కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల డీఏ పెంపు
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు మోదీ ప్రభుత్వం తీపి కబురు అందించింది. 2021 కొత్త సంవత్సరంలో ఏడో వేతన చెల్లింపుల సంఘం వారికి ఈ శుభవార్త చెప్పింది. జనవరి నుంచి వారి జీతాల్లో ఈ మేరకు పెంపు ఉండనుంది. జనవరి నుంచి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు కరవు భత్యం (డియర్ నెస్ అలవెన్సు-డీఏ) 4 శాతం అదనంగా పొందనున్నట్లు సమాచారం. అదేవిధంగా పెండింగ్ భత్యాలను వారికి సత్వరం పెంచి అందించేలా ప్రతిపాదించినట్లు తెలిసింది. 2020 మార్చిలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన కేంద్ర కేబినెట్ ఈ అంశంపై చర్చించింది. జనవరి 2020 నుంచి అదనపు డీఏతోపాటూ, పెన్షనర్లకు ఉపశమన భత్యం (డియర్ నెస్ రిలీఫ్-డీఆర్) ఇచ్చేందుకు అదనపు నిధులను విడుదల చేసే ప్రతిపాదనను ఆమోదించింది. తాజా రిపోర్టుల ప్రకారం ఇప్పుడు బేసిక్ పే/పెన్షన్ కి ఇస్తున్న 17 శాతానికి అదనంగా మరో 4 శాతం కలపబోతున్నట్లు సమాచారం. ఈ పెంపు ద్వారా దేశవ్యాప్తంగా 48.34 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, 65.26 లక్షల మంది పెన్షనర్లకు మేలు చేకూరనుంది.