Monday, June 17, 2019

JP Nadda appointed bjp`s irst working president:PM calls him humble and affable


బీజేపీ తొలి కార్యనిర్వాహక అధ్యక్షుడిగా ఎంపికైన జేపీనడ్డా
భారతీయ జనతా పార్టీ తొలి కార్యనిర్వాహక అధ్యక్షుడిగా రాజ్యసభ సభ్యులైన జగత్ ప్రకాశ్ నడ్డా(జేపీనడ్డా) ఎంపికయ్యారు. సోమవారం బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశమై ఈ మేరకు నడ్డాను ఎంపిక చేసింది. ఆయన బీజేపీలో కార్యకర్త స్థాయి నుంచి అంచెలంచెలుగా ఎదిగి కేంద్రమంత్రి పదవి పొందారు. గత మోదీ ప్రభుత్వంలో ఆయన వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. అలాగే హిమాచల్ ప్రదేశ్ ప్రేమ్ కుమార్ దుమాల్(బీజేపీ) ప్రభుత్వంలో పలు మంత్రిత్వ శాఖలు నిర్వహించిన అనుభవం ఉంది. 59ఏళ్ల నడ్డా హిమాచల్ ప్రదేశ్ లో డాక్టర్ నారాయణ్ లాల్ నడ్డా, శ్రీమతి కృష్ణ నడ్డా దంపతులకు జన్మించారు. పట్నా యూనివర్సిటీలో ఎల్.ఎల్.బి చదివారు. 1993లో హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీకి తొలిసారి ఎన్నికయ్యారు. 2014 నుంచి రాజ్య సభ సభ్యులుగా ఉన్నారు. ఆయనకు భార్య మల్లికా నడ్డా, ఇద్దరు పిల్లలున్నారు. బీజేపీ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా ఎంపికయిన నడ్డాను ప్రధాని మోదీ, పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా అభినందించారు. అమిత్ షా ప్రస్తుతం హోంమంత్రిగా కూడా వ్యవహరిస్తున్నందున పార్టీ అధ్యక్ష బాధ్యతల్ని ఆయనతో కలిసి నడ్డా పంచుకోనున్నారు. త్వరలో జరుగనున్న పార్టీ కార్యనిర్వాహక వర్గ ఎన్నికల అనంతరం పూర్తిగా అధ్యక్ష బాధ్యతలు నడ్డాయే చేపడతారా లేదా కొత్త అధ్యక్షుడి ఎన్నిక జరుగుతుందో తేలుతుంది. బీజేపీ అధ్యక్షుడిగా రెండేళ్లకోసారి కొత్త నేత ఎన్నిక జరుగుతుంది. అయితే ఈసారి కొత్తగా కార్యనిర్వాహక అధ్యక్షుణ్నిఎంపిక చేయడంతో అమిత్ షాయే అధ్యక్ష పదవిలో కొనసాగే అవకాశమూ ఉంది. పార్టీ వ్యవస్థాపకుడు శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ జయంత్యుత్సవాల సందర్భంగా జులై 6 నుంచి బీజేపీ విస్తృత స్థాయి సభ్యత్వాల నమోదు కార్యక్రమాన్ని పార్టీ పెద్దఎత్తున చేపట్టనున్న క్రమంలో కార్యనిర్వాహక అధ్యక్షుడిగా జె.పి.నడ్డా కీలక పాత్ర పోషించనున్నారు.


