Wednesday, July 3, 2019

England enters semis crushed out Newzealand by 119 runs in icc world cup

వరల్డ్ కప్ సెమీస్ చేరిన ఇంగ్లాండ్ 119 పరుగుల తేడాతో కివీస్ చిత్తు
ఐసీసీ వరల్డ్ కప్12 లో ఆతిథ్య ఇంగ్లాండ్ జట్టు సగర్వంగా సెమీ ఫైనల్స్ కు చేరింది. బ్యాటింగ్బౌలింగ్ఫీల్డింగ్ అన్నింటా న్యూజిలాండ్ పై ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తూ ఆ జట్టును 119 పరుగుల తేడాతో చిత్తు చేసింది. బుధవారం డర్హం రివర్ సైడ్ మైదానం వేదికగా జరిగిన మ్యాచ్ నం.41లో ఇంగ్లాండ్ పిడుగు జానీ బెయిర్ స్టో తనపై గల అంచనాలు నిలబెట్టుకుంటూ టోర్నీలో వరుసగా రెండో సెంచరీ సాధించాడు. క్రీడా పండితుల అంచనాలకు తగ్గట్లు టైటిల్ ఫెవరేట్ గా పరిగణింపబడుతున్న ఇంగ్లాండ్ ఫుల్ ఫామ్ లోకి వచ్చేసింది. టోర్నీ ఆరంభంలో వరుస మ్యాచ్ ల గెలుపుతో పులిలా కనిపించిన న్యూజిలాండ్ జట్టు ఇంగ్లాండ్ తో ఈ రోజు మ్యాచ్ లో పిల్లిలా మారిపోయింది. అద్భుతాలు చేయగలదనుకున్న దశ నుంచి ఒక్కో మెట్టు కిందకు జారిపోయింది. ముఖ్యంగా ఆతిథ్య జట్టుతో మ్యాచ్ లో లక్ష్య ఛేదనలో ఏ దశలోనూ పోరాడకుండా బ్యాట్ ఎత్తేసి పెవిలియన్ బాట పట్టింది.
టాస్ గెలిచిన ఇంగ్లాండ్ జట్టు తొలుత బ్యాటింగ్ చేపట్టి నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 305 పరుగులు చేసింది. ఓపెనర్లు జాసన్ రాయ్(60)బెయిర్ స్టో(106)జోరూట్(24)ఇయాన్ మోర్గాన్(42) జట్టు భారీ స్కోరుకు తోడ్పడ్డారు. పేసర్స్పిన్నర్ తేడా లేకుండా అందరి బంతుల్ని ఇంగ్లిష్ బ్యాట్స్ మెన్ బాదేశారు. జేమ్స్ నిషమ్ మాత్రమే ఇంగ్లాండ్ బ్యాటర్ల బాదుడు నుంచి తప్పించుకున్నాడు. 41 పరుగులిచ్చి 2 వికెట్లు పడగొట్టాడు. మాట్ హెన్రీ 54 పరుగులిచ్చి 2 వికెట్లుట్రెంట్ బౌల్ట్ 56 పరుగులకు 2 వికెట్లు తీసుకోగా మిషెల్ శాంటనర్టిమ్ సోథీ చెరో 1 వికెట్ పడగొట్టగలిగారు. 306 పరుగుల ఛేదన లక్ష్యంతో బరిలోకి దిగిన కివీస్ గెలుపు ధీమా చూపలేకపోయింది. ప్రత్యర్థి బౌలర్ల ప్రతిభ కన్నా టాప్ ఆర్డర్ బ్యాట్స్ మెన్ నిర్లక్ష్యం వల్లే వికెట్లు టపటపా పడిపోయాయి. క్రిస్ వోక్స్ బౌలింగ్ లో హెన్రీ నికోల్స్(0) అవుట్ కాకపోయినా ఫీల్డ్ అంపెర్ ఎల్బీడబ్లూ ఇవ్వడంతో వెనుదిరిగాడు. వాస్తవానికి ఆ బంతి వికెట్ల పై నుంచి వెళ్తున్నట్లు రీప్లే లో బయటపడింది. థర్డ్ అంపైర్ (డీఆర్ఎస్) అవకాశాన్ని హెన్రీ వదిలేసుకున్నాడు. మరో ఓపెనర్ మార్టిన్ గుప్తిల్ (8) కూడా త్వరగా వెనుదిరిగాడు. రాస్ టేలర్(28)కెప్టెన్ కేన్ విలియమ్సన్(27)లు మ్యాచ్ ను ప్రత్యర్థికి అప్పగిస్తూ అనవసరంగా రనౌట్లయి వెనుదిరిగారు. మార్క్ వుడ్ షార్ట్ పిచ్ఓవర్ పిచ్ బౌన్సర్లతో కివీస్ బ్యాట్స్ మెన్ ను ముప్పుతిప్పలు పెట్టి 3 వికెట్లు ఖాతాలో వేసుకున్నాడు. జోరూట్ మినహా మిగిలిన ఇంగ్లాండ్ బౌలర్లు క్రిస్ వోక్స్జోఫ్రా ఆర్చర్లియమ్ ప్లంకెట్అడిల్ రషీద్బెన్ స్టోక్స్ 1 వికెట్ చొప్పున పడగొట్టారు. న్యూజిలాండ్ ఇన్నింగ్స్ మొత్తానికి బాధ్యతగా బ్యాటింగ్ చేసిన ఒకే ఒక్కడు వికెట్ కీపర్ బ్యాట్స్ మన్ టామ్ లథమ్(57) మాత్రమే. ఆ జట్టు ఇంకా అయిదు ఓవర్లు మిగిలి ఉండగానే పట్టుమని 200 పరుగులు కూడా చేయకుండా 45 ఓవర్లలో 186 పరుగులకే ఆలౌటయింది. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ గా బెయిర్ స్టో నిలిచాడు.

