Wednesday, October 14, 2020

Legendary Kuchipudi Dancer Shobha Naidu Passed away

నాట్య మయూరి శోభానాయుడు ఇకలేరు

ప్రముఖ కూచిపూడి నాట్య కళాకారిణి శోభా నాయుడు (64) కన్నుమూశారు. హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో బుధవారం తెల్లవారుజామున ఆమె తుది శ్వాస విడిచారు. సెప్టెంబర్‌ నుంచి  శోభా నాయుడు చికిత్స పొందుతూ ఉన్నారు. ఇంట్లో జారిపడడంతో తలకు తీవ్ర గాయమైంది. అప్పట్నుంచి ఆమె ఆరోగ్యం అంతంతమాత్రంగానే ఉంది. ఆర్థో న్యూరాలజీ సమస్యలతో బాధపడుతున్నారు. అదే క్రమంలో శోభానాయుడుకు కరోనా కూడా సోకింది. దాంతో ఆరోగ్యం మరింత క్షీణించింది. కరోనా పాజిటివ్ అని తేలిన దగ్గర నుంచి ఆమె ఆస్పత్రికే పరిమితమయ్యారు. 1956లో విశాఖపట్నం జిల్లా అనకాపల్లిలో జన్మించిన శోభానాయుడు కూచిపూడి నృత్యంతో జగద్విఖ్యాతి సాధించారు. క్వీన్స్ మేరీ కాలేజీలో డిగ్రీ పూర్తి చేశారు. 12 ఏళ్లకే కూచిపూడిలో ఆరంగేట్రం చేశారు. వెంపటి చినసత్యం వద్ద శిష్యురాలిగా చేరారు. అప్పట్నుంచి ఇప్పటి వరకు ఆమె ఎన్నో వేల ప్రదర్శనలు ఇచ్చారు. వెంపటి నృత్య రూపాలలోని పలు పాత్రలను పోషించారు. సత్యభామ, పద్మావతి, చండాలిక పాత్రల్లో రాణించి మెప్పించిన శోభా నాయుడును కేంద్రం 2001లో పద్మశ్రీ పురస్కారంతో సత్కరించింది. 40 ఏళ్లగా కూచిపూడి శిక్షణ తరగతులు నిర్వహిస్తున్న శోభా నాయుడుకి ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది శిష్యులున్నారు.

Thursday, October 8, 2020

`Jagananna Vidya Kanuka` launches in Andhra Pradesh by CM YSJagan Mohan Reddy

గుర్తుకొస్తున్నాయి..!

బాల్యం ఎవరికైనా తిరిగి రాని తీపి గుర్తు. మన సీఎం జగన్ అందుకు అతీతులు కాదు. ఇదిగో అందుకు ఇదే సాక్ష్యం.. స్కూలు బ్యాగ్ తగిలించుకుని జగన్ పిల్లాడిలా ఇలా మురిసిపోయారు. ఒక్క క్షణం ఆనందడోలికల్లో తేలియాడారు. `విద్యాకానుక` పథకాన్ని గురువారం మంత్రులు, అధికారులు సమక్షంలో ప్రారంభించిన సందర్భంగా జగన్ ఇలా స్కూలు బ్యాగును భుజాన వేసుకుని ఫొటోలకు పోజిచ్చారు. సీఎం ఆల్బమ్ లోఈరోజు ఫొటో మరో చిత్రరాజమే. గతేడాది డిసెంబర్ 7`కంటి వెలుగు` పథకాన్ని ప్రారంభించిన సందర్భంగానూ జగన్ ఇదే తరహాలో అపురూపమైన ఫొటోతో అలరించారు. నాటి కార్యక్రమంలో పిల్లలకు అందజేసిన కళ్లజోడును ధరించిన సీఎం చిరునవ్వులు చిందిస్తూ ఫొటోలు దిగారు.

