15 వరకే భారత్-ఆస్ట్రేలియా ప్రయాణ నిషేధం
భారత్ నుంచి స్వదేశానికి తిరిగి వచ్చే ఆస్ట్రేలియన్ల ప్రయాణ నిషేధాన్ని ఈనెల 15 దాటి పొడిగించబోమని ఆదేశ ప్రధాని స్కాట్ మోరిసన్ తెలిపారు. శుక్రవారం జాతీయ భద్రతా కమిటీ భేటీ తర్వాత మోరిసన్ ఈ మేరకు ప్రకటించారు. మే15 తర్వాత నిషేధాన్ని పొడిగించాల్సిన అవసరం లేదన్నారు. ఆ తేదీ వరకు మాత్రం బయోసెక్యూరిటీ ఆర్డర్‌ను కచ్చితంగా అమలు చేయాల్సి ఉందన్నారు. ఆస్ట్రేలియన్లను స్వదేశానికి తిరిగి రప్పించే విమానాలు త్వరలో ప్రారంభమవుతాయని ప్రధాని చెప్పారు. ఆస్ట్రేలియా ప్రభుత్వం చరిత్రలో తొలిసారిగా తమ పౌరులు స్వదేశానికి తిరిగి రాకుండా తాత్కాలిక నిషేధాన్ని విధించింది. భారత్ లో కరోనా సెకండ్ వేవ్ విజృంభించిన నేపథ్యంలో ఈ నిషేధం అనివార్యమయింది. ఆసిస్ తిరిగి రావడానికి 14 రోజుల ముందు వరకు భారతదేశంలో గడిపినట్లయితే ఐదేళ్ల జైలు శిక్ష లేదా 66,000 ఆస్ట్రేలియన్ డాలర్లు (రూ.37,89,112) జరిమానా విధిస్తామని మోరిసన్ ప్రభుత్వం హెచ్చరించిన సంగతి తెలిసిందే. దీనిపై ప్రభుత్వ ఉత్తర్వులు ఈ15వ తేదీతో ముగియనున్నాయి.