Sunday, March 22, 2020

The law has already passed orders for the prevention of corona in Telangana

తెలంగాణలో కరోనాపై కొనసాగుతున్న యుద్ధం
దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారిపై కొనసాగుతున్న యుద్ధంలో తెలంగాణ ముందువరుసలో నిలుస్తోంది. తెలంగాణ  ప్రభుత్వం కరోనా వైరస్ నియంత్రణకు సరికొత్త నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో కేసీఆర్ సర్కార్ అంటువ్యాధుల నివారణ చట్టం అమలులోకి తెచ్చింది. ఈ మేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ అత్యవసర ఉత్తర్వుల్ని జారీ చేసింది. ప్రధాని మోదీ పిలుపునకు మద్దతుగా ఆదివారం జనతా కర్ఫ్యూ చేపట్టాలని సీఎం కేసీఆర్ కోరిన సంగతి తెలిసిందే. ఈ బంద్ మంది కోసం కాదు మన కోసం.. కర్ఫ్యూను పాటిద్దాం.. అందరం ఇళ్లకే పరిమితమవుదామని కేసీఆర్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. కరోనా చాలా స్వాభిమానం గల వైరస్.. దాన్ని మనం ఆహ్వానిస్తేనే మనదగ్గరకు వస్తుంది.. అందువల్ల దాన్ని మనదరి చేరనీయకుండా శుభ్రత, సామాజిక దూరం పాటిస్తూ పారదోలుదామన్నారు. అంతేగాక తెలంగాణలో 24 గంటల స్వచ్ఛంద కర్ఫ్యూ పాటించి దేశానికే ఆదర్శంగా నిలుద్దామని కేసీఆర్ విన్నవించారు. పీఎం, సీఎం పిలుపుల నేపథ్యంలో భాగ్యనగరంతో సహా యావత్ రాష్ట్రంలో ప్రజలు స్వీయ గృహ నిర్బంధాన్ని పాటిస్తున్నారు. ఆదివారం ఉదయం 6 గంటల నుంచి సోమవారం ఉదయం 6 గంటల వరకు జనతా కర్ఫ్యూ నిరాటంకంగా కొనసాగుతోంది. అత్యవసర సేవలకు సంబంధించి టీఎస్ సర్కార్ పటిష్టమైన ఏర్పాట్లు చేసింది. రాష్ట్ర సరిహద్దుల్ని మూసివేశారు. ఏపీ-తెలంగాణ సరిహద్దుల్లో తనిఖీలు ముమ్మరంగా సాగుతున్నాయి. మహారాష్ట్ర నుంచి వాహనాలు రాకుండా పోలీసులు చెక్‌పోస్టులను ఏర్పాటు చేశారు. మెదక్ జిల్లా జహీరాబాద్ శివారులోని మాడ్గి అంతర్ రాష్ట్ర చెక్ పోస్టు దగ్గర ముంబయి నుంచి వస్తున్న ప్రైవేటు ట్రావెల్స్ బస్సును పోలీసులు అడ్డుకున్నారు. మొత్తం 37 మంది ప్రయాణికులు ఖతర్ నుంచి ముంబయి వచ్చారు. అక్కడ నుంచి వారి ఏజెంట్ ద్వారా బస్సులో హైదరాబాద్ బయలుదేరారు. ఈ బస్సు రాజధానికి చేరుకుంటుండగా సమాచారం అందుకున్న పోలీసులు రంగంలోకి దిగి సరిహద్దుల్లోనే నిలిపివేశారు. కాగా నగరంలో మంగళ్‌హాట్‌కు చెందిన కరోనా బాధితుణ్ని పోలీసులు నాంపల్లి రైల్వే స్టేషన్ లో పట్టుకున్నారు. తోటి ప్రయాణికుడు ఇచ్చిన సమాచారం ప్రకారం అతణ్ని పట్టుకున్న పోలీసులు గాంధీ ఆసుపత్రికి తరలించారు. సదరు వ్యక్తి ముంబయి ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణిస్తూ నాంపల్లి చేరుకున్నాడు. అతని చేతిపై మహారాష్ట సర్కార్ (కరోనా పీడితుడిగా) వేసిన ముద్రను బట్టి సహ ప్రయాణికుడు పోలీసులకు సమాచారం అందించాడు.

