దక్షిణాఫ్రికాపై సెంచరీతో
జట్టును గెలిపించిన కివీస్ కెప్టెన్
కెప్టెన్ ఇన్నింగ్స్
ఆడి సెంచరీ సాధించిన కేన్ విలియమ్సన్ న్యూజిలాండ్ కు దక్షిణాఫ్రికాపై చిరస్మరణీయ
విజయాన్ని అందించాడు. వరల్డ్ కప్-12 ఎడ్జ్ బాస్టన్ లో బుధవారం ద.ఆఫ్రికాతో జరిగిన
మ్యాచ్ నం.25లో న్యూజిలాండ్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. నిర్ణీత 49 ఓవర్లలో
సఫారీలు 6 వికెట్లు కోల్పోయి 241 పరుగులు చేశారు. ఓపెనర్ హషీం అమ్లా (55), మిడిల్
ఆర్డర్ లో రస్సీ వేండర్ డస్సెన్ (67) మాత్రమే రాణించారు. కివీస్ బౌలర్లలో లకీ
ఫెర్గుసన్ 3 వికెట్లు తీసుకోగా ట్రెంట్ బౌల్ట్, కోలిన్ డె గ్రాండ్ హోమ్, మిషెల్
శాంటనర్ తలో వికెట్ పడగొట్టారు. అనంతరం 242 పరుగుల విజయం లక్ష్యంతో బ్యాటింగ్
ప్రారంభించిన కివీస్ చక్కటి గేమ్ ప్లాన్ తో వరుస విజయాన్ని నమోదు చేసుకుంది. మూడో
ఓవర్ తొలి బంతికే ఓపెనర్ కోలిన్ మన్రో(9) వికెట్ ను న్యూజిలాండ్ కోల్పోయింది. రబాడ
కాట్ అండ్ బౌల్డ్ గా మన్రోను పెవిలియన్ చేర్చాడు. వన్డౌన్లో బ్యాటింగ్ కు దిగిన
విలియమ్సన్ ఆచితూచి ఆడుతూ స్కోరు బోర్డును కదిలించాడు. మరో ఓపెనర్ గుఫ్తిల్ (35)
కెప్టెన్ కు అండగా క్రీజ్ లో నిలిచాడు. రెండో వికెట్ కు 15 ఓవర్లలో వీరిద్దరు 60
పరుగులు జోడించారు. జట్టు స్కోరు 72 పరుగుల వద్ద అండిల్ ఫెహ్లుక్వయో బౌలింగ్ లో
హిట్ వికెట్ గా గుప్తిల్ వెనుదిరిగాడు. అప్పటి నుంచి బాధ్యతంతా విలియమ్సన్ భుజాలపై
పడింది. మరో రెండు పరుగుల స్కోరు తర్వాత రాస్ టేలర్(1) మోరిస్ బౌలింగ్ లో కీపర్
డీకాక్ కు క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. కివీస్ వికెట్ కీపర్ బ్యాట్స్ మన్ టామ్ లాథమ్(1)
కూడా యాక్షన్ రిప్లే మాదిరిగా మోరిస్ బౌలింగ్ లో కీపర్ డీకాక్ కే క్యాచ్ ఇఛ్చి అదే
ఓవర్లో పెవిలియన్ చేరడంతో న్యూజిలాండ్ కష్టాల్లో పడింది. జేమ్స్ నీషమ్ (23) మోరిస్
బౌలింగ్ లో అమ్లాకు క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. అప్పటికి న్యూజిలాండ్ స్కోరు 32.2
ఓవర్లలో 137 పరుగులకు 5 వికెట్లు కోల్పోయింది. ఆ తర్వాత కెప్టెన్ తో జత కలిసిన
కోలిన్ గ్రాండ్ హోమ్ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. 47 బంతుల్లో 60 పరుగులు చేసి
చివరి ఓవర్లలో నిగిడి బౌలింగ్ లో సఫారీల కెప్టెన్ డూప్లెసిస్ కు క్యాచ్ ఇచ్చి
క్రీజ్ ను వదిలాడు. విజయం అంచుల వరకు వచ్చిన కివీస్ ను గెలిపించే బాధ్యత
విలియమ్సన్ తీసుకున్నాడు. 48 ఓవర్ చివరి బంతికి స్లిప్స్ దిశగా బౌండరీ సాధించాడు.
చివరి ఓవర్ 8 పరుగులు కావాల్సి ఉండగా తొలి బంతిని మిషెల్ శాంటనెర్ సింగిల్ తీయడంతో
స్ట్రయికింగ్ వచ్చిన విలియమ్సన్.. అండిల్ వేసిన స్లో డెలివరీని సిక్సర్ గా మలిచి
వరల్డ్ కప్ లో తొలి సెంచరీ(103*) చేశాడు. గెలుపునకు కావాల్సిన చివరి రన్ ను సింగిల్ తీసి
మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ ను గెలుచుకున్నాడు. కివీస్ 48.3 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి
242 లక్షాన్ని ఛేదించింది. ఈ ఓటమితో ద.ఆఫ్రికాకు సెమీస్ అవకాశాలు చేజారినట్టే. సఫారీ
బౌలర్లలో క్రిస్ మోరిస్ 3 వికెట్లు, కగిసొ రబాడ, లంగి నిగిడి, అండెల్ తలో వికెట్
తీసుకున్నారు. కెప్టెన్ గా 3000 పరుగులు చేసిన బ్యాట్స్ మెన్ జాబితాలో ఏబీ
డివిలియర్స్, విరాట్ కోహ్లి సరసన విలియమ్సన్ చేరాడు.
No comments:
Post a Comment