎఫ్.సి. సంస్థ తమ ఉత్పత్తుల ప్రచారాన్ని ఎల్లలు దాటించడంలో భాగంగా జింజర్ బర్గర్ ను 2017లో అంతరిక్షంలోకి పంపించింది.

Tuesday, August 20, 2019

Rajiv Gandhi birth anniversary: Top Congress leaders pay tributes to former PM


ఘనంగా రాజీవ్ గాంధీ 75వ జయంతి
భారత మాజీ ప్రధాని దివంగత రాజీవ్ గాంధీ 75వ జయంతి వేడుకల్ని దేశవ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణులు ఘనంగా నిర్వహించాయి. పలువురు నాయకులు ఢిల్లీలోని వీర్ భూమిలో రాజీవ్ సమాధి వద్ద ఘనంగా నివాళులర్పించారు. సోనియాగాంధీ, మన్మోహన్ సింగ్, రాహుల్, ప్రియాంక, కూతురు మిరయా, కొడుకు రేహన్, భర్త రాబర్ట్ వాద్రా పుష్పాంజలి ఘటించారు. మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, మాజీ ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీ, గులాంనబీ అజాద్ తదితర నాయకులు వీర్ భూమికి చేరుకుని ఘనంగా నివాళులర్పించారు. రాహుల్ గాంధీ ఈ సందర్భంగా ట్వీట్ చేస్తూ తన తండ్రి రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణులు వారం రోజుల పాటు స్మారక కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ప్రియతమ నేత రాజీవ్ గాంధీ సమాచార సాంకేతిక విప్లవానికి నాంది పలికారంటూ సంబంధిత వీడియోను రాహుల్ గాంధీ ట్విటర్ లో పోస్ట్ చేశారు.

Monday, August 19, 2019

Dr.Manmohan Sing elected to Rajya Sabha from Rajasthan


మళ్లీ రాజ్యసభలో అడుగుపెట్టనున్న మన్మోహన్ సింగ్
భారత మాజీ ప్రధాని ఆర్థికవేత్త డాక్టర్ మన్మోహన్ సింగ్ మళ్లీ రాజ్యసభకు ఎన్నికయ్యారు. ఈసారి ఆయన రాజస్థాన్ నుంచి రాజ్యసభలో అడుగుపెడుతున్నారు. గతంలో ఆయన అసోం నుంచి రాజ్యసభకు ఎన్నికయ్యారు. ఆయన పదవీ కాలం గత నెలలో ముగిసిన సంగతి తెలిసిందే. 86 ఏళ్ల మన్మోహన్ అసోం నుంచి అయిదుసార్లు వరుసగా రాజ్యసభకు ఎన్నికయ్యారు. 1991 నుంచి 2019 వరకు ఆయన అసోం తరఫున సభలో ప్రాతినిధ్యం వహించారు. ప్రస్తుతం అసోంలో కాంగ్రెస్ ప్రభుత్వం లేకపోవడం తగినంత మంది శాసనసభ్యుల సంఖ్యాబలం లేకపోవడంతో పార్టీ అధిష్ఠానం ఆయనను రాజస్థాన్ నుంచి రాజ్యసభకు పంపుతోంది. రాజస్థాన్ లో గత ఏడాదే అశోక్ గహ్లోత్ నేతృత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరింది. గతంలో రాజ్యసభలో రాజస్థాన్ నుంచి ప్రాతినిధ్యం వహించిన ఆ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు మదన్ లాల్ సైనీ జూన్ లో అకస్మికంగా మరణించారు. దాంతో రాజస్థాన్ నుంచి ఖాళీ పడిన ఆ స్థానం నుంచి మన్మోహన్ ను కాంగ్రెస్ పార్టీ రాజ్యసభకు ఎంపిక చేసింది. ఈసారి బీజేపీ ఆ స్థానం నుంచి తమ అభ్యర్థిని పోటీకి నిలపలేదు. రాజ్యసభలో మొత్తం సభ్యుల సంఖ్య 245 కాగా 233 మంది సభ్యులు ఎన్నికవుతారు, మరో 12 మందిని రాష్ట్రపతి ఎంపిక చేస్తారు. ప్రస్తుతం ఈ ఎగువ సభలో అధికార బీజేపీకి 78 మంది సభ్యుల సంఖ్యా బలం ఉండగా కాంగ్రెస్ కు 47 మంది సభ్యులున్నారు.