Tuesday, July 23, 2019

UP revenue official suspended for 'calling names' to PM


ప్రధాని మోదీని తిట్టి సస్పెండయిన యూపీ రెవెన్యూ అధికారి
ప్రధానమంత్రి మోదీని దుర్భాషలాడిన ఉత్తరప్రదేశ్ రెవెన్యూ అధికారి ఒకరిపై సస్పెన్షన్ వేటుపడింది. కిసాన్ సమ్మాన్ నిధి పింఛను ఇప్పించాలని కోరిన ఓ రైతుపై సదరు అధికారి బూతులతో రెచ్చిపోయాడు. అక్కడితో ఆగకుండా దేశ ప్రధాని మోదీ పైన తిట్ల దండకం అందుకున్నాడు. ఇదంతా పక్కన ఎవరో మొబైల్ లో వీడియో రికార్డింగ్ చేశారు. ఆ తర్వాత ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ వ్యవహారమంతా ఉన్నతాధికారుల దృష్టికి వచ్చింది. కోర్టు మెట్లు ఎక్కింది. విచారణ నిర్వహించిన బద్వాన్ జిల్లా మేజిస్ట్రేట్ దినేశ్ కుమార్ సాక్ష్యాధారాల్ని పరిశీలించిన మీదట మంగళవారం సదరు అధికారిని సస్పెండ్ చేస్తూ శాఖాపరమైన చర్యలకు ప్రభుత్వానికి ఆదేశాలిచ్చారు. 
లేఖ్ పాల్ సింగ్ అనే రైతు పింఛన్ అందడం లేదని రెవెన్యూ అధికారి శివ సింగ్ వద్దకు వచ్చాడు. తనకిచ్చిన కిసాన్ సమ్మాన్ నిధి పింఛన్ ధ్రువపత్రంలో తప్పులున్న విషయం ఆయన దృష్టికి తెచ్చాడు. అందువల్లే తనకు పింఛన్ అందడం లేదని ఆవేదన వ్యక్తం చేశాడు. దయచేసి సరిచేయాలని కోరాడు. అందుకు ఆ అధికారి సహకరించకపోగా తాత్సారం చేస్తున్నాడు. విసిగిపోయిన రైతు లేఖ్ పాల్ ఉన్నతాధికారులకు ఫిర్యాదు ఇస్తానని రెవెన్యూ అధికారిని హెచ్చరించాడు. దాంతో శివాలెత్తిన అధికారి శివ సింగ్ ఆ రైతుపై బూతుపంచాగం విప్పాడు. ఆ కోపోద్రేకంలో ప్రధాని మోదీని దుర్భాషలాడి ఉద్యోగానికే ఎసరు తెచ్చుకున్నాడు.


No comments:

Post a Comment