Ambati Rayudu retires all forms of cricket after being ignored this World Cup

అంబటి రాయుడు అలక:అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ ప్రకటన

భారత క్రికెట్ క్రీడాకారుడు అంబటి రాయుడు అలకబూనాడు. వరల్డ్ కప్ కు తనను ఎంపిక చేయలేదని అప్పటి నుంచి రాయుడు కినుక వహించాడు. చివరకి అతణ్ని స్టాండ్ బైగా ప్రస్తుత వరల్డ్ కప్ కు ఎంపిక చేశారు. శిఖర్ ధావన్ గాయంతో వరల్డ్ కప్ నుంచి తప్పుకోవడంతో మరో స్టాండ్ బై గా ఎంపికైన పంత్ కు మ్యాచ్ లు ఆడే అవకాశం వచ్చింది. ఆ తర్వాత విజయ్ శంకర్ కూడా గాయంతో వైదొలగడంతో రాయుడికి అవకాశం దక్కవచ్చని అందరూ భావించారు. అయితే మయాంక్ అగర్వాల్ ఎంపికయ్యాడు. ఈ నేపథ్యంలో రాయుడు ఇక తను భారత జట్టులోనే కొనసాగకూడదని తీవ్ర నిర్ణయం తీసుకున్నాడు. మంచి భవిష్యత్ ఉన్న రాయుడు క్రికెట్ అంటే వరల్డ్ కప్ గానే భావించడం సరికాదు. భారత జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తూ ఇతర అంతర్జాతీయ మ్యాచ్ లో పాల్గొనడం కూడా ప్రతిష్ఠాత్మకమేనని గ్రహించాలి. 2013లో భారత జట్టుకు ఎంపికై జింబాబ్వేపై తొలి వన్డే ఆడాడు. ఆస్ట్రేలియాతో ఆడిన వన్డే చివరి మ్యాచ్. 55 వన్డేల్లో 47.05 సగటుతో 1694 పరుగులు చేశాడు. ఇందులో మూడు సెంచరీలు, 10 అర్ధ సెంచరీలున్నాయి. అలాగే ఆరు టీ-20 మ్యాచ్ లు ఆడిన ఈ మిడిలార్డర్ బ్యాట్స్ మన్ కేవలం 42 పరుగులు మాత్రమే చేశాడు. వన్డేల్లో అత్యధిక స్కోరు 124. రాయుడు మొత్తం 97 ఫస్ట్ క్లాస్ మ్యాచ్ లు ఆడి 6,151 పరుగులు చేశాడు. రాయుడు రిటైర్మెంట్ లేఖ అందినట్లు బీసీసీఐ వర్గాలు ధ్రువీకరించాయి.

