Sunday, July 21, 2019

UP CM Adityanath meets affected families in Sonbhadra


సోన్ భద్ర లో వరాల జల్లు కురిపించిన యూపీ సీఎం
ఉత్తరప్రదేశ్ (యూపీ) ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సోన్ భద్ర జిల్లాలో ఆదివారం పర్యటించారు. ఇటీవల ఈ జిల్లాలోని ఉంభా గ్రామంలో రెండు వర్గాల భూతగాదాల్లో కాల్పులు చోటు చేసుకోవడంతో 10 మంది మృతి చెందిన సంగతి తెలిసిందే. ఆ మృతుల కుటుంబాలను సీఎం యోగి పరామర్శించారు. ఒక్కో మృతుని కుటుంబానికి ఆయన రూ.18 లక్షలు పరిహారంగా ప్రకటించారు. గాయపడిన వారికి రూ.2.5 లక్షల సహాయాన్ని అందజేయనున్నట్లు తెలిపారు. ఈ కాల్పులకు పాల్పడిన వారిని ఎట్టి పరిస్థితుల్లో విడిచిపెట్టబోమని సీఎం చెప్పారు. ఈ ఘటనకు రాష్ట్రంలోని సమాజ్ వాది, కాంగ్రెస్ పార్టీలే కారణమని ఆయన ఆరోపించారు. అంతేకాకుండా కాల్పుల్లో మరణించిన వారి కుటుంబ సభ్యులకు ఇళ్లను కేటాయిస్తామని హామీ ఇచ్చారు. ఈ బాధిత కుటుంబాల్లోని వృద్ధులకు పింఛను అందిస్తామని చెప్పారు. ఉంభా గ్రామంలో అంగన్ వాడి కేంద్రాన్ని ప్రారంభిస్తామన్నారు. వసతి గృహంతో కూడిన పాఠశాలను నిర్మిస్తామని, పోలీస్ స్టేషన్, ఫైర్ స్టేషన్లను కూడా నెలకొల్పనున్నామని సీఎం యోగి ప్రకటించారు. దశాబ్దాలకు తరబడి ఇక్కడ వ్యవసాయం చేసుకుంటున్న గిరిజనులు, వారి భూముల జోలికి ఇకపై ఎవరూ రాకుండా చూసుకుంటామని సీఎం ఉంభా గ్రామస్థులకి అభయం ఇచ్చారు. ఆదివారం మధ్యాహ్నం ఉంభా చేరుకున్న ముఖ్యమంత్రి వెంట రాష్ట్ర డీజీపీ, సీఎస్ ఉన్నారు. 
ప్రియాంక ప్రభావంతోనే..సీఎం ఆఘమేఘాల పర్యటన
ఈనెల 17న ఈ ఘోర కలి జరగ్గా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంకగాంధీ రెండ్రోజుల వ్యవధిలోనే యూపీ చేరుకున్నారు. సోన్ భద్రకు ఆమె పయనం కాగానే అడ్డుకుని యోగి ప్రభుత్వం అరెస్ట్ చేసింది. అనంతరం ప్రియాంకను చునూర్ ప్రభుత్వ అతిథి గృహానికి తరలించి విద్యుత్, నీళ్లు లేకుండా వేధించింది. అయినా ఆమె బాధితుల్ని పరామర్శించేవరకు ఢిల్లీ వెనుదిరిగేది లేదని అక్కడే భీష్మించారు. దాంతో తప్పనిసరై కేవలం ఇద్దరు బాధితుల్ని మాత్రమే ప్రియాంక ఉన్న అతిథి గృహానికి అనుమతించింది. అక్కడే ఆమె బాధితుల్ని పరామర్శించి వారికి ధైర్యం చెబుతూ మళ్లీ ఇంకోసారి తప్పక సోన్ భద్రకు వస్తానని హామీ ఇచ్చి ఢిల్లీ తిరుగుప్రయాణమయ్యారు.. ప్రియాంక పర్యటన ప్రభావం వల్లే సీఎం యోగి రాజకీయ కోణంలో  ఆఘమేఘాల మీద బాధితుల పరామర్శకు బయలుదేరారని పరిశీలకులు భావిస్తున్నారు.


No comments:

Post a Comment