రాజస్థాన్ నుంచి రాజ్యసభకు మన్మోహన్:కాంగ్రెస్ యత్నం
మాజీ ప్రధానమంత్రి, ఆర్థిక సంస్కరణల రూపశిల్పుల్లో
ఒకరైన డా.మన్మోహన్ సింగ్ ను రాజస్థాన్ నుంచి రాజ్యసభకు పంపనున్నారు. ఎగువసభలో ఆయన ఇంతవరకు
అసోం నుంచి ప్రాతినిధ్యం వహించిన సంగతి తెలిసిందే. గత నెలలో రాజ్యసభలో ఆయన పదవీ
కాలం పూర్తి అయింది. అసోం నుంచి ఆయనను తిరిగి ఎంపిక చేయడానికి ఆ రాష్ట్ర
అసెంబ్లీలో కాంగ్రెస్ కు తగిన సంఖ్యా బలం లేదు. మిత్రపక్షం డీఎంకె చెయ్యిచ్చిన
దరిమిలా కాంగ్రెస్ రాజస్థాన్ నుంచి ఆయనను ఎంపిక చేయాలని చూస్తోంది. ఇటీవల
రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన విషయం విదితమే. రాజ్యసభలో
రాజస్థాన్ నుంచి ఏకైక స్థానం ఖాళీ అయింది. బీజేపీ అధ్యక్షుడు మదన్ లాల్ సైనీ గత
నెల24న మరణించడంతో రాజ్యసభ కు ఆ రాష్ట్రం నుంచి ఉప ఎన్నిక అనివార్యమైంది. ఇప్పుడు ఆ
దిశగా కాంగ్రెస్ అధిష్ఠానం ఆలోచన సాగిస్తోంది. గత సార్వత్రిక ఎన్నికల్లో డీఎంకె,
కాంగ్రెస్ కూటమి లోక్ సభ కు గణనీయంగా అభ్యర్థుల్ని గెలిపించుకోగలిగాయి. కాంగ్రెస్
ఆ రాష్ట్రం నుంచి ఒక రాజ్యసభ స్థానాన్ని డీఎంకె ద్వారా ఆశించింది. అయితే తమ
కూటమిలోని ఎండీఎంకె అధినేత వి.గోపాలస్వామి (వైగో) కి ఆ స్థానాన్ని ఇవ్వనున్నట్లు
తాజాగా డీఎంకె మెలికపెట్టింది. దాంతో మన్మోహన్ సింగ్ ను రాజస్థాన్ నుంచి రాజ్యసభకు
పంపాలని కాంగ్రెస్ నిర్ణయం తీసుకుంది. ఈ దఫా మన్మోహన్ రాజస్థాన్ నుంచి రాజ్యసభలో
అడుగుపెడితే 2024 వరకు సభ్యుడిగా కొనసాగుతారు.
No comments:
Post a Comment