Tuesday, July 2, 2019

As DMK backtracks congress mulling to send manmohan singh to Rajya Sabha from Rajasthan


రాజస్థాన్ నుంచి రాజ్యసభకు మన్మోహన్:కాంగ్రెస్ యత్నం
మాజీ ప్రధానమంత్రి, ఆర్థిక సంస్కరణల రూపశిల్పుల్లో ఒకరైన డా.మన్మోహన్ సింగ్ ను రాజస్థాన్ నుంచి రాజ్యసభకు పంపనున్నారు. ఎగువసభలో ఆయన ఇంతవరకు అసోం నుంచి ప్రాతినిధ్యం వహించిన సంగతి తెలిసిందే. గత నెలలో రాజ్యసభలో ఆయన పదవీ కాలం పూర్తి అయింది. అసోం నుంచి ఆయనను తిరిగి ఎంపిక చేయడానికి ఆ రాష్ట్ర అసెంబ్లీలో కాంగ్రెస్ కు తగిన సంఖ్యా బలం లేదు. మిత్రపక్షం డీఎంకె చెయ్యిచ్చిన దరిమిలా కాంగ్రెస్ రాజస్థాన్ నుంచి ఆయనను ఎంపిక చేయాలని చూస్తోంది. ఇటీవల రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన విషయం విదితమే. రాజ్యసభలో రాజస్థాన్ నుంచి ఏకైక స్థానం ఖాళీ అయింది. బీజేపీ అధ్యక్షుడు మదన్ లాల్ సైనీ గత నెల24 మరణించడంతో రాజ్యసభ కు ఆ రాష్ట్రం నుంచి ఉప ఎన్నిక అనివార్యమైంది. ఇప్పుడు ఆ దిశగా కాంగ్రెస్ అధిష్ఠానం ఆలోచన సాగిస్తోంది. గత సార్వత్రిక ఎన్నికల్లో డీఎంకె, కాంగ్రెస్ కూటమి లోక్ సభ కు గణనీయంగా అభ్యర్థుల్ని గెలిపించుకోగలిగాయి. కాంగ్రెస్ ఆ రాష్ట్రం నుంచి ఒక రాజ్యసభ స్థానాన్ని డీఎంకె ద్వారా ఆశించింది. అయితే తమ కూటమిలోని ఎండీఎంకె అధినేత వి.గోపాలస్వామి (వైగో) కి ఆ స్థానాన్ని ఇవ్వనున్నట్లు తాజాగా డీఎంకె మెలికపెట్టింది. దాంతో మన్మోహన్ సింగ్ ను రాజస్థాన్ నుంచి రాజ్యసభకు పంపాలని కాంగ్రెస్ నిర్ణయం తీసుకుంది. ఈ దఫా మన్మోహన్ రాజస్థాన్ నుంచి రాజ్యసభలో అడుగుపెడితే 2024 వరకు సభ్యుడిగా కొనసాగుతారు.

