Wednesday, August 7, 2019

Prez, PM, Sonia among hundreds who pay homage to Swaraj at her residence


సుష్మా స్వరాజ్ కు నేతల కన్నీటి వీడ్కోలు
భారత మాజీ విదేశాంగశాఖ మంత్రి భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు సుష్మాస్వరాజ్ (67)కు దేశ విదేశాలకు చెందిన నేతలు కన్నీటి వీడ్కోలు పలికారు. మంగళవారం రాత్రి ఆమె ఆకస్మికంగా (కార్డియక్ అరెస్ట్-గుండె ఆగిపోవడం) మరణించారు. అంతకు కొద్ది సేపు క్రితం కూడా జమ్ముకశ్మీర్ దేశంలో పరిపూర్ణంగా విలీనమైనందుకు ఆమె సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఈ మేరకు ట్విటర్ ద్వారా దేశ ప్రధాని, హోంమంత్రులు మోదీషాల్ని అభినందిస్తూ చిరకాల స్వప్నాన్ని ఈరోజు నిజం చేశారంటూ ప్రశంసించారు. సమాచారం అందగానే పార్టీలకతీతంగా నేతలు బుధవారం ఢిల్లీలోని సుష్మాస్వరాజ్ నివాసానికి చేరుకుని ఆమె పార్థివదేహం వద్ద నివాళులర్పించారు. సుష్మా మరణవార్త విని ఆమె గురువు బీజేపీ అగ్రనేత అద్వానీ తల్లడిల్లిపోయారు. కంటతడి పెడుతూ ఆమెతో సాన్నిహిత్యాన్ని గుర్తు చేసుకున్నారు. సుష్మా తన ప్రతిపుట్టిన రోజుకు వచ్చి ఇష్టమైన చాక్లెట్ కేక్ ఇచ్చి వెళ్లేవారంటూ అద్వానీ గుర్తు చేస్తుకున్నారు. తమ పార్టీలోకి యువకెరటంలా వచ్చిన సుష్మా అనంతర కాలంలో అత్యున్నతమైన నేతగా ఎదిగారన్నారు. ఉగాండా అధ్యక్షులు మరియా ఫెర్నాండ ఎస్పినోస నివాళులర్పించారు. సుష్మా జీవిత కాలం ప్రజాసేవకు అంకితమైన ఓ గొప్ప నేతగా సంతాప సందేశంలో పేర్కొన్నారు. రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ప్రధాని నరేంద్రమోదీ, లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా, నోబెల్ శాంతి బహుమతి గ్రహీత కైలాస్ సత్యర్థి, హోంమంత్రి అమిత్ షా, యూపీఏ చైర్ పర్సన్ సోనియాగాంధీ, కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, సీనియర్ నాయకులు గులాంనబీ అజాద్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, సీపీఎం నాయకులు బృందా కారత్, బీఎస్పీ అధినేత్రి మాయవతి, ఎస్పీ సీనియర్ నాయకుడు ములాయం సింగ్ తదితరులు ఆమెకు ఘనంగా నివాళులర్పించారు. పార్టీ శ్రేణులు, అభిమానుల కడసారి నివాళుల కోసం సుష్మా పార్థివ దేహాన్ని ఆమె ఇంటి నుంచి తరలించి కొద్దిసేపు బీజేపీ ప్రధాన కార్యాలయంలో ఉంచారు. అనంతరం లోదీ రోడ్ లోని శ్మశానవాటికలో సుష్మాస్వరాజ్ అంత్యక్రియల్ని నేతలు, అభిమానులు అశ్రునయనాల మధ్య ప్రభుత్వ లాంఛనాలతో ఘనంగా నిర్వహించారు.

