చైనాలో
భూకంపం 11 మంది దుర్మరణం
చైనాలో సోమవారం అర్ధరాత్రి రెండు ప్రాంతాల్లో తీవ్ర భూకంపాలు
సంభవించాయి. ఈ భూకంపాల్లో మొత్తం 11 మంది మృత్యువాత పడగా మరో 122 మంది తీవ్రగాయాలపాలయ్యారు.
చైనా నైరుతి ప్రాంతంలోని సిచువాన్ ప్రావిన్స్ యుబిన్ కౌంటీలో సోమవారం రాత్రి
11.55 ప్రాంతంలో తొలి భూకంపం సంభవించింది. దీని తీవ్రత రిక్టర్ స్కేల్ పై 6.0గా
నమోదయింది. భూమి లోపల 16 కి.మీ. లోతున భూకంపకేంద్రాన్ని గుర్తించిన్నట్లు చైనా
ఎర్త్ క్వాక్ నెట్ వర్క్స్ సెంటర్ (సీఈఎన్సీ) వర్గాలు తెలిపాయి. రాజధాని
చెంగ్డ్యూతో పాటు మరో నగరం చోంగ్వింగ్ భూకంపాల తీవ్రతకు చిగురుటాకుల్లా
వణికిపోయాయి. ప్రజలు ఫ్రాణభయంతో ఇళ్ల నుంచి వీధుల్లోకి పరుగులు తీశారు. రెండో
భూకంపం 5.2 తీవ్రతతో సంభవించినట్లు చాంగ్వింగ్ కౌంటీలోని యూఎస్ జియోలాజికల్ సర్వే
అధికారులు పేర్కొన్నారు. సిచువాన్ ప్రావిన్స్ లో 2008 నాటి తీవ్ర భూకంపంలో సుమారు
70వేల మంది మృత్యువాత పడ్డారు. ఇళ్లు కూలిపోయిన ఘటనలో జనం ఎక్కువగా ప్రాణాలు
కోల్పోయినట్లు సమాచారం. పెద్ద ఎత్తున ఆస్తి నష్టం వాటిల్లినట్లు తెలుస్తోంది. అత్యవసర
సహాయక బృందాలు, సైనిక, పోలీసు సిబ్బంది శిథిలాల తొలగింపు పనుల్ని చేపట్టారు. క్షతగాత్రుల్ని
ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. సహాయ రక్షణ చర్యలు ముమ్మరంగా
కొనసాగుతున్నాయి.