ఫొని తుపాన్ ను ఎదుర్కొనేందుకు
ఏపీ సర్వసన్నద్ధం
మచిలీపట్నానికి
ఆగ్నేయంగా 310 కి.మీ. దూరంలో కేంద్రీకృతమైన ఫోని తుపాన్ మరికొన్ని గంటల్లో
విరుచుకుపడ్డానికి సిద్ధంగా ఉంది. దాంతో విపత్తును ఎదుర్కొనేందుకు ఆంధ్రప్రదేశ్
ప్రభుత్వం ముమ్మర ఏర్పాట్లలో నిమగ్నమయింది. తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్
కార్తికేయ మిశ్రా బుధవారం 18 కోస్తా మండలాల్లో హై అలర్ట్ ప్రకటించారు. ముందస్తు
జాగ్రత్తల్లో భాగంగా లోతట్టు ప్రాంతాల్లోని ప్రజల్ని ఖాళీ చేయించి సురక్షిత
ప్రాంతాలకు తరలించారు. ఆయన విలేకర్లకు వివరాల్ని తెలిపారు. తుపాను నెమ్మదిగా
వాయువ్య దిశ వైపు కదులుతోందని దీని ప్రభావంతో ప్రచండమైన గాలులతో పాటు విస్తారంగా
వర్షాలు కురుస్తాయని చెప్పారు. ముఖ్యంగా తుని, తొండంగి మండలాలపై ప్రభావం అధికంగా
ఉంటుందని భావిస్తున్నామన్నారు. ఎటువంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు అధికార
యంత్రాంగం అప్రమత్తంగా ఉందంటూ ప్రత్యేక రక్షణ బృందాల్ని అమలాపురం, కాకినాడల్లో మోహరించామని
తెలిపారు. రోడ్ల నిర్వహణ బృందాలు, వైద్య సిబ్బంది సిద్ధంగా ఉన్నారన్నారు. ముప్పు
పొంచి ఉన్న అన్ని మండలాల్లో తాగునీరు, పారిశుద్ధ్య నిర్వహణకు సిబ్బందిని సిద్ధం
చేసినట్లు కలెక్టర్ వివరించారు. ఇటీవల పోలింగ్ పూర్తైనందున ఈవీఎంల భద్రత గురించి
కూడా ఆయన వివరిస్తూ వాటిని అత్యంత సురక్షితంగా ఉంచినట్లు తెలిపారు. ఈవీఎంలు
భద్రపరిచిన గదుల కిటికీలను మూడేసి వరుసల పాలిథిన్ కవర్లతో కప్పి ఉంచామన్నారు.