Tuesday, August 6, 2019

Parliament passes Consumer Protection Bill


వినియోగదారుల హక్కుల రక్షణ బిల్లు-2019కు పార్లమెంట్ ఆమోదముద్ర
వినియోగదారుల హక్కుల రక్షణకు సంబంధించిన బిల్లుకు భారత పార్లమెంట్ ఆమోదముద్ర వేసింది. ఎగువ సభ మంగళవారం వినియోగదారుల రక్షణ బిల్లు-2019ను మూజువాణి ఓటుతో ఆమోదించింది. ఇంతకుముందే లోక్ సభలో ఈ బిల్లు పాసయింది. ఈ బిల్లుకు సంబంధించి పార్లమెంట్ స్థాయీ సంఘం పేర్కొన్న అయిదు సూచనల్ని చేరుస్తూ కేంద్ర ఆహార, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి రామ్ విలాస్ పాశ్వాన్ రాజ్యసభలో ప్రవేశపెట్టారు. 1986 మార్చి 15 నాటి వినియోగదారుల హక్కుల రక్షణ చట్టం స్థానంలో ప్రస్తుత పార్లమెంట్ ఆమోదం పొందిన వినియోగదారుల హక్కుల రక్షణ చట్టం-2019 అమలులోకి రానుంది. సీపీఐ సభ్యులు డెరెక్ ఒబెరాయ్, కెకె రాగేష్ సూచనల ప్రకారం బిల్లులో సవరణలకు గాను పార్లమెంట్ స్థాయి సంఘానికి పంపామని మంత్రి పాశ్వాన్ తెలిపారు. అత్యధిక సభ్యుల అభ్యంతరాల మేరకు ఆరోగ్య సంరక్షణాంశాల్ని బిల్లు నుంచి కేంద్ర ప్రభుత్వం మినహాయింపునిచ్చినట్లు చెప్పారు. అవివాదాస్పదంగా రూపుదిద్దుకున్న తాజా వినియోగదారుల హక్కుల రక్షణ బిల్లు ప్రకారం వినియోగదారులు వస్తు నాణ్యత, సేవలకు సంబంధించిన ఫిర్యాదుల్ని వినియోగదారుల వివాద పరిష్కారాల కమిషన్, ఫోరంల్లో ఫిర్యాదు చేయొచ్చు. వినియోగదారులు జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయుల్లో కమిషన్, ఫోరంల్లో ఫిర్యాదు చేసి న్యాయం పొందే అవకాశం లభిస్తుంది. వినియోగదారులకు లోపభూయిష్ఠ సేవలు, నాణ్యత లేని వస్తువులు విక్రయించినట్లయితే కొత్త వస్తువులు లేదా సొమ్ము అందజేతకు సంబంధించి  న్యాయం జరిగేలా సెంట్రల్ కన్జ్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ (సీసీపీఏ) అవసరమైన పక్షంలో పర్యవేక్షణ చేస్తుంది.

Monday, August 5, 2019

Assisted dying:Australian cancer patient first to use new law


ఆస్ట్రేలియాలో స్వచ్ఛంద మరణం పొందిన తొలి కేన్సర్ రోగి

కేన్సర్ తుది దశకు చేరుకుని వ్యధ అనుభవిస్తున్న ఆస్ట్రేలియా మహిళ కెర్రీ రాబర్ట్ సన్(61) కారుణ్య మరణం పొందారు. యూథనేష్యా (వ్యాధి నయం అవుతుందనే ఆశ లేనప్పుడు మందులతో ప్రాణం పోగొట్టడం) ద్వారా ప్రాణాలు విడిచిన తొలి కేన్సర్ రోగి ఆమె. విక్టోరియా రాష్ట్రంలో ఆమె తనకు స్వచ్ఛంద మరణం ప్రసాదించాలని ప్రభుత్వాన్ని అభ్యర్థించి నిపుణులైన వైద్యుల సమక్షంలో మరణాన్ని ఆశ్రయించారు. ఈ వివాదాస్పద `కారుణ్య మరణ చట్టం` ఆ రాష్ట్రంలో కొత్తగా అమలులోకి వచ్చింది. ఆరు నెలలకు మించి రోగి బతకరనే వైద్యుల నివేదిక ఆధారంగా సుశిక్షితులైన వైద్యుల పర్యవేక్షణలో మరణాన్ని ప్రసాదిస్తారు. భరించలేని బాధను అనుభవిస్తున్న రోగి స్వచ్ఛంద మరణాన్ని కోరుకుంటూ దరఖాస్తు చేసిన 29 రోజులకు ప్రభుత్వం అనుమతి మంజూరు చేస్తుంది. జూన్ లో ఈ మేరకు అభ్యర్థించిన కెర్రీకి జులైలో ప్రభుత్వం అనుమతించింది. కుటుంబ సభ్యులు కూడా `ఆమె కోరుకున్న అధికారం మరణం`(The empowered death that she wanted) అని ప్రభుత్వానికి రాసిన లేఖలో పేర్కొన్నారు. కెర్రీకి జాక్వి, నికోల్ అనే ఇద్దరు కూతుర్లున్నారు. ఆమె అంతిమ ఘడియల్లో బంధువులందరూ దగ్గరే ఉన్నామని.. తన తల్లి కెర్రి చివరి మాటగా జీవితాన్ని నిరాడంబరంగా, హుందాగా గడపమని సూచించినట్లు నికోల్ రాబర్ట్ సన్ తెలిపింది. ఆమె జీవించిన క్షణాలన్నీ సంతోషంగా ఉండేటట్లు చూసుకున్నామని అలాగే ఆమె మరణం లోనూ ప్రశాంతంగా సాగిపోయేందుకు సహకరించామంది. రాబర్ట్ సన్ ప్రకటనను `చారిటీ గో జెంటిల్ ఆస్ట్రేలియా` విడుదల చేసింది. 2010 నుంచి బ్రెస్ట్ కేన్సర్ తో బాధపడుతున్న కెర్రీ 2019 జులై వరకు కిమో థెరపీ, రేడియేషన్ చికిత్స తీసుకున్నారు. ఆమె ఈ చికిత్సలు తీసుకుంటున్న క్రమంలో అనేక సైడ్ ఎఫెక్ట్ లకు గురయ్యారు. కేన్సర్ ఆమె శరీరంలోని ఇతర భాగాలకు వ్యాపించింది. ఎముకలు, ఊపిరితిత్తులు, మెదడు, కాలేయ భాగాలకు వ్యాధి సోకింది. భరించలేని బాధను అనుభవిస్తున్న ఆమె విక్టోరియా రాష్ట్రంలో కొత్తగా వచ్చిన చట్టం ప్రకారం మరణాన్ని పొందింది. ఇదే తరహా కారుణ్య మరణాలు కెనడా, నెథర్లాండ్స్, బెల్జియంల్లో అమలులో ఉన్నాయి.