Friday, March 20, 2020

BCCI hints MSD will be back again 100%

భారత జట్టులోకి మళ్లీ ధోనీ!
ఆటపైనే కాదు.. భారత క్రికెట్ నియంత్రణా మండలి (బీసీసీఐ) పైనా మాజీ కెప్టెన్ ఝార్కండ్ డైనమేట్ మహేంద్రసింగ్ ధోనీ పట్టు చెక్కుచెదరలేదు. మళ్లీ టీమిండియాలోకి అతని రీఎంట్రీ ఖాయంలా కనిపిస్తోంది. చాలా కాలం తర్వాత ధోనీ ఫొటోని బీసీసీఐ మళ్లీ తన ట్విట్టర్ అకౌంట్లో పోస్టు చేయడంతో అభిమానుల సంతోషానికి అవధులు లేకుండా పోయింది. ధోనీ రీఎంట్రీ గ్యారంటీ అని క్రికెట్ అభిమానులు భావిస్తున్నారు. దాదాపు ఎనిమిది నెలలుగా తనకు ప్రాణప్రదమైన క్రికెట్ కు మిస్టర్ కూల్ ధోనీ దూరమయ్యాడు. గడిచిన ప్రపంచకప్ తర్వాత అతను మైదానంలోకి దిగింది లేదు. అయితే ధోనీ మళ్లీ భారత జట్టులోకి రావాలంటే ఐపీఎల్ 2020 సీజన్లో కనబర్చే ఫామ్ ను బట్టి చోటివ్వాలని తొలుత సెలక్టర్లు ఆలోచించారు. హెడ్ కోచ్ రవిశాస్త్రి కూడా ఇదే విషయాన్ని అనేక సందర్భాల్లో చెప్పాడు. కానీ ఇప్పుడు ఐపీఎల్ 2020 సీజన్వాయిదా పడిన నేపథ్యంలో బీసీసీఐ పునరాలోచించింది. ఆస్ట్రేలియా గడ్డపై ఏడాది అక్టోబరులో టీ-20 వరల్డ్కప్ జరగనుండగా అప్పటిలోగా టీమిండియాలోకి రీఎంట్రీ ఇవ్వాలన్న ధోనీ ఆశలను బీసీసీఐ సజీవంగా ఉంచదలిచింది. అందులో భాగంగా అధికారిక సైట్ లో ధోనీ పాత ఫొటోలను పెట్టిందనుకోవచ్చు. అంతర్జాతీయ క్రికెట్ లో చివరి వరకు అన్ని సీజన్లలో ధోనీ సత్తా చాటాడు. అతనిలో మునపటి చేవకు ఢోకా లేదని భావించిన బీసీసీఐ `ఒక్క చాన్స్` మళ్లీ ఇచ్చేందుకే సమాయత్తమవుతున్నట్లు ప్రస్తుత పరిణామాల బట్టి స్పష్టమౌతోంది.

