Thursday, June 20, 2019

raising issue of rahul`s use of mobile during president address frivolous:congress



రాహుల్ పార్లమెంట్ లో ఫోన్ చూసుకుంటున్నారంటూ..
బీజేపీ పనికిమాలిన ఆరోపణలు చేస్తోంది:కాంగ్రెస్
రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ పార్లమెంట్ ఉభయ సభల్ని ఉద్దేశించి ప్రసంగిస్తున్నప్పుడు కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఫోన్ తో బిజీ అయిపోయారనే బీజేపీ ఆరోపణల్ని కాంగ్రెస్ తీవ్రంగా ఖండించింది. ఆ పార్టీ చేస్తున్న ఆరోపణలు పనికిమాలినవిగా పేర్కొంది. గురువారం పార్లమెంట్ లో రాష్ట్రపతి ప్రసంగిస్తుండగా రాహుల్ 20 నిమిషాల సేపు యూపీఏ చైర్ పర్సన్ సోనియాగాంధీతో మాట్లాడారని అరగంటకు పైగా ఫోన్ చూసుకుంటూ గడపారని బీజేపీ సభ్యులు ఆరోపించారు. అంతేకాకుండా పార్లమెంట్ లో రాహుల్ తన ఫోన్ ద్వారా ఫొటోలు తీసుకోవడంలో నిమగ్నమైపోయారన్నారు. పలు విషయాలపై గంభీరంగా రాష్ట్రపతి ప్రసంగిస్తుండగా కనీసం ఆ అంశాలపై రాహుల్ దృష్టి పెట్టలేదన్న బీజేపీ సభ్యుల ఆరోపణల్ని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు ఆనంద్ శర్మ విలేకర్ల సమావేశంలో తీవ్రంగా ఖండించారు. రాష్ట్రపతి ప్రసంగంలోని అంశాలపై దృష్టి పెట్టిన రాహుల్ వాటిపైనే తమ నాయకురాలు సోనియాతో చర్చిస్తున్నట్లు వివరించారు. ఢిల్లీ ఎయిర్ పోర్ట్ లో ఇటీవల పుల్వామా దాడిలో మృతి చెందిన సీఆర్పీఎఫ్ జవాన్ల స్మృత్యర్థం మౌనం పాటిస్తున్న సందర్భంలోనూ రాహుల్ ఫోన్ చూసుకోవడంలో నిమగ్నమయ్యారంటూ బీజేపీ సభ్యుడు పరేశ్ రావల్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అయితే ఈ పోస్ట్ లో షేర్ చేసిన వీడియో, ఫొటోలు నకిలీ వంటూ నెటిజెన్లు రావల్ పై మండిపడ్డారు. ఓ వైపు రాహుల్ ఫోన్ చేసుకుంటున్నట్లున్న దృశ్యంతో పాటు మరో పక్క ప్రధాని మోదీ గౌరవ వందనం చేస్తున్న ఫొటోను జత చేసి రావల్ ఫేస్ బుక్ పోస్టులో ఫొటో పెట్టారు. ఈ ఫొటోను చూస్తేనే ప్రధాని మోదీకి, రాహుల్ గాంధీకి నాయకత్వంలో ఎంత తేడా ఉందో సుస్పష్టమౌతోందని కామెంట్ రాశారు. అయితే రాహుల్ ఫోన్ చూసుకుంటున్నట్లున్న ఫొటో నకిలీదిగా తేల్చిన కొందరు నెటిజన్లు `ఇది బుద్ధిమాలిన పని..నకిలీ వార్తాహరుడు పరేశ్ రావల్ మన ఎంపీ కావడం సిగ్గు చేటు` అని పేర్కొన్నారు.