Sunday, August 4, 2019

Chandrayan-2 captures imges of earth


చంద్రయాన్-2 తీసిన భూమి చిత్రాలను విడుదల చేసిన ఇస్రో
చంద్రయాన్ -2 తీసిన భూమి తాజా చిత్రాల్ని ఇస్రో ఆదివారం విడుదల చేసింది. మిషన్ లోని విక్రమ్ లాండర్ అధునాతన ఎల్.ఐ.4 కెమెరా ద్వారా తీసిన చిత్రాలు శనివారం సాయంత్రం 6.28కి భూమికి చేరాయి. వీటిని ఇస్రో అధికారికంగా విడుదల చేసింది. అంతకుముందు వారం రోజుల క్రితం చంద్రయాన్-2 తీసిన చిత్రాలంటూ వైరల్ అయిన ఫొటోలు నకిలీవిగా తేలింది. ప్రస్తుతం ఇస్రో విడుదల చేసిన చంద్రయాన్-2  ఫొటోలు అత్యంత నాణ్యమైనవిగా ఉన్నాయి. వైరల్ అయిన ఫొటోల్లో కొన్ని గతంలో నాసా (అమెరికా) తీసిన చిత్రాలు, మరికొన్ని అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐ.ఎస్.ఎస్.) నుంచి వ్యోమగాములు తీసిన చిత్రాలు కావొచ్చని తెలుస్తోంది. వీటిని మార్ఫింగ్ చేసి వైరల్ చేశారంటున్నారు. ఇదిలా ఉండగా చంద్రుడిపైకి చంద్రయాన్-2 రోవర్ సెప్టెంబర్ 7కు చేరుకోవచ్చని భావిస్తున్నారు. ఇస్రో ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన చంద్రయాన్-2 ప్రయోగం జులై 22న విజయవంతమైన సంగతి తెలిసిందే. చంద్రయాన్-1  ప్రయోగం విజయవంతమైన 11 ఏళ్లకు ఇస్రో ఈ రెండో ప్రయోగాన్ని చేపట్టింది. చంద్రుడిపై తొలి ప్రయోగాన్ని ఇస్రో 2008 అక్టోబర్ లో చేపట్టి విజయం సాధించింది. చంద్రుడి దక్షిణ ధ్రువం నీటి జాడల్ని ఇస్రో ఈ ప్రాజెక్టు ద్వారానే ప్రపంచానికి వెల్లడించింది. ప్రస్తుతం చంద్రయాన్-2 రెండు కక్ష్యల్ని దిగ్విజయంగా అధిగమించి ఆగస్ట్ 6న మూడో కక్ష్యలోకి అడుగుపెట్టనుంది.