Kejriwal seeks action against cops for thrashing driver


తప్పు చేసిన పోలీసులపై చర్యలు తీసుకోవాలి:కేజ్రీవాల్
దేశ రాజధాని ఢిల్లీలోని ముజఫర్ నగర్ లో ఆదివారం పోలీసులకు టెంపో డ్రైవర్ కు మధ్య జరిగిన ఘర్షణపై ముఖ్యమంత్రి కేజ్రీవాల్ స్పందించారు. పోలీసుల దాడిలో గాయపడిన బాధిత టెంపో డ్రైవర్ కుటుంబ సభ్యుల్ని సోమవారం ఆయన పరామర్శించారు. అనంతరం ఆయన విలేకర్లతో మాట్లాడుతూ ఢిల్లీలో శాంతిభద్రతల పరిస్థితికి ఆదివారం నాటి ఘటన అద్దం పడుతోందని వ్యాఖ్యానించారు. ఢిల్లీలో నేరాల శాతం పెరిగిపోతోందన్నారు. శాంతిభద్రతల అంశంపై కేంద్రహోం మంత్రి, లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజల్ దృష్టి సారించాలన్నారు. ఈ ఘటనలో తప్పు చేసిన పోలీసులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. గస్తీ నిర్వహిస్తున్న పోలీసులకు టెంపో డ్రైవర్ కు తొలుత వాగ్వాదం చోటు చేసుకుంది. సీనియర్ ఆఫీసర్ తో కూడిన పోలీసు బృందం టెంపో డ్రైవర్ తలపాగాను తీసివేయడానికి యత్నిస్తూ దాడికి పాల్పడ్డారు. దాంతో అతను పొడవాటి కత్తితో వారిపై ఎదురుదాడికి దిగాడు. రోడ్డుపై పోలీసుల్ని ఆ టెంపో డ్రైవర్ కత్తి చేత పట్టుకుని తరుముతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కోపోద్రిక్తులైన ఆ వర్గానికి చెందిన వారు పోలీసుల అనాగరిక వైఖరిపై ఆందోళన చేపట్టారు. ఈ పరిణామాలు తీవ్రరూపం దాల్చకుండా చక్కదిద్దాలని సీఎం కేజ్రీవాల్ కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. విధి నిర్వహణలో దుర్వినియోగానికి పాల్పడిన ముగ్గురు పోలీసుల్ని సస్పెండ్ చేసినట్లు ఢిల్లీ పోలీస్ ఉన్నతాధికారులు తెలిపారు. ఈ మొత్తం ఘటనపై ముగ్గురు సీనియర్ పోలీసు అధికారులతో దర్యాప్తు చేపట్టామన్నారు. ఈ ఘటన అప్పుడే రాజకీయ రంగు పులుముకుంటోంది. రాజౌరి గార్డెన్ బీజేపీ ఎమ్మెల్యే మణిందర్ సింగ్ శిర్సా మాట్లాడుతూ పోలీసులే తొలుత టెంపో డ్రైవర్ పై దాడికి పాల్పడ్డారని ఆరోపించారు. అతని మత సంప్రదాయానికి విఘాతం కల్గించారన్నారు.