Wednesday, June 19, 2019

Captain Williamson leads Newzealand to consecutive win


దక్షిణాఫ్రికాపై సెంచరీతో జట్టును గెలిపించిన కివీస్ కెప్టెన్
కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడి సెంచరీ సాధించిన కేన్ విలియమ్సన్ న్యూజిలాండ్ కు దక్షిణాఫ్రికాపై చిరస్మరణీయ విజయాన్ని అందించాడు. వరల్డ్ కప్-12 ఎడ్జ్ బాస్టన్ లో బుధవారం ద.ఆఫ్రికాతో జరిగిన మ్యాచ్ నం.25లో న్యూజిలాండ్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. నిర్ణీత 49 ఓవర్లలో సఫారీలు 6 వికెట్లు కోల్పోయి 241 పరుగులు చేశారు. ఓపెనర్ హషీం అమ్లా (55), మిడిల్ ఆర్డర్ లో రస్సీ వేండర్ డస్సెన్ (67) మాత్రమే రాణించారు. కివీస్ బౌలర్లలో లకీ ఫెర్గుసన్ 3 వికెట్లు తీసుకోగా ట్రెంట్ బౌల్ట్, కోలిన్ డె గ్రాండ్ హోమ్, మిషెల్ శాంటనర్ తలో వికెట్ పడగొట్టారు. అనంతరం 242 పరుగుల విజయం లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన కివీస్ చక్కటి గేమ్ ప్లాన్ తో వరుస విజయాన్ని నమోదు చేసుకుంది. మూడో ఓవర్ తొలి బంతికే ఓపెనర్ కోలిన్ మన్రో(9) వికెట్ ను న్యూజిలాండ్ కోల్పోయింది. రబాడ కాట్ అండ్ బౌల్డ్ గా మన్రోను పెవిలియన్ చేర్చాడు. వన్డౌన్లో బ్యాటింగ్ కు దిగిన విలియమ్సన్ ఆచితూచి ఆడుతూ స్కోరు బోర్డును కదిలించాడు. మరో ఓపెనర్ గుఫ్తిల్ (35) కెప్టెన్ కు అండగా క్రీజ్ లో నిలిచాడు. రెండో వికెట్ కు 15 ఓవర్లలో వీరిద్దరు 60 పరుగులు జోడించారు. జట్టు స్కోరు 72 పరుగుల వద్ద అండిల్ ఫెహ్లుక్వయో బౌలింగ్ లో హిట్ వికెట్ గా గుప్తిల్ వెనుదిరిగాడు. అప్పటి నుంచి బాధ్యతంతా విలియమ్సన్ భుజాలపై పడింది. మరో రెండు పరుగుల స్కోరు తర్వాత రాస్ టేలర్(1) మోరిస్ బౌలింగ్ లో కీపర్ డీకాక్ కు క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. కివీస్ వికెట్ కీపర్ బ్యాట్స్ మన్ టామ్ లాథమ్(1) కూడా యాక్షన్ రిప్లే మాదిరిగా మోరిస్ బౌలింగ్ లో కీపర్ డీకాక్ కే క్యాచ్ ఇఛ్చి అదే ఓవర్లో పెవిలియన్ చేరడంతో న్యూజిలాండ్ కష్టాల్లో పడింది. జేమ్స్ నీషమ్ (23) మోరిస్ బౌలింగ్ లో అమ్లాకు క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. అప్పటికి న్యూజిలాండ్ స్కోరు 32.2 ఓవర్లలో 137 పరుగులకు 5 వికెట్లు కోల్పోయింది. ఆ తర్వాత కెప్టెన్ తో జత కలిసిన కోలిన్ గ్రాండ్ హోమ్ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. 47 బంతుల్లో 60 పరుగులు చేసి చివరి ఓవర్లలో నిగిడి బౌలింగ్ లో సఫారీల కెప్టెన్ డూప్లెసిస్ కు క్యాచ్ ఇచ్చి క్రీజ్ ను వదిలాడు. విజయం అంచుల వరకు వచ్చిన కివీస్ ను గెలిపించే బాధ్యత విలియమ్సన్ తీసుకున్నాడు. 48 ఓవర్ చివరి బంతికి స్లిప్స్ దిశగా బౌండరీ సాధించాడు. చివరి ఓవర్ 8 పరుగులు కావాల్సి ఉండగా తొలి బంతిని మిషెల్ శాంటనెర్ సింగిల్ తీయడంతో స్ట్రయికింగ్ వచ్చిన విలియమ్సన్.. అండిల్ వేసిన స్లో డెలివరీని సిక్సర్ గా మలిచి వరల్డ్ కప్ లో తొలి సెంచరీ(103*) చేశాడు. గెలుపునకు కావాల్సిన చివరి రన్ ను సింగిల్ తీసి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ ను గెలుచుకున్నాడు. కివీస్ 48.3 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 242 లక్షాన్ని ఛేదించింది. ఈ ఓటమితో ద.ఆఫ్రికాకు సెమీస్ అవకాశాలు చేజారినట్టే. సఫారీ బౌలర్లలో క్రిస్ మోరిస్ 3 వికెట్లు, కగిసొ రబాడ, లంగి నిగిడి, అండెల్ తలో వికెట్ తీసుకున్నారు. కెప్టెన్ గా 3000 పరుగులు చేసిన బ్యాట్స్ మెన్ జాబితాలో ఏబీ డివిలియర్స్, విరాట్ కోహ్లి సరసన విలియమ్సన్ చేరాడు.

