శభాష్ సోనూసూద్:నవనీత్ కౌర్
నాటి తెలుగు హీరోయిన్ ప్రస్తుత లోక్ సభ ఎంపీ నవనీత్ కౌర్ రియల్ హీరో సోనూసూద్ సేవల్ని ప్రశంసలతో ముంచెత్తారు. కరోనా నేపథ్యంలో ఆయన బాధితులకు అందించిన చేయూత తమబోటి రాజకీయ నాయకులందరికీ స్ఫూర్తిదాయకమని చెప్పారు. మహారాష్ట్రలోని అమరావతి (ఎస్సీ) లోక్‌సభ నియోజకవర్గం నుంచి గెలిచి ఎంపీ అయిన నవనీత్ కౌర్ కులధ్రువీకరణ పత్రం వివాదంలో ఇరుక్కున్నారు. తాజాగా ఆమె ఎంపీ పదవికి గండం వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఆమె ఓ టీవీ నిర్వహించిన చర్చా కార్యక్రమంలో పాల్గొన్నారు. తనకు తెలుగు భాష అంటే ఎంతో అభిమానం. తెలుగు ఇండస్ట్రీ లైఫ్ ఇచ్చిందన్నారు. కోవిడ్ సమయంలో చాలా మంది విద్యార్థులకు హెల్ప్ చేశాను. పార్టీలకతీతంగా పార్లమెంట్లో గళం వినిపిస్తున్నా అని చెప్పారు. 2004 నుంచి 2014 వరకు పలు దక్షిణాది చిత్రాల్లో నవీనత్ తళుక్కున మెరిశారు. తెలుగులో బాలకృష్ణ, జగపతి బాబు వంటి స్టార్లతో పాటు అల్లరినరేశ్, వడ్డే నవీన్ తదితర హీరోలతో పదుల సంఖ్యలో సినిమాలు చేశారు. అదేవిధంగా తమిళ, కన్నడ చిత్రాల్లోనూ హీరోయిన్ గా రాణించారు. రాజకీయాల్లోకి వచ్చాక పూర్తిగా ప్రజాసేవలోనే నిమగ్నమయినట్లు తెలిపారు. తన భర్త ఎమ్మెల్యే కావడంతో రాజకీయాలపై మరింత ఆసక్తి పెరిగిందన్నారు. అదేవిధంగా మా కుటుంబమంతా రాజకీయాల్లోనే ఉంది.. ప్రజల సహకారం వల్లే రాజకీయాల్లో కొనసాగుతున్నా అని నవనీత్ గర్వంగా చెప్పారు. అమరావతిలో ఇండిపెండెంట్‌గా గెలవాలంటే అంత సులువు కాదు.. ప్రజాభిమానమే తనను గెలిపించిందన్నారు. గోవిందా, సునీల్‌శెట్టి తన తరఫున ఎన్నికల్లో ప్రచారం చేశారని వారికి తన కృతజ్ఞతలు తెలిపారు.