Tuesday, December 15, 2020

Eluru mystery disease: Traces of organochlorine, organophosphorus found in blood samples

వీడిన ఏలూరు వింత వ్యాధి మిస్టరీ

ఎట్టకేలకు ఏలూరు వింత వ్యాధి గుట్టును కేంద్ర వైద్య బృందాలు రట్టు చేశాయి. కూరగాయల్లో మోతాదు మించిన పురుగుల మందులు వాడకం, అదే విధంగా కల్తీ బియ్యం కూడా కారణమని ప్రాథమికంగా అంచనాకు వచ్చారు.  వింత వ్యాధి బారిన పడిన బాధితుల రక్తంలో సీసం, నికెల్ ఉన్నట్లుగా ఢిల్లీ ఎయిమ్స్ తెలిపింది. మరికొన్ని సంస్థలు మాత్రం బాధితులు తీసుకున్న ఆహారంలో పురుగుల మందు వంటి రసాయన అవశేషాలు ఉన్నట్లుగా ప్రాథమిక పరిశోధన ఫలితాల్లో వెల్లడించాయి. మూర్చ, నోట్లో నురగ, తలనొప్పి, వికారం, వాంతులు, మతిమరపు, వెన్నునొప్పి, ఆందోళన వంటి లక్షణాలతో వందల మంది గత వారంలో ఆసుపత్రుల పాలయ్యారు. ఈ వ్యాధి వల్ల ఇప్పటికే 622 మంది ఆస్పత్రుల్లో చికిత్సలు పొందారు. అందులో ఒకరు మృత్యుపాలయిన సంగతి తెలిసిందే. బాధితుల్లో 90శాతం మంది డిశ్చార్జి అయ్యారు. అయితే గాలి, నీరు ద్వారా వింత వ్యాధి ప్రబలలేదని స్పష్టమయింది. అలాగే పాలు, మాంసాహారం కారణం కాదని సమాచారం. కార్తీక మాసం కావడంతో చికెన్, మటన్ విక్రయాలు కూడా తగ్గాయి. అదీ గాక బాధితుల్లో 83 శాతం మంది  వ్యాధికి గురైన సమయంలో కేవలం శాకాహారం భోజనమే చేసినట్లు చెప్పారు. తాజా నివేదిక ప్రకారం కూరగాయల్లో పురుగుల మందుల అవశేషాలు కనిపించాయి. బియ్యంలో పాస్పరస్ ఆనవాళ్లు లభించినట్లు తెలుస్తోంది.

Monday, December 14, 2020

Thousands of iPhones looted, violence cost us Rs 440 crore in Wistron Bengaluru


 కోలారు ఐఫోన్ ప్లాంట్ విధ్వంసంలో నష్టం రూ.440 కోట్లు

 వేతనాలు చెల్లించాలంటూ కాంట్రాక్టు కార్మికులు సాగించిన విధ్వంసంలో రూ.440కోట్లు ఆస్తి నష్టం జరిగినట్లు విస్ట్రాన్ కంపెనీ యాజమాన్యం వెల్లడించింది. పెద్ద ఎత్తున ఆందోళనకు దిగిన ఐఫోన్ ప్లాంట్ సిబ్బంది తమ జీతాల సమస్యను పట్టించుకోవడం లేదంటూ శనివారం ఉదయం విధ్వంసానికి పాల్పడిన సంగతి తెలిసిందే. బెంగళూరుకు సమీపంలోని కోలార్ జిల్లాలో గల నర్సాపురలోని ఈ ప్లాంట్‌లో యాపిల్ ఐఫోన్ విడి భాగాలను అమరుస్తుంటారు. ఈ విస్ట్రాన్ ప్లాంట్‌లో మొత్తం ఆరు కాంట్రాక్ట్ సంస్థల నుంచి 8,900 మందిని నియమించుకున్నారు. ప్లాంట్ లో మరో  1,200 మంది శాశ్వత ఉద్యోగులు విధులు నిర్వర్తిస్తున్నారు. అయితే కాంట్రాక్టు సిబ్బంది తమ జీతాలు చెల్లించలేదనే ఆగ్రహంతో ఈ దాడికి పాల్పడ్డారు. దాంతో వందలకోట్ల ఆస్తి నష్టం సంభవించింది. వేల సంఖ్యలో ఐఫోన్‌లు లూటీ అయ్యాయి. నష్టాన్ని ఇంకా పూర్తిగా అంచనా వేయాల్సి ఉందని పోలీస్ స్టేషన్‌లో సమర్పించిన ఫిర్యాదులో యాజమాన్యం వెల్లడించింది. దాదాపు 5,000 మంది ఈ దాడిలో పాల్గొన్నట్లు భావిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసు దర్యాప్తు కొనసాగుతోంది. దాడితో సంబంధం ఉన్నట్లుగా అనుమానిస్తున్న 132 మందిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. విస్ట్రాన్ ప్లాంట్‌ దాడి ఘటనపై ఎస్పీ కార్తీక్ రెడ్డి మాట్లాడుతూ ఆందోళనకారులు ప్లాంట్ అద్దాలు పగలగొట్టి వాహనాలు ధ్వంసం చేశారన్నారు. కంప్యూటర్లు, ప్రింటర్లు, ల్యాప్‌టాప్స్, ఫ్లోర్,సీలింగ్స్, ఏసీ తయారీ పూర్తయిన స్మార్ట్‌ఫోన్లు ఇలా దేన్ని వదలకుండా విధ్వంసం సృష్టించినట్లు వివరించారు. భారత్‌లో ఏర్పాటైన తొలి ఐఫోన్ యూనిట్ విస్ట్రాన్‌పై దాడిని కర్ణాటక ప్రభుత్వం తీవ్రంగా ఖండించింది. అదేవిధంగా ఉద్యోగులకు వేతనాలు చెల్లించడంలో ఆ సంస్థ జాప్యం చేయడాన్ని పరిశీలిస్తున్నట్లు డిప్యూటీ సీఎం అశ్వత్ నారాయణ్ తెలిపారు. మూడ్రోజుల్లో సిబ్బందికి వేతనాలు చెల్లించాలని ఇప్పటికే కార్మిక శాఖ ఉత్తర్వులు జారీ చేసిందన్నారు.