Rain havoc in india`s financial capital Mumbai, 32 dead


ముంబయి మునక:32 మంది మృతి 75 మందికి గాయాలు
భారత వాణిజ్య రాజధాని ముంబయి వరుసగా రెండో రోజూ వరదల తాకిడికి అల్లాడుతోంది. కుంభవృష్టి కారణంగా మహారాష్ట్ర రాజధాని ముంబయి పరిధిలో 32 మంది మృత్యుపాలయ్యారు. మరో 75 మంది తీవ్రంగా గాయపడ్డారు. ముంబయి పరిసర నగరాలు థానె, పుణె కూడా మునకేశాయి. కొంకణ్ ప్రాంతంలో మంగళవారం సెలవు దినంగా ప్రభుత్వం ప్రకటించింది. స్కూళ్లు, ఆఫీసుల్ని మూసివేశారు. ఎడతెగని వర్షాల కారణంగా రోడ్డు, రైలు, విమాన రాకపోకలకు తీవ్ర అంతరాయం కల్గింది. అర్ధరాత్రి ఒంటిగంట సమయంలో(మంగళవారం) పింప్రిపడ ప్రాంతంలో కొండవాలులో నిర్మించిన భవనం ప్రహారీ కూలి 18 మంది చనిపోయినట్లు అధికారులు వెల్లడించారు. జాతీయ విపత్తు సహాయక బృందం(ఎన్డీఆర్ఎఫ్), ముంబయి అగ్నిమాపక సిబ్బంది శిథిలాల తొలగింపు పనులు చేపట్టారు. గడిచిన 12 గంటల్లో 300-400 మి.మి. వర్షపాతం నమోదైనట్లు సీఎం దేవేంద్ర పడ్నవిస్ తెలిపారు. మృతులు ఒక్కొక్కరికి రూ.5 లక్షల పరిహారం ప్రకటించారు. మలద్ సబ్ వేలో సోమవారం రాత్రి వరద నీటిలో కొట్టుకుపోయిన ఇద్దరు వ్యక్తుల మృతదేహాల్ని మంగళవారం కనుగొన్నారు. థానె జిల్లాలోని కల్యాణ్ పట్టణంలో జాతీయ ఉర్దూ పాఠశాల భవనం గోడ కూలి ఇద్దరు వ్యక్తులు మరణించగా పలువురు గాయాలపాలయ్యారు. జవహర్ నదీ ప్రవాహంలో ఇద్దరు వ్యక్తులు కొట్టుకుపోయినట్లు సమాచారం. ముంపునకు గురైన ఈశాన్య ముంబయి కుర్లా లోని క్రాంతినగర్ మురికివాడలో నేవీ బృందం లైఫ్ జాకెట్లు, రబ్బర్ బోట్లతో రక్షణ చర్యలు చేపట్టింది. ముంబయి పరిధిలోని రాయ్ గఢ్, థానె, పాల్ఘర్ జిల్లాల్లో నడుం లోతు వరద ప్రవహిస్తుండడంతో ట్రాఫిక్ అస్తవ్యస్తమయింది. దాదాపు 150 బ్రిహన్ ముంబయి రవాణా(విద్యుత్) బస్సులు వరద నీటిలో మునిగిపోయాయి. ఈ మధ్యాహ్నం ఎడతెగని వాన తెరపి ఇవ్వడంతో జనం ఇళ్ల నుంచి బయటకు వచ్చి కూరగాయలు, పాలు ఇతర నిత్యావసర వస్తువులు కొనుగోలు చేసి నిల్వ చేసుకున్నారు. భారత వాతావరణ శాఖ(ఐఎండి) హెచ్చరికల నేపథ్యంలో భారీ వర్షాలు కొనసాగే ప్రమాదం ఉందని తెలియడంతో జనం భీతిల్లుతున్నారు. విమాన రాకపోకలకు తీవ్ర అంతరాయం కల్గడంతో ప్రయాణికులు అవస్థల పాలయ్యారు. ఛత్రపతి శివాజీ అంతర్జాతీయ విమానాశ్రయంలో సోమవారం అర్ధరాత్రి నుంచి ప్రయాణికులు పడిగాపులు కాస్తున్నారు. ఈ విమానాశ్రయానికి రావాల్సిన 55 విమానాల్ని దారి మళ్లించారు. ఇందులో 26 అంతర్జాతీయ విమానాలున్నాయి. ఇక్కడ నుంచి బయలుదేరాల్సిన 4 అంతర్జాతీయ విమానాలు సహా మొత్తం 18 విమానాల్ని రద్దు చేసినట్లు విమానాశ్రయ వర్గాలు తెలిపాయి. అంధేరి, జోగేశ్వరి, విలేపార్లే, దహిసర్ ప్రాంతాలన్నీ వరద నీటిలో మునిగి ఉండడంతో రోడ్డు మార్గం లో ప్రయాణాలు పూర్తిగా నిలిచిపోయాయి. ముంబయి-థానె మార్గంలో ట్రాక్ లన్నీ నీట మునగడంతో సెంట్రల్ రైల్వే పలు రైళ్లను దారి మళ్లించింది. పశ్చిమ రైల్వే జోన్ కు చెందిన రైళ్ల రాకపోకలకు అంతరాయం కల్గింది. ఛత్రపతి శివాజీ మహరాజ్ టెర్మినస్ నుంచి థానె మార్గంలో రైళ్లను పూర్తిగా రద్దు చేశారు. జులై 3,4 తేదీల్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురవనున్నట్లు హైదరాబాద్ లోని వాతావరణ శాఖ వర్గాలు హెచ్చరిక జారీ చేశాయి.