తెలంగాణలో
కరోనాపై కొనసాగుతున్న యుద్ధం
దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారిపై కొనసాగుతున్న యుద్ధంలో
తెలంగాణ ముందువరుసలో నిలుస్తోంది. తెలంగాణ
ప్రభుత్వం కరోనా వైరస్ నియంత్రణకు సరికొత్త నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో
కేసీఆర్ సర్కార్ అంటువ్యాధుల నివారణ చట్టం అమలులోకి తెచ్చింది. ఈ మేరకు రాష్ట్ర
వైద్య ఆరోగ్య శాఖ అత్యవసర ఉత్తర్వుల్ని జారీ చేసింది. ప్రధాని మోదీ పిలుపునకు
మద్దతుగా ఆదివారం జనతా కర్ఫ్యూ చేపట్టాలని సీఎం కేసీఆర్ కోరిన సంగతి తెలిసిందే. ఈ
బంద్ మంది కోసం కాదు మన కోసం.. కర్ఫ్యూను పాటిద్దాం.. అందరం ఇళ్లకే పరిమితమవుదామని
కేసీఆర్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. కరోనా చాలా స్వాభిమానం గల వైరస్.. దాన్ని మనం
ఆహ్వానిస్తేనే మనదగ్గరకు వస్తుంది.. అందువల్ల దాన్ని మనదరి చేరనీయకుండా శుభ్రత, సామాజిక దూరం పాటిస్తూ
పారదోలుదామన్నారు. అంతేగాక తెలంగాణలో 24 గంటల స్వచ్ఛంద కర్ఫ్యూ పాటించి
దేశానికే ఆదర్శంగా నిలుద్దామని కేసీఆర్ విన్నవించారు. పీఎం, సీఎం పిలుపుల నేపథ్యంలో భాగ్యనగరంతో
సహా యావత్ రాష్ట్రంలో ప్రజలు స్వీయ గృహ నిర్బంధాన్ని పాటిస్తున్నారు. ఆదివారం ఉదయం
6 గంటల నుంచి సోమవారం ఉదయం
6 గంటల వరకు జనతా కర్ఫ్యూ
నిరాటంకంగా కొనసాగుతోంది. అత్యవసర సేవలకు సంబంధించి టీఎస్ సర్కార్ పటిష్టమైన
ఏర్పాట్లు చేసింది. రాష్ట్ర సరిహద్దుల్ని మూసివేశారు. ఏపీ-తెలంగాణ సరిహద్దుల్లో
తనిఖీలు ముమ్మరంగా సాగుతున్నాయి. మహారాష్ట్ర నుంచి వాహనాలు రాకుండా పోలీసులు చెక్‌పోస్టులను
ఏర్పాటు చేశారు. మెదక్ జిల్లా జహీరాబాద్ శివారులోని మాడ్గి అంతర్ రాష్ట్ర చెక్
పోస్టు దగ్గర ముంబయి నుంచి వస్తున్న ప్రైవేటు ట్రావెల్స్ బస్సును పోలీసులు
అడ్డుకున్నారు. మొత్తం 37 మంది ప్రయాణికులు ఖతర్
నుంచి ముంబయి వచ్చారు. అక్కడ నుంచి వారి ఏజెంట్ ద్వారా బస్సులో హైదరాబాద్
బయలుదేరారు. ఈ బస్సు రాజధానికి చేరుకుంటుండగా సమాచారం అందుకున్న పోలీసులు
రంగంలోకి దిగి సరిహద్దుల్లోనే నిలిపివేశారు. కాగా నగరంలో మంగళ్‌హాట్‌కు చెందిన
కరోనా బాధితుణ్ని పోలీసులు నాంపల్లి రైల్వే స్టేషన్ లో పట్టుకున్నారు. తోటి
ప్రయాణికుడు ఇచ్చిన సమాచారం ప్రకారం అతణ్ని పట్టుకున్న పోలీసులు గాంధీ ఆసుపత్రికి
తరలించారు. సదరు వ్యక్తి ముంబయి ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణిస్తూ నాంపల్లి
చేరుకున్నాడు. అతని చేతిపై మహారాష్ట సర్కార్ (కరోనా పీడితుడిగా) వేసిన ముద్రను
బట్టి సహ ప్రయాణికుడు పోలీసులకు సమాచారం అందించాడు.
No comments:
Post a Comment