Sunday, December 13, 2020

390 kgs Ganjaa seize in Rajahmundry

రాజమండ్రిలో భారీగా గంజాయి పట్టివేత

ఆంధ్రప్రదేశ్ లో మళ్లీ గంజాయి కలకలం రేగుతోంది. ఉత్తరాంధ్ర ముఖ్యంగా విశాఖపట్నం ఏజెన్సీ కేంద్రంగా భారీగా గంజాయి సాగవుతోందని ఇటీవల తరచు వార్తలు వెలువడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆదివారం తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి నగరంలో పెద్దఎత్తున గంజాయిని స్థానిక పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నగరంలోని గామన్‌ బ్రిడ్జి వద్ద పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో లారీలో తరలిస్తున్న 390 కేజీల గంజాయిని పట్టుకున్నారు. ఈ గంజాయిని నర్సీపట్నం నుంచి తమిళనాడుకు తరలిస్తున్నట్లు గుర్తించారు. గంజాయిని స్వాధీనం చేసుకుని నిందితులను అరెస్టు చేశారు. ఈ ముఠా వెనుక ఎవరు ఉన్నారనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Saturday, December 12, 2020

Pawan Kalyan visits Dokiparru Venkateswara Swamy temple



డోకిపర్రు వెంకన్న సన్నిధిలో పవర్ స్టార్

https://www.youtube.com/watch?v=3jKNB2qvDe4

జనసేన అధ్యక్షుడు, ప్రముఖ సినీ నటుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కృష్ణా జిల్లాలోని డోకిపర్రు గ్రామంలో కొలువైన శ్రీ భూ సమేత వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. ఆలయంలో శనివారం నిర్వహించిన పూజా కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్‌ను చూసేందుకు అభిమానులు పోటెత్తారు. వారిని ఉద్దేశించి పవర్ స్టార్ మాట్లాడుతూ బ్రహ్మోత్సవాల సమయంలో ఈ ఆలయాన్నిదర్శించుకోవడం చాలా ఆనందంగా ఉందన్నారు. రెండుమూడేళ్లుగా ఇక్కడకు రావాలనుకున్నా ఆ అదృష్టం ఇప్పుడు కల్గిందన్నారు. జిల్లాలో గల ప్రసిద్ధ ఆలయాల్లో ఇక్కడ శ్రీవారి ఆలయం కూడా ఒకటని పేర్కొన్నారు. ప్రస్తుత కల్యాణోత్సవంలో పాలుపంచుకోవడం పట్ల ఆనందం వ్యక్తం చేశారు. తిరుమల తరహాలో ఈ ఆలయ వేద పండితులు పూజాది కార్యక్రమాల్ని నిర్వహిస్తున్నారని ప్రశంసించారు. ఈ ఆలయ వైభవానికి అహర్నిశలు శ్రమిస్తున్న కృష్ణారెడ్డి  తదితరులకు పవన్ కల్యాణ్ అభినందనలు తెలిపారు.