Friday, August 2, 2019

Panic grips Kashmir after J-K govt asks yatris, tourists to leave Valley


అమర్ నాథ్ యాత్రకు ఉగ్రవాదుల ముప్పు
·       యాత్రికులు తక్షణం లోయ నుంచి వెనక్కి రావాలని ప్రభుత్వ సూచన
జమ్ము-కశ్మీర్ లో ఉగ్రవాద ప్రమాద ఘంటికలు మోగుతున్నాయి. ముఖ్యంగా అమర్ నాథ్ యాత్రికులే లక్ష్యంగా పాకిస్థాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు పెను దాడులకు తెగబడనున్నట్లు నిఘా వర్గాలు అత్యంత కీలక సమాచారాన్ని అందించాయి. దాంతో నాలుగు రోజులుగా అమర్ నాథ్ యాత్రికుల్ని ఎక్కడికక్కడ సైన్యం నిలిపివేసింది. నిఘా విభాగాల హెచ్చరికల నేపథ్యంలో అమర్ నాథ్ యాత్రికులు తక్షణం లోయను విడిచి వెళ్లాలని ప్రభుత్వం సూచించింది. కేంద్ర హోంమంత్రిత్వ శాఖ నుంచి ఈ మేరకు నోటీస్ జారీ అయింది. వీలైనంత తొందరగా యాత్రికుల్ని లోయలో వారు బస చేస్తున్న ప్రాంతాల నుంచి వెనక్కి పంపాలని అమర్ నాథ్ యాత్ర మార్గాన్ని పర్యవేక్షిస్తున్న సైనిక విభాగానికి సమాచారమిచ్చింది. మరోవైపు స్థానికులు నిత్యావసర సరుకుల్ని నిల్వ చేసుకుంటున్నారు. గడచిన రెండ్రోజుల్లో సైన్యం అమర్ నాథ్ యాత్ర మార్గంలో తనిఖీలు చేపట్టగా పెద్ద ఎత్తున మందుపాతరలు వెలుగుచూశాయి. బాంబు నిర్వీర్య దళాలు ఈ శక్తిమంతమైన మందుపాతరను వెలికితీశాయి. బాంబులపై పాకిస్థాన్ ఆయుధాగారం ముద్రను సైన్యం గుర్తించింది. అమెరికా తయారీ అధునాతన తుపాకీ ఎం-24 (పొంచి ఉండి కాల్పులు జరిపేందుకు ఉపయోగించే-స్నైపర్ రైఫిల్) తనిఖీల్లో లభ్యమైంది. దాంతో లెఫ్టినెంట్ జనరల్ కె.జె.ఎస్.ధిలాన్ భద్రతా దళాలకు ఉగ్రవాద ముప్పు గురించి వివరాలందించి సర్వసన్నద్ధం చేశారు. యాత్ర మార్గంలో సైన్యం తనిఖీలు కొనసాగుతున్నాయి. అయితే తమకు బేస్ క్యాంప్ నుంచి యాత్ర ముగించాలని ఆదేశాలేవీ అందలేదని యాత్రికులు అంటున్నారు. అయినా పరిస్థితి ఉద్రిక్తంగా ఉన్నట్లే భావిస్తున్నామని కొందరు యాత్రికులు తెలిపారు. యాత్రను అర్ధాంతరంగా ముగించాల్సి రావడం నిరాశ కల్గిస్తుందన్నారు. యాత్ర కొనసాగించేందుకు కొందరు యాత్రికులు  నాలుగ్రోజులుగా ఎదురు చూస్తున్నారు. అంతకంతకు పరిస్థితి తీవ్రంగా మారుతుండడంతో అమర్ నాథ్ మంచు శివలింగ దర్శనానికి నోచుకోలేకపోతున్నామని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Thursday, August 1, 2019

Make it mandatory for mps to visit child welfare centers demands supriya sule


లైంగిక అకృత్యాల నుంచి బాలల సంరక్షణ బిల్లుకు లోక్ సభలో ఏకగ్రీవంగా మద్దతు
లోకసభలో గురువారం పార్టీలకు అతీతంగా సభ్యులు లైంగిక అకృత్యాల నుంచి బాలల సంరక్షణ బిల్లుకు ఏకగ్రీవంగా మద్దతు తెలిపారు. కేంద్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి స్మృతి ఇరానీ ఈ బిల్లును సభలో ప్రవేశపెట్టారు. ఈ బిల్లు ప్రకారం చిన్నారులపై లైంగిక దాడులకు పాల్పడిన వారికి మరణశిక్ష పడుతుంది. ఈ బిల్లు పట్ల అన్ని పక్షాల సభ్యులు హర్షం వ్యక్తం చేశారు. నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్.సి.పి) సభ్యురాలు సుప్రియ సూలే(శరద్ పవార్ తనయ) ఈ బిల్లుపై చర్చ సందర్భంగా మాట్లాడుతూ ప్రతి ఎంపీ బాలల సంరక్షణ కేంద్రాల్ని విధిగా సందర్శించాలనే నిబంధన విధించాలని డిమాండ్ చేశారు. పిల్లలపై ఈ లైంగిక వేధింపుల నిరోధక ముసాయిదా బిల్లుకు ఆమె మద్దతు తెల్పుతూ ఈవ్ టీజింగ్ (ఆకతాయిల ఆగడాలు)ను అరికట్టేందుకు కేంద్రం చర్యలు చేపట్టాలని కోరారు. దేశంలో దాదాపు అన్ని బాలల సంరక్షణ కేంద్రాలు అకృత్యాలకు అడ్డాలుగా మారిపోయాయని, పిల్లలు నిరంతరం అక్కడ మోసాలకు గురౌతున్నారని సభ దృష్టికి తెచ్చారు. అందుకే ఉభయ సభలకు చెందిన సభ్యులు ప్రతి ఒక్కరూ విధిగా ఆ కేంద్రాల్లో తనిఖీలకు వెళ్లేలా నిబంధన విధించాలన్నారు. అప్పుడే ఆ కేంద్రాల నిర్వాహకుల్లో అప్రమత్తత వస్తుందని బాలలకు భరోసా లభిస్తుందని చెప్పారు. ఎంపీల ఆకస్మిక తనిఖీలతో బాలల సంరక్షణ కేంద్రాలు సజావుగా నడుస్తాయని సుప్రియ ఆశాభావం వ్యక్తం చేశారు. బహుజన్ సమాజ్ పార్టీ(బీఎస్పీ) సభ్యులు కున్వర్ దానిష్ అలీ బిల్లుకు మద్దతు ఇస్తూ తను ఉరిశిక్షకు వ్యతిరేకమైనా పిల్లలపై అకృత్యాలకు పాల్పడిన వారి విషయంలో బిల్లు నిర్దేశిస్తున్న ప్రకారం విధించే శిక్ష సరైనదిగానే భావిస్తున్నానన్నారు.

