కుక్క పిల్లే కదా అని చంపేసి.. ఆనక ఇరుక్కున్న ఘనుడు
మహారాష్ట్రలో ఓ వ్యక్తి కుక్క
పిల్లే కదా అని కొట్టి చంపి కష్టాలు కొని తెచ్చుకున్నాడు. ఈ ఘటన జులై3 బుధవారం
జరిగింది. థానె సమీపంలోని శాంతినగర్ ప్రాంతంలో భయాందర్ గృహ సముదాయాల టౌన్ షిప్ లో
ఈ ఘటన చోటు చేసుకుంది. తను నివసిస్తున్న అపార్ట్ మెంట్ ప్రాంగణంలోకి ఓ కుక్క పిల్ల
జొరబడింది. దాన్ని చూసి ఆగ్రహం చెందిన సదరు వ్యక్తి దారుణంగా కర్రతో కొట్టి
చంపాడు. కుక్క పిల్ల కళేబరాన్ని చూసిన ఇరుగుపొరుగులు ఎలా చనిపోయిందో తెలియక తర్వాత
అక్కడ నుంచి తొలగించారు. అయితే రెండ్రోజులు గడిచిన తర్వాత వాట్సాప్ లో ఆ వీడియో
ప్రత్యక్షమయింది. కుక్కపిల్లను కొట్టి చంపుతున్న వీడియోను సదరు వ్యక్తే రికార్డు
చేసి పోస్ట్ చేశాడు. అంతటితో ఆగకుండా తమ అపార్ట్ మెంట్ లోకి ప్రవేశించిన
కుక్కలన్నింటికి ఇదే గతి పడుతుందని వ్యాఖ్యానాన్ని జత చేశాడు. అతడికి ఈ మొత్తం
వ్యవహారంలో స్నేహితుడొకరు సాయం చేసినట్లు తెలుస్తోంది. ఆ వీడియోను చూసి
చలించిపోయిన అపార్ట్ మెంట్ లోని ఓ వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. థానె రూరల్ పోలీసులు
రంగ ప్రవేశం చేసి కుక్క పిల్లను చంపిన సదరు వ్యక్తిపై నమోదు చేశారు. నోరు లేని మూగ
జీవాల పట్ల క్రూరత్వం ప్రదర్శించడం నేరం కిందకే వస్తుంది. జంతువులపై క్రూరత్వ
నిరోధక చట్టం సెక్షన్ 11 ప్రకారం, ఐ.పి.సి (ఇండియన్ పీనల్ కోడ్) సెక్షన్428, 429
సెక్షన్ల ప్రకారం కేసు నమోదు చేయదగ్గ నేరంగా పరగణించి పోలీసులు అతణ్ని అదుపులోకి
తీసుకున్నారు.
No comments:
Post a Comment