Thursday, July 11, 2019

England one sided win over defending champions Australia by 8 wkts


ఫైనల్ కు ఇంగ్లాండ్ రె`ఢీ:`ఏకపక్ష మ్యాచ్ లో ఆస్ట్రేలియా చిత్తు
వరల్డ్ కప్-12 రెండో సెమీస్ మ్యాచ్ చూస్తే అచ్చం భారత్ మాదిరిగా ఆస్ట్రేలియా కనిపించింది. వరల్డ్ కప్ నాకౌట్ కు ముందు పాయింట్ల పట్టికలో 15 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచిన భారత్ తొలి సెమీస్ లో న్యూజిలాండ్ చేతిలో ఓటమి పాలయింది. టాస్, వర్షం, ధోని రనౌట్ మ్యాచ్ ను కివిస్ వశం చేశాయి. అయితే గురువారం రెండో సెమీస్ లో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా బర్మింగ్ హమ్ ఎడ్జ్ బస్టన్ మైదానంలో బ్యాటింగ్ ఎంచుకుని బోల్తా పడింది. తొలి సెమీస్ కు యాక్షన్ రిప్లేలా రెండో సెమీస్ లో ఆస్ట్రేలియా ఆడింది. తొలి 6 ఓవర్లలో 14 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది. ఆ తర్వాత అలెక్స్ కేరీ(46), స్టీవ్ స్మిత్(87) అడ్డం పడకపోతే ఆస్ట్రేలియా వికెట్ల పతనం ఆగేది కాదు. 223 పరుగుల గౌరవప్రదమైన స్కోర్ కు చేరే అవకాశమే ఉండదు. కేరీ, స్మిత్ జోడి నాల్గో వికెట్ కు 103 పరుగులు జత చేశారు. కెప్టెన్ ఆరన్ ఫించ్(0), డేవిడ్ వార్నర్(9), పీటర్ హ్యాండ్ కోంబ్(4) టాప్ ఆర్డర్ లో తక్కువ స్కోర్ కే బ్యాట్లు ఎత్తేశారు. ఆసిస్ ఇన్నింగ్స్ లో ఇద్దరు డకౌట్లు కాగా మరో అయిదుగురు బ్యాటర్లు సింగిల్ డిజిట్ కే పెవిలియన్ చేరారు. ఆ జట్టు 49 ఓవర్లకే ఆలౌటయింది. ఇంగ్లాండ్ బౌలర్లు క్రిస్ వోక్స్, ఆడిల్ రషీద్ చెరో 3 వికెట్లు పడగొట్టారు. జోఫ్రా ఆర్చర్ 2 వికెట్లు, మార్క్ వుడ్ 1 వికెట్ తీశారు.
తనను టైటిల్ ఫెవరెట్ గా క్రికెట్ విశ్లేషకులు ఎందుకు పేర్కొంటున్నారో ఆసీస్ తో సెమీస్ మ్యాచ్ లో ఇంగ్లాండ్ ఆడి చూపించింది. బౌలింగ్ లో చండప్రచండమైన బంతులతో ప్రత్యర్థిని వణికించిన ఇంగ్లాండ్ బ్యాటింగ్ లో పిడుగుల్లాంటి షాట్లతో హోరెత్తించింది. ఛేదన లక్ష్యం న్యూజిలాండ్ 239 పరుగుల స్కోరు భారత్ ముందుంచిన మాదిరిగానే ఆస్ట్రేలియా 223 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఇంగ్లాండ్ ఎదుట పెట్టింది. తేడా ఒక్కటే అక్కడ భారత్ తలొగ్గితే ఇక్కడ ఇంగ్లాండ్ దుమ్మురేపింది.
ఇన్నింగ్స్ ప్రారంభం నుంచి ఇంగ్లాండ్ బ్యాటర్లు రెచ్చిపోయి పరుగులు సాధించారు. బౌండరీలు, సిక్సర్ల వర్షం కురిపిస్తుంటే ఆసిస్ పేసర్లు కూనల్లా మారిపోయారు. ముఖ్యంగా ఓపెనర్ జాసన్ రాయ్(85) 65 బంతుల్లో 5 సిక్సర్లు, 9 బౌండరీలతో ఆసిస్ బౌలింగ్ ను తునాతునకలు చేశాడు. మిచెల్ స్టార్క్ ప్రధాన బాధితుడు. ఓవర్ కు 7.78 పరుగుల చొప్పున 9 ఓవర్లలో జానీ బెయిర్ స్టో(34) ఒకే ఒక వికెట్ తీసుకుని 70 పరుగులు సమర్పించుకున్నాడు. జాసన్ రాయ్ వికెట్  పాట్ కమిన్స్ కు దక్కింది. జోయ్ రూట్(49*), మోర్గాన్(41*) చివరి వరకు క్రీజ్ లో నిలిచి ఇంగ్లాండ్ ను ఫైనల్ కు చేర్చారు. ఆ జట్టు ఇంకా దాదాపు 18 ఓవర్లు మిగిలి ఉండగానే 32.1 ఓవర్లలో 226 పరుగులు చేసి విజయాన్ని సాధించింది. జాసన్ బెరండ్రాఫ్ బౌలింగ్ లో కెప్టెన్ మోర్గాన్ విన్నింగ్ షాట్ బౌండరీ కొట్టాడు.3 వికెట్లు తీసి అద్భుతంగా బౌలింగ్ చేసిన ఇంగ్లాండ్ పేసర్ క్రిస్ వోక్స్ మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ గా ఎంపికయ్యాడు. 
తొలిసారి వరల్డ్ కప్ విజేత ఎవరో?
లండన్ లార్డ్స్ లో ఆదివారం తుది పోరుకు న్యూజిలాండ్ తో ఇంగ్లాండ్ జట్టు సిద్ధమౌతోంది. ఇంగ్లాండ్ ఫైనల్స్ కు చేరడం ఇది మూడోసారి 1987,1992,2019ల్లో ఆ జట్టు ఫైనల్ కు చేరగా మరో జట్టు న్యూజిలాండ్ వరుసగా రెండోసారి ఫైనల్ (2015, 2019) కు చేరింది. ఈ రెండు జట్లు ఫైనల్ లో తలపడ్డం ఇదో తొలిసారి. రెండింటిలో ఏ జట్టు గెలిచిన తొలిసారి వరల్డ్ కప్ సాధించిన జట్టుగా రికార్డుల్లో చోటు దక్కించుకోనుంది.

