ట్రంప్ తో ఫోన్ లో సంభాషించిన జపాన్ ప్రధాని
ఇరాన్ పర్యటనకు వెళ్లనున్న జపాన్
ప్రధాని షింబో అబె అమెరికా అధ్యక్షుడి డోనాల్డ్ ట్రంప్ తో టెలిఫోన్ లో సంభాషించారు. షింబో బుధవారం ఇరాన్ పర్యటనకు వెళ్తున్నారు. మంగళవారం ఈ విషయమై 20
నిమిషాల పాటు ట్రంప్ తో ముచ్చటించారని అబె కేబినెట్ చీఫ్ సెక్రటరీ (మంత్రి)
యోషిహిడె సుగా విలేకర్లకు తెలిపారు. అమెరికా, జపాన్ దేశాలలో పరిస్థితులు, ప్రాంతీయ
అంశాలు, ముఖ్యంగా ఇరాన్ ప్రస్తుత వ్యవహారాలు ఉభయ దేశాల నేతల మధ్య చర్చకు
వచ్చాయన్నారు. 1978 తర్వాత జపాన్ ప్రధాని ఇరాన్ లో పర్యటించనుండడం ఇదే తొలిసారి. నాటి
జపాన్ ప్రధాని టకియో ఫుకుడా ఇరాన్ లో పర్యటించారు. నాలుగు దశాబ్దాలుగా ఇస్లామిక్ వాదం
ప్రపంచ పటంపై ప్రముఖంగా చోటు చేసుకుంటున్న నేపథ్యంలో ప్రధాని అబె పర్యటన
ప్రాధాన్యాన్ని సంతరించుకుంటోంది. అదీ గాక టెహరాన్(ఇరాన్) అణు కార్యక్రమాలు
నిర్వహిస్తున్న దరిమిలా అమెరికాతో ఆ దేశ ద్వైపాక్షిక సంబంధాలకు పూర్తిగా విఘాతం
కల్గింది. అమెరికా ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు పెరిగిపోయాయి. ఈ దశలో జపాన్ ప్రధాని అబె
ఇరాన్ లో పర్యటించాల్సి రావడంతో ముందుగానే అమెరికా అధ్యక్షుడితో సంభాషించి
ముందడుగు వేస్తున్నారు. ఇరాన్ పర్యటనలో భాగంగా జపాన్ ప్రధాని అబె ఆ దేశ సుప్రీం
లీడర్ అయాతుల్లా అలీ ఖొమైనీ, అధ్యక్షుడు హసన్ రౌహనిలను విడివిడిగా కలుసుకుని
సంప్రదింపులు జరుపనున్నారు.