South Africa mp racially abused at tourist site


వర్ణ వివక్షకు గురైన దక్షిణాఫ్రికా ఎంపీ ఫుంజైల్ వాండమే
దక్షిణాఫ్రికాలో ఇంకా జాత్యాహంకార ధోరణులు పూర్తిగా సమసి పోలేదనడానికి సాక్షాత్తు ఆ దేశ పార్లమెంట్ ఎంపీకే ఎదురైన అవమానం ఉదాహరణగా నిలుస్తోంది. డెమోక్రటిక్ అలయెన్స్ కు చెందిన ప్రతిపక్ష సభ్యురాలు ఫుంజైల్ వాండమే ఈ విషయాన్ని వెల్లడిస్తూ పోలీసుల్ని ఆశ్రయించనున్నట్లు తెలిపారు. ఆమె దేశ రాజధాని కెప్ టౌన్ లోగల ప్రఖ్యాత పర్యాటక ప్రాంతం విక్టోరియా ఆల్ఫ్రెడ్ వాటర్ ఫ్రంట్ (వీ&ఏ వాటర్ ఫ్రంట్) సందర్శనకు వెళ్లినప్పుడు తనకు ఈ దుస్సంఘటన ఎదురైందన్నారు. అక్కడ గల షాపింగ్ మాల్ లో రద్దీ నెలకొనడంతో వరుసలో ఓ తెల్లజాతీయురాలి వెనుక నిలబడ్డానని వాండమే తెలిపారు. ఇంతలో ఆమెతో వచ్చిన తెల్లజాతి వ్యక్తి తనను పక్కకు లాగేశాడన్నారు. ఎందుకని ప్రశ్నించిన తనను నువ్వు నల్ల జాతీయురాలివి అంటూ దుర్భాషలాడినట్లు వాండమే తెలిపారు. వాగ్వాదంలో తనపై దాడికి యత్నించడంతో ఆత్మరక్షణార్థం అతని మొహంపై పిడిగుద్దులు కురిపించినట్లు చెప్పారు. ఈ మేరకు వీడియోను ఆమె ట్విటర్ లో పోస్ట్ చేశారు. అంతేకాకుండా ఆ షాపింగ్ మాల్ యాజమాన్యానికి `మీరు వర్ణ వివక్షకు మద్దతు ఇస్తున్నట్లయితే బయట బోర్డు తగిలించండి.. నేను మాత్రం ఈ తరహా వివక్షకు ఎవరు పాల్పడినా సహించను` అంటూ వాండమే ఘాటుగా లేఖ రాశారు. దాంతో ఆ షాపింగ్ మాల్ యాజమాన్యంతో పాటు వీ&ఏ వాటర్ ఫ్రంట్ నిర్వాహకులు ఎంపీని క్షమాపణలు వేడుకున్నారు. ఇటువంటివి మళ్లీ పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. దక్షిణాఫ్రికాలో ఆఫ్రికన్ నేషనల్ కాంగ్రెస్ (ఏఎన్సీ) అధికారంలో ఉండగా డెమోక్రటిక్ అలయెన్స్ (డీఏ) ప్రతిపక్షంగా వ్యవహరిస్తోంది. ప్రతిపక్ష డీఏ లో వాండమే అత్యంత పిన్న వయస్కురాలైన ఎంపీ. ఆమె గ్రాహమ్స్ టౌన్ లో గల రోడ్స్ యూనివర్సిటీ నుంచి 2007లో డిగ్రీ పట్టా పొందారు.

Modi wishes good health, long life to Rahul Gandhi on his birthday



రాహుల్ గాంధీ జన్మదిన వేడుకల్లో అభినందనల వెల్లువ
కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ తన 49 జన్మదిన వేడుకల్ని ఘనంగా అభిమానుల మధ్య జరుపుకున్నారు. బుధవారం ఆయనను తల్లి సోనియాగాంధీ తన నివాసంలో జన్మదిన శుభాకాంక్షలు తెలిపి ఆశీర్వదించారు. చెల్లెలు ప్రియాంక గాంధీ, కాంగ్రెస్ సీనియర్ నేత గులాంనబీ అజాద్ పుష్పగుచ్ఛాలు అందజేసి పుట్టిన రోజు అభినందనలు తెలిపారు.  ప్రధాని మోదీ ట్విటర్ లో రాహుల్ గాంధీకి బర్త్ డే విషెస్ తెల్పుతూ కలకాలం ఆయురారోగ్యాలతో జీవించాలని ఆకాంక్షించారు. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ఢిల్లీలోని కాంగ్రెస్ ప్రధాన కార్యాలయానికి చేరుకుని రాహుల్ గాంధీకి శుభాకాంక్షలు తెలిపారు. కాంగ్రెస్ శ్రేణులు తమ ప్రియతమ నేత జన్మదినాన్ని పరస్పరం శుభాకాంక్షలు తెల్పుకుని ఘనంగా నిర్వహించుకున్నారు. తనకు పుట్టిన రోజు అభినందనలు చెప్పిన అందరికీ రాహుల్ ధన్యవాదాలు తెలిపారు.