Tuesday, October 6, 2020

US president Donald Trump leaves hospital to fly back to White House

వైట్ హౌస్ కి తిరిగొచ్చేసిన ట్రంప్

కరోనా బారిన పడి నాలుగురోజులుగా వాల్టర్ రీడ్ మెడికల్ సెంటర్‌ (సైనిక ఆసుపత్రి)లో చికిత్స పొందుతున్న అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ సోమవారం శ్వేత సౌధానికి తిరిగి వచ్చేశారు. ఆయన భార్య దేశ ప్రథమ పౌరురాలు మెలానియా వైట్ హౌస్ లోనే కరోనా చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. ట్రంప్‌నకు కోవిడ్-19 నిర్ధారణ కావడంతో అత్యవసరంగా ఆయనను వాల్టర్ రీడ్ కు తరలించి చికిత్స అందించారు. తొలుత ట్రంప్ పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు వార్తలు వెలువడ్డాయి. అయితే ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగానే ఆయనను సైనిక ఆసుపత్రికి తరలించి అన్ని రకాల వైద్య పరీక్షలు నిర్వహించారు. ప్రస్తుతం ట్రంప్ ఆరోగ్య పరిస్థితి సాధారణ స్థాయికి వచ్చింది. గడిచిన 72 గంటలుగా ఆయనకు జ్వరం లేకపోవడం, రక్తంలో ఆక్సిజన్ స్థాయులు సాధారణంగా ఉండడంతో డాక్టర్లు ఆయనను వైట్ హౌస్ కు తిరిగి పంపడానికి అంగీకరించినట్లు సమాచారం. అయితే ట్రంప్ ఊపిరితిత్తులపై వైరస్ ప్రభావం ఏమేరకు ఉంది? తాజా నిర్ధారణ పరీక్షల్లో అధ్యక్షుడికి నెగెటివ్ వచ్చిందా? లేదా? అనే అంశాలు ఇంకా  వెల్లడికాలేదు. ట్రంప్‌నకు ఆస్పత్రిలో మాత్రం రెండుసార్లు అత్యవసరంగా ఆక్సిజన్ అందజేసినట్లు తెలుస్తోంది. వాల్టర్ రీడ్ ఆస్పత్రి నుంచి సర్జికల్ మాస్క్ ధరించిన ట్రంప్ విజయ సంకేతం చూపుతూ బయటకు వస్తున్న వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. ఈ సందర్భంగా  మీడియా ప్రతినిధులు ప్రశ్నల నుంచి ట్రంప్ తెలివిగా తప్పించుకుని ముందుకు వెళ్లిపోయారు. అనంతరం ఆయన ట్విట్టర్‌లో తన ఆరోగ్య పరిస్థితి గురించి తెలిపారు. 20 ఏళ్ల క్రితం కంటే తను ప్రస్తుతం చాలా బాగున్నానంటూ ట్రంప్ పోస్టు చేశారు. నిజంగా నా ఆరోగ్యం చాలా బాగుంది అని వ్యాఖ్యానించారు. కోవిడ్-19కు భయపడవద్దు.. మీ జీవితంపై ఆధిపత్యం చలాయించే అవకాశం ఇవ్వొద్దు.. మనం మంచి ఔషధాలు అభివృద్ధి, విజ్ఞానం సాధించాం..` అని ఆయన ట్వీట్ లో పేర్కొన్నారు. అయితే ట్రంప్ ఇంకా పూర్తిగా కోలుకుని ఉండకపోవచ్చు అని వైట్ హౌస్ వైద్యుడు డాక్టర్ సీన్ పి. కాన్లే తెలిపారు.

Thursday, October 1, 2020

Amitabh Bachchan Couldn't Afford 2 Rupees To Join His School Cricket Team, Shares Childhood Story


 రూ.2 లేక క్రికెట్ కోరిక తీరలేదు:అమితాబ్ 

చిన్నతనం మధురస్మృతులు.. చిట్టిపొట్టి బాధలు మనిషన్నాకా ఎన్నోకొన్ని ఉంటూనే ఉంటాయి. బిగ్ బి బాలీవుడ్ బాద్ షా అమితాబూ అలాంటివి చిన్నతనంలో అనుభవించారట. తన ప్రఖ్యాత `కౌన్ బనేగా కరోడ్ పతి` సీజన్-12 షోలో స్వయంగా బిగ్ బీనే ఆ  జ్ఞాపకాల్ని నెమరవేసుకున్నారు. షోలో పాల్గొన్న కంటెస్టెంట్ తన బాల్యంలో బేల్ పూరి తినాలని ఉన్నా డబ్బు లేక నాడు ఆ కోరిక తీర్చుకోలేకపోయాననే బాధను అమితాబ్ ఎదుట వ్యక్తీకరించారు. అందుకు అమితాబ్ తనూ చిన్నతనంలో అటువంటి వెలితిని ఎదుర్కొన్నట్లు ప్రపంచానికి చాటారు. అదేమిటంటే కేవలం రూ.2 లేక స్కూల్ క్రికెట్ టీంలో ఆడలేకపోయిన సంగతిని చెప్పారు. క్రికెట్ ఆడతానని తన తల్లి తేజి బచ్చన్ ను అమితాబ్ అడగ్గా అందుకు ఆమె నిరాకరించారట. అప్పటికే అమితాబ్ తండ్రి హరివంశరాయ్ బచ్చన్ ప్రఖ్యాత కవిగా పేరొందారు. చిన్నతనంలో అందరిలాగానే అమితాబ్ బాధలు, ఆనందాలు చవిచూశారు. యుక్త వయసుకు వచ్చాక సినిమాల్లో నటించాలనే కోరిక కల్గింది. కుటుంబ పరిచయంతో అప్పటి ప్రధాని స్వర్గీయ ఇందిరాగాంధీ దగ్గరకు వెళ్లి సిఫార్సు లేఖ రాయించుకుని అమితాబ్ బాలీవుడ్ లో అరంగేట్రం చేశారు. పడుతూ లేస్తూనే.. ఆ పరిశ్రమలో నిలదొక్కుకుని అదే బాలీవుడ్ లో షెహన్ షాగా ఎదిగారు. ఫ్రెంచ్ డైరెక్టర్ ఫ్రాంకోయిస్ ట్రఫౌట్ అమితాబ్ ను ఉద్దేశించి మాట్లాడుతూ `అతనే ఓ పరిశ్రమ`(ఇండస్ట్రీ) గా ప్రశంసించాడు. జీవితంలో తన విజయం వెనుక ఒక్కరు కాదు ఇద్దరు మహిళలున్నారంటారు అమితాబ్. ఒకరు తనతల్లి కాగా రెండు తన భార్య జయబాదురిగా బిగ్ బీ పేర్కొన్నారు. ఇటీవల తల్లి జయంతి సందర్భంగా తన నివాసభవన సముదాయం ప్రతీక్షాలో గుల్మొహర్ మొక్కను ఆమె జ్ఞాపకార్థం నాటారు. ఇంతకు ముందు అదే చెట్టు అక్కడ ఉండేదని అది కూలినచోటనే మరో మొక్కను తిరిగి నాటినట్లు అమితాబ్ తెలిపారు. తల్లి అంటే జ్ఞాపకం కాదని ఆరాధ్య దైవంగా ఆయన అభివర్ణించారు.