India beat Pakistan by 89 runs with affect of DRS



ఆల్ రౌండ్ ప్రతిభతో పాక్ ను చిత్తు చేసిన భారత్
వరుణుడు అసలు కరుణిస్తాడా? మ్యాచ్ జరుగుతుందా లేదా అనే మీమాంస తో ప్రారంభమైన భారత్- పాక్ వరల్డ్ కప్ మ్యాచ్ లో చివరకు విజయం మెన్ ఇన్ బ్లూనే వరించింది. వరల్డ్ కప్-12 మ్యాచ్ నం.22 ఆదివారం మాంచెస్టర్ వేదికపై జరిగిన భారత్ పాకిస్థాన్ క్రికెట్ పోరులో గెలుపు ఆల్ రౌండ్ నైపుణ్యం పక్షానే నిలిచింది. వర్షం ఇరు జట్ల ఇన్నింగ్స్ లో రెండు సార్లు కొద్ది సేపు అంతరాయం కల్గించగా డక్ వర్త్ లూయిస్ (డీఆర్ఎస్) నిబంధనల ప్రకారం భారత్ 89 పరుగుల తేడాతో పాకిస్థాన్ ను చిత్తు చేసింది. ప్రపంచ కప్ సమరంలో భారత్ ఏడింటికి ఏడు సార్లు పాకిస్థాన్ పై గెలిచి రికార్డు నెలకొల్పింది. టాస్ గెలిచిన పాక్ కెప్టెన్ సర్ఫ రాజ్ అహ్మద్ ఫీల్డింగ్ ఎంచుకోగా భారత్ 50 ఓవర్లలో 336/5 పరుగులు చేసింది. సీనియర్ ఓపెనర్ శిఖర్ ధావన్ లేని లోటును వరల్డ్ కప్ లో తొలిసారి ఓపెనర్ గా దిగిన కె.ఎల్.రాహుల్(57) చక్కగా భర్తీ చేశాడు. నిలకడైన ఆటతీరుతో అర్ధ సెంచరీ సాధించి ఆకట్టుకున్నాడు. వరల్డ్ టాప్ ఓపెనర్ రోహిత్ శర్మ బాధ్యతంతా భుజాలకెత్తుకుని టోర్నీలో రెండో సెంచరీ కొట్టాడు. కెప్టెన్ విరాట్ కోహ్లి మరో అర్ధ సెంచరీతో కదం తొక్కాడు. అనంతరం 337 పరుగుల విజయలక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన పాకిస్థాన్ ఆద్యంతం పేలవమైన ఆటతీరునే కనబర్చింది. చక్కటి లైన్ అండ్ లెంగ్త్ లో బౌలింగ్ చేస్తున్న భువనేశ్వర్, బూమ్రా ల పేస్ జోడీకి విజయ్ శంకర్, హార్ధిక్ పాండ్యా జత కలిశారు. స్పిన్ తో కుల్దీప్ పాక్ బ్యాట్స్ మెన్ ను కట్టి పడేశాడు. అప్పటికే అయిదు వికెట్లు కోల్పోయి 165 పరుగులే చేసి  పీకల లోతు కష్టాల్లో ఉన్న పాకిస్థాన్ ను వర్షం కూడా దెబ్బతీసింది. 40 ఓవర్లలో 302 పరుగుల విజయలక్ష్యాన్ని నిర్దేశించడంతో పాక్ చివరకు 6 వికెట్ల నష్టానికి 212 పరుగులు చేసి ఓటమి పాలయింది. బౌలింగ్ ఛేంజ్ లో బంతిని అందుకున్న ఆల్ రౌండర్ మీడియం పేసర్ విజయ్ శంకర్ తొలివికెట్ గా ఓపెనర్ ఇమామ్ ఉల్ హక్ ను ఎల్బీడబ్ల్యూ చేసి పెవిలియన్ కు పంపాడు. వన్ డౌన్ బ్యాట్స్ మన్ బాబార్(48) ను కుల్దీప్ యాదవ్ బౌల్డ్ చేశాడు. ఇన్నింగ్స్ లో కుదురుకున్న ఫకర్ జమాన్(62) కూడా కుల్దీప్ బౌలింగ్ లో చాహర్ క్యాచ్ పట్టడంతో వెనుదిరిగాడు. మహ్మద్ హఫీజ్, షోయబ్ మాలిక్ వికెట్లను హార్ధిక్ పాండ్యా తీసుకున్నాడు. ఆ తర్వాత విజయ్ శంకర్ పాక్ కెప్టెన్ సర్ఫరాజ్ అహ్మద్ ను ఔట్ చేసి తన ఖాతాలో రెండు వికెట్లు వేసుకున్నాడు. 35 ఓవర్ల గడిచిన ఇన్నింగ్స్ లో ఏ మాత్రం విజయావకాశాలు లేని దశలో వర్షం పడ్డంతో మ్యాచ్ నిలిచిపోయింది. కాసేపటికి మళ్లీ ప్రారంభమైనా పాక్ గెలిచే పరిస్థితి ఏమాత్రం కనిపించలేదు. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ జట్టులో రోహిత్ (140), కోహ్లి(77), రాహుల్ (57) భారీ స్కోరుపై కన్నేసి పరుగులు రాబట్టారు. ముఖ్యంగా రాహుల్, రోహిత్ జోడి బ్యాట్ కు అందివచ్చిన బంతిని బౌండరీకి తరలిస్తూ లైన్ అండ్ లెంగ్త్ బంతులకు సింగిల్, డబుల్ రన్స్ తీస్తూ తొలి వికెట్ కు 23.5 ఓవర్లలో 136 పరుగులు జోడించారు. పరుగులు తీసే క్రమంలో రాహుల్ తొందరపాటు వల్ల రోహిత్ రనౌటయ్యే ప్రమాదంలో పడ్డాడు. ఫీల్డింగ్ లోపం కూడా పాక్ జట్టులో కొట్టొచ్చినట్లు కనిపించింది. కోహ్లి బౌన్సర్ ను ఆడే ప్రయత్నంలో బంతి బ్యాట్ కు తగిలిందనకుని ఔటవ్వకుండానే పెవిలియన్ చేరి పొరపాటు చేశాడు. అంతకుముందే వర్షం వల్ల మ్యాచ్ 46.2 ఓవర్ల వద్ద నిలిచిపోయింది. ఆ తర్వాత కోహ్లి అనుకోకుండా పెవిలియన్ చేరడంతో చివర్లో 14 బంతుల్ని విజయ్ శంకర్, కేదార్ జాదవ్ ఎదుర్కొన్నారు. పాక్ బౌలర్లలో పొదుపుగా పరుగులిచ్చిన మహ్మద్ అమీర్ మరోసారి మూడు వికెట్లు పడగొట్టగా హసన్ అలీ, వహాబ్ రియాజ్ లకు చెరో వికెట్ దక్కింది. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్  మరోసారి రోహిత్ శర్మ ను వరించింది. 

