Tuesday, June 11, 2019

dawan ruled out of icc world cup may rahul open the innings with rohit sarma



వరల్డ్ కప్ టీమిండియా ఓపెనర్ గా రాహుల్!
ప్రస్తుత వరల్డ్ కప్ లో భారత స్టార్ ఓపెనర్ శిఖర్ ధావన్ స్థానాన్ని కె.ఎల్.రాహుల్ భర్తీ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. నిలకడగా బ్యాటింగ్ చేస్తూ పరిస్థితులకు అనుగుణంగా బ్యాట్ ఝళిపించి స్కోరు బోర్డును పరిగెత్తించగల సత్తా అతనికి ఉంది. వరల్డ్ కప్ లో వరుసగా రెండో విజయంతో ఊపుమీదున్న భారత్ కు ధావన్ దూరం కావడం పెద్ద లోటే. ఆదివారం ఆస్ట్రేలియాతో మ్యాచ్ లో ఇన్నింగ్స్ 9 ఓవర్ లో బౌలర్ కమిన్స్ విసిరిన బౌన్సర్ కు ధావన్ గాయపడ్డాడు. ధావన్ గ్లోవ్ ను బలంగా తాకిన బంతి భుజాన్ని రాసుకుంటూ హెల్మట్ గ్రిల్ పైకి దూసుకు వచ్చింది. ప్రాథమిక చికిత్స అనంతరం ధావన్ యథావిధిగా ఇన్నింగ్స్ కొనసాగించి 109 బంతుల్లో 117 పరుగులు చేసి భారత్ ఘన విజయానికి బాటలు వేశాడు. 2015 వరల్డ్ కప్ లోనూ ధావన్ జట్టులో అత్యధికంగా 412 పరుగులతో(రెండు సెంచరీలు) టాప్ స్కోరర్ గా నిలిచాడు. ఆ ఏడాదే వన్డేల్లో అత్యంత వేగంగా 3 వేల పరుగుల మైలురాయిని చేరుకున్న రెండో భారత బ్యాట్స్ మన్ గా రికార్డుల కెక్కాడు. ప్రస్తుత వరల్డ్ కప్ లోనూ ఓపెనర్ గా ధావన్ నుంచి జట్టు అత్యధిక పరుగుల్ని ఆశించింది. బొటనవేలు గాయానికి మూడు వారాల విశ్రాంతి అవసరం కావడంతో ధావన్ వరల్డ్ కప్ కు దూరమయ్యాడు. ఈ నేపథ్యంలో అందరి దృష్టి నం.4 బ్యాట్స్ మన్ రాహుల్ పై పడింది. ఓపెనర్ గా రాణించే అవకాశాలు రాహుల్ కే ఎక్కువగా ఉన్నాయి. గతంలో పలు అంతర్జాతీయ మ్యాచ్ ల్లో వివిధ ఫార్మట్ లలో ఇన్నింగ్స్ ప్రారంభించిన అనుభవం ఉంది. టి-20 లో రెండు సెంచరీలు, వన్డేలో ఓ సెంచరీ చేశాడు. 2019 ఐపీఎల్ లో కింగ్స్ లెవన్ పంజాబ్ జట్టు ఓపెనర్ గా పలు మ్యాచ్ ల్లో రాణించాడు. ముఖ్యంగా ముంబయి ఇండియన్స్ పై మ్యాచ్ లో ఓపెనర్ గా ఇన్నింగ్స్ ప్రారంభించి సెంచరీతో నాటౌట్ గా నిలిచాడు. అనుభవజ్ఞుడే ఇన్నింగ్స్ ప్రారంభించాలని టీం మేనేజ్ మెంట్ భావించి తప్పనిసరైతే  కెప్టెన్ విరాట్ కోహ్లి కూడా ఓపెనర్ గా రోహిత్ తో జత కలవొచ్చు. భారతజట్టు లో కెప్టెన్ ఓపెనర్ గా క్రీజ్ లో రాణించిన వారు గతంలో పలువురున్నారు. సునీల్ గవాస్కర్, సచిన్ టెండుల్కర్, సౌరవ్ గంగూలీ మాదిరిగా కోహ్లి ఆ బాధ్యతలు తలకెత్తుకుంటాడా లేదా రాహుల్ నే ఓపెనర్ గా పంపుతాడో తదుపరి 13వ తేదీ న్యూజిలాండ్ మ్యాచ్ నాటికే తేలనుంది.


No comments:

Post a Comment