వైట్
హౌస్ కి తిరిగొచ్చేసిన ట్రంప్
కరోనా
బారిన పడి నాలుగురోజులుగా వాల్టర్ రీడ్ మెడికల్ సెంటర్ (సైనిక ఆసుపత్రి)లో
చికిత్స పొందుతున్న అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ సోమవారం శ్వేత సౌధానికి
తిరిగి వచ్చేశారు. ఆయన భార్య దేశ ప్రథమ పౌరురాలు మెలానియా వైట్ హౌస్ లోనే కరోనా
చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. ట్రంప్‌నకు కోవిడ్-19 నిర్ధారణ కావడంతో అత్యవసరంగా ఆయనను వాల్టర్ రీడ్ కు తరలించి చికిత్స అందించారు. తొలుత ట్రంప్ పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు వార్తలు వెలువడ్డాయి. అయితే ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగానే ఆయనను సైనిక ఆసుపత్రికి తరలించి అన్ని రకాల వైద్య పరీక్షలు నిర్వహించారు. ప్రస్తుతం ట్రంప్ ఆరోగ్య పరిస్థితి సాధారణ స్థాయికి వచ్చింది. గడిచిన 72 గంటలుగా ఆయనకు జ్వరం లేకపోవడం,
రక్తంలో ఆక్సిజన్ స్థాయులు సాధారణంగా ఉండడంతో డాక్టర్లు ఆయనను వైట్
హౌస్ కు తిరిగి పంపడానికి అంగీకరించినట్లు సమాచారం. అయితే ట్రంప్ ఊపిరితిత్తులపై
వైరస్ ప్రభావం ఏమేరకు ఉంది? తాజా నిర్ధారణ పరీక్షల్లో
అధ్యక్షుడికి నెగెటివ్ వచ్చిందా? లేదా? అనే అంశాలు ఇంకా వెల్లడికాలేదు.
ట్రంప్‌నకు ఆస్పత్రిలో మాత్రం రెండుసార్లు అత్యవసరంగా ఆక్సిజన్ అందజేసినట్లు
తెలుస్తోంది. వాల్టర్ రీడ్ ఆస్పత్రి నుంచి సర్జికల్ మాస్క్ ధరించిన ట్రంప్ విజయ సంకేతం చూపుతూ బయటకు వస్తున్న వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. ఈ
సందర్భంగా మీడియా ప్రతినిధులు ప్రశ్నల
నుంచి ట్రంప్ తెలివిగా తప్పించుకుని ముందుకు వెళ్లిపోయారు. అనంతరం ఆయన ట్విట్టర్‌లో
తన ఆరోగ్య పరిస్థితి గురించి తెలిపారు. 20 ఏళ్ల క్రితం కంటే
తను ప్రస్తుతం చాలా బాగున్నానంటూ ట్రంప్ పోస్టు చేశారు. నిజంగా నా ఆరోగ్యం చాలా
బాగుంది అని వ్యాఖ్యానించారు. ‘కోవిడ్-19కు భయపడవద్దు.. మీ జీవితంపై ఆధిపత్యం చలాయించే అవకాశం ఇవ్వొద్దు.. మనం
మంచి ఔషధాలు అభివృద్ధి, విజ్ఞానం సాధించాం..` అని ఆయన ట్వీట్ లో పేర్కొన్నారు. అయితే ట్రంప్ ఇంకా పూర్తిగా కోలుకుని
ఉండకపోవచ్చు అని వైట్ హౌస్ వైద్యుడు డాక్టర్ సీన్ పి. కాన్లే తెలిపారు.
No comments:
Post a Comment