Sunday, June 16, 2019

Avon march in prague most of the women dressed in pink


ప్రేగ్ లో ఘనంగా ఎవాన్ మార్చ్
చెక్ రిపబ్లిక్ రాజధాని ప్రేగ్ లో ఎవాన్ మార్చ్ 19వ వార్షికోత్సవం ఘనంగా నిర్వహించారు. బ్రెస్ట్ కేన్సర్ బాధితులు వారి తల్లిదండ్రులకు సంఘీభావంగా ఏటా ఎవాన్ మార్చ్ నిర్వహిస్తున్నారు. ఈ మార్చ్ లో వేల సంఖ్యలో మహిళలు గులాబీ రంగు దుస్తుల్లో పాల్గొనడం రివాజు. జున్ 15 శనివారం ప్రేగ్లోని ఓల్డ్ టౌన్ స్కేర్ లో మార్చ్ కు పెద్ద సంఖ్యలో హాజరైన యువతులు అనంతరం వైభవంగా జరిగిన సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ‘మన మనసుల్లో ఏముందో ముఖ్యం కాదు మనం అందరి హృదయాలకు ఏమి చేరుస్తున్నామన్నదే ప్రధానం’  అనే నినాదంతో ఈ ఏడాది ఎవాన్ మార్చ్ నిర్వహించారు. ద ఎవాన్ హెల్త్ బ్రెస్ట్ ప్రాజెక్టు సంస్థ పింక్ రిబ్బన్ లతో కూడిన ఉత్పత్తుల్ని, ఎవాన్ మార్చ్ టి-షర్టుల్ని ఈ సందర్భంగా విక్రయించింది. బ్రెస్ట్ కేన్సర్ తో బాధపడుతున్న వారికి సహాయంగా నిర్వహించే స్వచ్ఛంద కార్యక్రమాలకు ఈ సొమ్మును ఆ సంస్థ అందజేస్తుంది. ఏటా చెక్ రిపబ్లిక్ లో 7వేల మంది బ్రెస్ట్ కేన్సర్ బారిన పడుతున్నారు. ఇందులో 1900 మంది మరణిస్తున్నట్లు ఇన్ స్టిట్యూట్ ఆఫ్ బయో స్టాటస్టిక్స్ అండ్ అనలైజెస్ ఆఫ్ ది ఫ్యాకల్టీ ఆఫ్ మెడిసన్ ఆఫ్ ది మసారిక్ యూనివర్సిటీ, చెక్ అసోసియేషన్ ఆఫ్ మేమోడయాగ్నొస్టిక్స్ నివేదికల ద్వారా తెలుస్తోంది. కణతిని కేన్సర్ తొలిదశలోనే గుర్తిస్తే 90 శాతం వ్యాధిని నివారించే అవకాశముంటుంది. మేమోగ్రఫీ విధానంలో చేసిన బ్రెస్ట్ కేన్సర్ పరీక్షల ద్వారా అత్యంత సమర్ధంగా కచ్చితమైన నివేదికను పొందొచ్చు.