కర్ణాటక అసెంబ్లీ స్పీకర్ రాజీనామా
చేయాలని బీజేపీ ఎమ్మెల్యే డిమాండ్
మారిన రాజకీయ సమీకరణల నేపథ్యంలో కర్ణాటక విధానసభ స్పీకర్ కె.రమేశ్
కుమార్ (కాంగ్రెస్) రాజీనామా చేయాలని మాజీ మంత్రి, బీజేపీ సీనియర్ నాయకుడు
రేణుకాచార్య బుధవారం డిమాండ్ చేశారు. కుమారస్వామి ప్రభుత్వ పతనంతో రాష్ట్ర ప్రజల అభీష్టం నెరవేరిందని వారి ఆకాంక్షల ప్రకారం బీజేపీ పాలన కొనసాగుతుందని రేణుకాచార్య పేర్కొన్నారు. కర్ణాటక అసెంబ్లీలో మంగళవారం విశ్వాస
తీర్మానం వీగి పోవడంతో 14 నెలల కాంగ్రెస్-జనతాదళ్ (ఎస్) సంకీర్ణ ప్రభుత్వం కూలిపోయిన సంగతి తెలిసిందే.
కుమారస్వామికి రెండో సారి ముఖ్యమంత్రి పదవి
అర్ధాంతరంగా పోయింది. తొలుత 2006 ఫిబ్రవరి 3 నుంచి 2007 అక్టోబర్ 9 వరకు సీఎంగా ఆయన
బీజేపీ తో కూడిన జేడీ(ఎస్) సంకీర్ణ సర్కార్ కు సారథ్యం వహించారు. బీజేపీ సీనియర్ నాయకుడు
యడ్యూరప్ప డిప్యూటీ సీఎంగా వ్యవహరించారు. మళ్లీ దశాబ్దం తర్వాత రెండోసారి 2018లో ఊహించని
వరంలా కాంగ్రెస్ తో జట్టుకట్టి బీజేపీ అధికారంలోకి రాకుండా అడ్డుకున్నారు. 23 మే
2018 నుంచి ఆయన 23 జులై 2019 వరకు సీఎంగా పదవిలో ఉన్నారు. 11 మంది కాంగ్రెస్
ఎమ్మెల్యేలు, ముగ్గురు జనతాదళ్(ఎస్) ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేసి శాసనసభ్యత్వాలకు
రాజీనామా సమర్పించడంతో రగడ మొదలైంది. తాజాగా శాసనసభలో బలం నిరూపించుకోలేక ఆయన
ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. కుమారస్వామి తండ్రి మాజీ ప్రధాని దేెవెగౌడ కూడా రాష్ట్ర
ముఖ్యమంత్రిగా స్వల్పకాలమే పనిచేశారు. కేంద్రంలో నాడు సంకీర్ణ కూటమికి ప్రధానిగా
ఆయన నేతృత్వం వహించాల్సి రావడంతో కర్ణాటక సీఎం పదవికి రాజీనామా చేశారు. 1994
డిసెంబర్ నుంచి 1996 మే వరకు ఆయన రాష్ట్ర సారథ్య బాధ్యతలు వహించారు.