వర్ణ వివక్షకు గురైన దక్షిణాఫ్రికా
ఎంపీ ఫుంజైల్ వాండమే
దక్షిణాఫ్రికాలో
ఇంకా జాత్యాహంకార ధోరణులు పూర్తిగా సమసి పోలేదనడానికి
సాక్షాత్తు ఆ దేశ పార్లమెంట్ ఎంపీకే ఎదురైన అవమానం ఉదాహరణగా నిలుస్తోంది.
డెమోక్రటిక్ అలయెన్స్ కు చెందిన ప్రతిపక్ష సభ్యురాలు ఫుంజైల్ వాండమే ఈ విషయాన్ని
వెల్లడిస్తూ పోలీసుల్ని ఆశ్రయించనున్నట్లు తెలిపారు. ఆమె దేశ రాజధాని కెప్ టౌన్
లోగల ప్రఖ్యాత పర్యాటక ప్రాంతం విక్టోరియా ఆల్ఫ్రెడ్ వాటర్ ఫ్రంట్ (వీ&ఏ వాటర్ ఫ్రంట్)
సందర్శనకు వెళ్లినప్పుడు తనకు ఈ దుస్సంఘటన ఎదురైందన్నారు. అక్కడ గల షాపింగ్ మాల్
లో రద్దీ నెలకొనడంతో వరుసలో ఓ తెల్లజాతీయురాలి వెనుక నిలబడ్డానని వాండమే తెలిపారు.
ఇంతలో ఆమెతో వచ్చిన తెల్లజాతి వ్యక్తి తనను పక్కకు లాగేశాడన్నారు. ఎందుకని
ప్రశ్నించిన తనను నువ్వు నల్ల జాతీయురాలివి అంటూ దుర్భాషలాడినట్లు వాండమే
తెలిపారు. వాగ్వాదంలో తనపై దాడికి యత్నించడంతో ఆత్మరక్షణార్థం అతని మొహంపై
పిడిగుద్దులు కురిపించినట్లు చెప్పారు. ఈ మేరకు వీడియోను ఆమె ట్విటర్ లో పోస్ట్
చేశారు. అంతేకాకుండా ఆ షాపింగ్ మాల్ యాజమాన్యానికి `మీరు వర్ణ వివక్షకు మద్దతు
ఇస్తున్నట్లయితే బయట బోర్డు తగిలించండి.. నేను మాత్రం ఈ తరహా వివక్షకు ఎవరు
పాల్పడినా సహించను` అంటూ వాండమే ఘాటుగా లేఖ రాశారు. దాంతో ఆ షాపింగ్ మాల్
యాజమాన్యంతో పాటు వీ&ఏ వాటర్ ఫ్రంట్ నిర్వాహకులు ఎంపీని క్షమాపణలు వేడుకున్నారు. ఇటువంటివి మళ్లీ
పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. దక్షిణాఫ్రికాలో ఆఫ్రికన్ నేషనల్ కాంగ్రెస్ (ఏఎన్సీ) అధికారంలో ఉండగా డెమోక్రటిక్ అలయెన్స్ (డీఏ) ప్రతిపక్షంగా
వ్యవహరిస్తోంది. ప్రతిపక్ష డీఏ లో వాండమే అత్యంత పిన్న వయస్కురాలైన ఎంపీ. ఆమె
గ్రాహమ్స్ టౌన్ లో గల రోడ్స్ యూనివర్సిటీ నుంచి 2007లో డిగ్రీ పట్టా పొందారు.
No comments:
Post a Comment