Wednesday, July 10, 2019

3 die of asphyxiation in Telangana


బావిలో మోటారు రిపేరుకు దిగి ముగ్గురు మృత్యువాత
తెలంగాణ లోని ఓ పురాతన బావిలో మోటారు మరమ్మతు చేయడానికి దిగిన ముగ్గురు వ్యక్తులు మృత్యుఒడికి చేరారు. ఈ విషాదం కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాలోని ముత్యంపేట మండలానికి చెందిన కౌటలా గ్రామంలో చోటు చేసుకుంది. 35 అడుగుల లోతు గల ఈ బావిలోకి బుధవారం ఉదయం మోటార్ రిపేరు చేయడానికి వీరంతా దిగినట్లు తెలుస్తోంది. తొలుత ఓ వ్యక్తి ఈ బావిలోకి దిగి విషవాయువులు వెలువడిన కారణంగా ఊపిరాడక చనిపోయాడు. అతణ్ని రక్షించడానికి తోటి పనివాళ్లు ఇద్దరు ఒక్కొక్కరుగా అందులోకి దిగి అపస్మారక స్థితిలోకి చేరి ప్రాణాలు వదిలినట్లు పోలీసులు తెలిపారు. చనిపోయిన ముగ్గురు 19 నుంచి 25ఏళ్ల లోపు యువకులు. మృతుల్ని రాజు(26), శ్రీనివాస్(25), మహేశ్(18) గా గుర్తించారు. మృతదేహాల్ని బావిలో నుంచి వెలికి తీసి పోస్టుమార్టంకు తరలించారు. ఈనెల 8న నల్గొండ జిల్లాలోని షాలిగౌరారం మండలానికి చెందిన పెరికకొండారం గ్రామంలో ఓ 18 ఏళ్ల విద్యార్థిని నీటి కుంటలో ప్రమాదవశాత్తు పడి చనిపోయింది. కావ్య అనే ఆ విద్యార్థిని బీఎస్సీ రెండో సంవత్సరం చదువుతోంది. పశువులకు మేత వేయడానికి వెళ్లిన ఆమె నీటి కుంటలో పడి ప్రాణాలు కోల్పోయింది.