Wednesday, July 31, 2019

PM Khan orders roll back of roti, naan prices across Pakistan


పాకిస్థాన్ లో నాన్, రోటీల ధరలు తగ్గించాలని ఇమ్రాన్ ఆదేశం
పాకిస్థాన్ లో గ్యాస్, గోధుమ పిండిలపై సుంకాలు తగ్గించాలని ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వం నిర్ణయించింది. బుధవారం మంత్రివర్గం సమన్వయ సమావేశంలో పాల్గొన్న ప్రధాని బృందం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. ఈ సందర్భంగా ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ మాట్లాడుతూ దేశంలో సామాన్యులకు అందుబాటులో ఉండే విధంగా నాన్, రోటీ ధరల్ని వెంటనే తగ్గించాలని ఆదేశాలిచ్చారు. మునుపటి మాదిరిగా పేదలతో పాటు అందరికీ అందుబాటులో ఉండేలా నాన్, రోటీ ధరలు తగ్గించాలన్నారు. గతంలో పాకిస్థాన్ లో నాన్ ధర రూ.8-10 ఉండగా రోటీ రూ.7-8 కు లభించేది. అయితే గ్యాస్, గోధుమ పిండిలపై పన్నులు పెంచడం వల్ల నాన్, రోటీ ధరలు పెరిగిపోయాయి. ప్రస్తుతం నాన్ ధర రూ.12-15, రోటీ ధర రూ. 10-12కు పెరిగిపోయింది. తక్షణం ఇదివరకటి ధరలకు నాన్, రోటీల ధరలు తగ్గాలని ఇమ్రాన్ హుకుం జారీ చేశారు.

Tuesday, July 30, 2019

Triple talaq bill passed by Parliament


ట్రిపుల్ తలాఖ్ బిల్లుకు పార్లమెంట్ ఆమోద ముద్ర
దేశంలో వివాహిత ముస్లిం మహిళలకు రక్షణ కల్పించే ట్రిపుల్ తలాఖ్ బిల్లుకు పార్లమెంట్ ఆమోద ముద్ర వేసింది. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం తొలిసారి అధికారంలోకి వచ్చినప్పటి నుంచీ ఈ బిల్లు ఆమోదాన్ని ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న సంగతి తెలిసిందే. ఇటీవల లోక్ సభలో ఆమోదం పొందిన ఈ బిల్లు మంగళవారం రాజ్యసభ లోనూ గట్టెక్కింది. బిల్లును కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ సభలో ప్రవేశపెట్టారు. ఎస్.పి, బీఎస్పీలు సభకు హాజరుకాలేదు. ఎ.ఐ.ఎ.డి.ఎం.కె. సభ నుంచి వాకౌట్ చేసింది. కూటమి మిత్ర పక్షం జేడీయూ కూడా వాకౌట్ చేయడం గమనార్హం. వై.ఎస్.ఆర్.సి.పి, టి.ఆర్.ఎస్ సభ్యులు ఓటింగ్ లో పాల్గొనలేదు. బిల్లుకు అనుకూలంగా 99 మంది ఎంపీలు ఓటేయగా 84 మంది వ్యతిరేకిస్తూ ఓటేశారు. దాంతో రాజ్యసభ లోనూ బిల్లు ఆమోదం పొందగల్గింది. ఎగువ సభలో మోదీ ప్రభుత్వానికి వాస్తవంగా 107 మంది ఎంపీల బలముంది. బిల్లు ఆమోదానికి 121 ఓట్లు అవసరం. ఎస్.పి, బీఎస్పీ సభ్యులు సభకు హాజరుకాకపోవడం, టి.ఆర్.ఎస్, వై.ఎస్.ఆర్.సి.పి. సభ్యులు ఓటింగ్ లో పాల్గొనకపోవడంతో ట్రిపుల్ తలాఖ్ బిల్లు కు రాజ్యసభ లో కూడా ఆమోద ముద్ర పడింది. రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ఆమోదం పొందాక.. ఈ ఏడాది ఫిబ్రవరి 21 నుంచి అమలులో ఉన్న ట్రిపుల్ తలాఖ్ ఆర్డినెన్స్ స్థానంలో ఈ బిల్లు చట్టరూపాన్ని దాల్చి అమలులోకి రానుంది.