Thursday, March 19, 2020

PM appeals `Janata Curfew` on 22 march sunday till morning 7 to night 9

కరోనాపై యుద్ధానికి మోదీ పిలుపు
కోవిడ్-19 మహమ్మారిపై యుద్ధానికి భారత ప్రధాని మోదీ పిలుపు ఇచ్చారు. గురువారం రాత్రి ఆయన జాతినుద్దేశించి టీవీలో ప్రసంగించారు. ఈ ఆదివారం మార్చి 22న ఉదయం 7 నుంచి రాత్రి 9 వరకు దేశ ప్రజలందరూ స్వచ్ఛంద కర్ఫ్యూ పాటించాలని విన్నవించారు. ఈ నెల 31 వరకు ఇళ్ల నుంచి బయటకు రావడానికి ఒకటికి రెండుసార్లు ఆలోచించాలని ప్రజల్ని కోరారు. కరోనాకు మందులేదని, వ్యాక్సిన్ కూడా ఇంకా అందుబాటులోకి రాలేదనే విషయాన్ని గుర్తు చేశారు. జనం గుమిగూడవద్దని, జన సమూహాలున్న ప్రాంతాలకు వెళ్లరాదని కోరారు. అందరూ వర్క్ ఫ్రం హోం చేసుకోవాలన్నారు. నిత్యావసరాల కోసం బాధ పడొద్దని వాటిని ఇళ్లకే పంపుతామని భరోసా ఇచ్చారు. కోవిడ్ టాస్క్ ఫోర్స్ ను ఏర్పాటు చేశామని ప్రధాని చెప్పారు. కరోనా వైరస్ కు భయపడాల్సిన పని లేదని అయితే అజాగ్రత్త వహించరాదన్నారు. వాస్తవానికి యావత్ ప్రపంచం థర్డ్ వరల్డ్ వార్ ముంగిట నిలిచిందని చెప్పారు. వేగంగా ప్రగతి పథాన పయనిస్తున్న భారత్ కు కరోనా తీరని ఆటంకంగా నిలిచిందని ఆవేదన వ్యక్తం చేశారు. వైద్య, పరిశుభ్రతా సిబ్బంది సేవలు వెలకట్టలేనివని ప్రధాని ప్రశంసించారు. కరోనా కట్టడికి చేస్తున్న యుద్ధంలో సమష్టిగా పోరాడాలని పిలుపుఇచ్చారు. తద్వారా రానున్న రోజుల్లో ఈ రాకసిపై భారత్ తప్పనిసరిగా విజయం సాధిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

Wednesday, March 18, 2020

Corona Affect: All movie theaters bandh in East Godavari

20 నుంచి తూ.గో.లో సినిమా హాళ్ల బంద్
కోవిడ్-19 ఎఫెక్ట్ సినిమా లవర్స్ ఎక్కువగా ఉండే ఏపీలోని తూర్పుగోదావరి జిల్లాను తాకింది.  కరోనా ప్రభావంతో జిల్లాలో థియేటర్లు మూతపడనున్నాయి. విషయాన్ని ఈస్ట్ గోదావరి ఫిల్మ్ డిస్ట్రిబ్యూటర్స్ అండ్ ఎగ్జిబిటర్స్ అసోషియేషన్  అధికారికంగా ప్రకటించింది. ఇప్పటికే తెలంగాణలో సినిమా హాళ్లన్నీ మూతపడ్డాయి. ఈనెల 31 వరకూ థియేటర్లతో పాటు విద్యాసంస్థలు, షాపింగ్ మాల్స్ మూసివేశారు. మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న `ఆచార్య` మొదలు చిన్న, పెద్ద సినిమాల షూటింగ్లు రద్దయ్యాయి. విడుదలైన సినిమాలకు కోట్లలో నష్టం జరగ్గా  నెలలో విడుదల కావాల్సిన సినిమాలు ఒక్కొక్కటిగా వాయిదా పడుతున్నాయికరోనా అంతకంతకూ వ్యాప్తి చెందుతుండడంతో ప్రజా ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని తూర్పుగోదావరి జిల్లాలో శుక్రవారం (20 తేదీ) నుంచి జిల్లా వ్యాప్తంగా అన్ని థియేటర్ల మూసివేయనున్నారునెల్లూరులో కరోనా కలకలం రేగడంతో ఇప్పటికే అక్కడ సినిమా హాళ్లన్నీ బంద్ ప్రకటించాయి. మరికొన్ని జిల్లాల్లో స్వచ్ఛందంగానే థియేటర్లను మూసేస్తున్నారుపెద్ద సంఖ్యలో జనసమూహాలు గుమిగూడే ప్రాంతాల్లో అత్యంత వేగంగా కరోనా ప్రబలుతోందని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ స్పష్టమైన హెచ్చరికలు చేసిన సంగతి తెలిసిందే. తూర్పుగోదావరి జిల్లాలో తీసుకున్న తాజా నిర్ణయం ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా థియేటర్ల స్వచ్ఛంద బంద్ కు దారితీసే అవకాశం ఉంది. ఇక తెలంగాణతో పాటు కేరళ, ఢిల్లీ, మహారాష్ట్ర, గుజరాత్, సిక్కిం, ఉత్తరప్రదేశ్, కర్ణాటక ప్రభుత్వాలు ఇప్పటికే  అధికారికంగా బంద్ ప్రకటించాయి.