భారత జట్టులోకి మళ్లీ ధోనీ!
ఆటపైనే కాదు.. భారత క్రికెట్ నియంత్రణా మండలి (బీసీసీఐ) పైనా మాజీ కెప్టెన్ ఝార్కండ్ డైనమేట్ మహేంద్రసింగ్ ధోనీ పట్టు చెక్కుచెదరలేదు. మళ్లీ టీమిండియాలోకి అతని రీఎంట్రీ ఖాయంలా కనిపిస్తోంది. చాలా కాలం తర్వాత ధోనీ ఫొటోని బీసీసీఐ మళ్లీ తన ట్విట్టర్ అకౌంట్ లో పోస్టు చేయడంతో అభిమానుల సంతోషానికి అవధులు లేకుండా పోయింది. ధోనీ రీఎంట్రీ గ్యారంటీ అని క్రికెట్ అభిమానులు భావిస్తున్నారు. దాదాపు ఎనిమిది నెలలుగా తనకు ప్రాణప్రదమైన క్రికెట్ కు మిస్టర్ కూల్ ధోనీ దూరమయ్యాడు. గడిచిన ప్రపంచకప్ తర్వాత అతను మైదానంలోకి దిగింది లేదు. అయితే ధోనీ మళ్లీ భారత జట్టులోకి రావాలంటే ఐపీఎల్ 2020 సీజన్లో కనబర్చే ఫామ్ ను బట్టి చోటివ్వాలని తొలుత సెలక్టర్లు ఆలోచించారు. హెడ్ కోచ్ రవిశాస్త్రి కూడా ఇదే విషయాన్ని అనేక సందర్భాల్లో చెప్పాడు. కానీ ఇప్పుడు ఐపీఎల్ 2020 సీజన్ వాయిదా పడిన నేపథ్యంలో బీసీసీఐ పునరాలోచించింది. ఆస్ట్రేలియా గడ్డపై ఈ ఏడాది అక్టోబరులో టీ-20 వరల్డ్కప్ జరగనుండగా అప్పటిలోగా టీమిండియాలోకి రీఎంట్రీ ఇవ్వాలన్న ధోనీ ఆశలను బీసీసీఐ సజీవంగా ఉంచదలిచింది. అందులో భాగంగా అధికారిక సైట్ లో ధోనీ పాత ఫొటోలను పెట్టిందనుకోవచ్చు. అంతర్జాతీయ క్రికెట్ లో చివరి వరకు అన్ని సీజన్లలో ధోనీ సత్తా చాటాడు. అతనిలో మునపటి చేవకు ఢోకా లేదని భావించిన బీసీసీఐ `ఒక్క చాన్స్` మళ్లీ ఇచ్చేందుకే సమాయత్తమవుతున్నట్లు ప్రస్తుత పరిణామాల బట్టి స్పష్టమౌతోంది.
No comments:
Post a Comment