Tuesday, July 9, 2019

Puppy beaten to death in Thane housing complex, 1 booked


కుక్క పిల్లే కదా అని చంపేసి.. ఆనక ఇరుక్కున్న ఘనుడు
మహారాష్ట్రలో ఓ వ్యక్తి కుక్క పిల్లే కదా అని కొట్టి చంపి కష్టాలు కొని తెచ్చుకున్నాడు. ఈ ఘటన జులై3 బుధవారం జరిగింది. థానె సమీపంలోని శాంతినగర్ ప్రాంతంలో భయాందర్ గృహ సముదాయాల టౌన్ షిప్ లో ఈ ఘటన చోటు చేసుకుంది. తను నివసిస్తున్న అపార్ట్ మెంట్ ప్రాంగణంలోకి ఓ కుక్క పిల్ల జొరబడింది. దాన్ని చూసి ఆగ్రహం చెందిన సదరు వ్యక్తి దారుణంగా కర్రతో కొట్టి చంపాడు. కుక్క పిల్ల కళేబరాన్ని చూసిన ఇరుగుపొరుగులు ఎలా చనిపోయిందో తెలియక తర్వాత అక్కడ నుంచి తొలగించారు. అయితే రెండ్రోజులు గడిచిన తర్వాత వాట్సాప్ లో ఆ వీడియో ప్రత్యక్షమయింది. కుక్కపిల్లను కొట్టి చంపుతున్న వీడియోను సదరు వ్యక్తే రికార్డు చేసి పోస్ట్ చేశాడు. అంతటితో ఆగకుండా తమ అపార్ట్ మెంట్ లోకి ప్రవేశించిన కుక్కలన్నింటికి ఇదే గతి పడుతుందని వ్యాఖ్యానాన్ని జత చేశాడు. అతడికి ఈ మొత్తం వ్యవహారంలో స్నేహితుడొకరు సాయం చేసినట్లు తెలుస్తోంది. ఆ వీడియోను చూసి చలించిపోయిన అపార్ట్ మెంట్ లోని ఓ వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. థానె రూరల్ పోలీసులు రంగ ప్రవేశం చేసి కుక్క పిల్లను చంపిన సదరు వ్యక్తిపై నమోదు చేశారు. నోరు లేని మూగ జీవాల పట్ల క్రూరత్వం ప్రదర్శించడం నేరం కిందకే వస్తుంది. జంతువులపై క్రూరత్వ నిరోధక చట్టం సెక్షన్ 11 ప్రకారం, ఐ.పి.సి (ఇండియన్ పీనల్ కోడ్) సెక్షన్428, 429 సెక్షన్ల ప్రకారం కేసు నమోదు చేయదగ్గ నేరంగా పరగణించి పోలీసులు అతణ్ని అదుపులోకి తీసుకున్నారు.

YSRCP party men do not exceed limits Chandrababu warns Cm Jagan


చంద్రబాబు ఓదార్పు యాత్ర
ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు మంగళవారం అనంతపురం జిల్లాలో పర్యటించారు. జిల్లాల్లో చనిపోయిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తల కుటుంబాల్ని కలుసుకుని పరామర్శించారు. తాడిపత్రి లోని వీరాపురం గ్రామంలో భాస్కరరెడ్డి కుటుంబ సభ్యుల్ని ఓదార్చారు. భాస్కరరెడ్డి మృతికి పరహారంగా చంద్రబాబు రూ.5 లక్షల ఆర్థిక సాయాన్ని వారికి అందించారు. అనంతరం ఏర్పాటైన సభలో ప్రసంగిస్తూ వై.ఎస్.ఆర్.సి పార్టీపై నిప్పులు చెరిగారు. ఆరుగురు తెలుగుదేశం కార్యకర్తల్ని వై.ఎస్.ఆర్.సి.పి. కి చెందిన వారు దారుణంగా హత్య చేశారని ఆరోపించారు. డీజీపీ గౌతమ్ సావంగ్ ను కలిసి ఫిర్యాదు చేసినా ఫలితం లేకపోయిందన్నారు. ఇదేనా జగన్ అందిస్తున్న ఉత్తమ పాలన అని చంద్రబాబు నిలదీశారు. వై.ఎస్.ఆర్.సి.పి. దుందుడుకు పోకడలకు పోతోందని అది మంచిది కాదని చెప్పారు. ఆ పార్టీ వారి ఆగడాలు శ్రుతి మించుతున్నాయని తెలుగుదేశం పార్టీ చూస్తూ ఉరుకోబోదని హెచ్చరించారు. సీఎం జగన్ సత్పరిపాలన అందించడానికి ఆరునెలల గడువు అడిగారు..వేచి చూస్తున్నాం.. బాధ్యతాయుత ప్రతిపక్షంగా వ్యవహరిస్తున్నాం.. అని చంద్రబాబు గుర్తు చేశారు. జగన్ సీఎం అయ్యాక 40 రోజుల్లో ఉత్తమ పాలన మాట అటుంచి ఆ పార్టీ కార్యకర్తల దౌర్జన్యాలు ఎక్కువయ్యాయన్నారు. తక్షణం వై.ఎస్.ఆర్.సి.పి. శ్రేణుల్ని అదుపులో పెట్టుకోవాలని సీఎం జగన్ కు చంద్రబాబు తేల్చిచెప్పారు.