ఏపీ అసెంబ్లీలో బాలకృష్ణ కొత్త
లుక్
హిందూపురం
ఎమ్మెల్యే తెలుగుదేశం నాయకుడు నందమూరి బాలకృష్ణ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో కొత్త
లుక్ లో దర్శనమిచ్చారు. సోమవారం అసెంబ్లీ ప్రత్యేక
సమావేశాల్లో పరిపాలన వికేంద్రీకరణ, సీఆర్ డీఏ బిల్లులను ప్రవేశపెట్టిన సందర్భంగా
ప్రతిపక్ష బెంచీల్లో ఆశీనులైన బాలయ్య బారు మీసాలు, గుండు, నెరిసిన గడ్డంతో
కనిపించారు. సహచర శాసనసభ్యులే గుర్తు పట్టలేని విధంగా తెల్ల చొక్కా, ప్యాంట్
ధరించిన ఆయన పూర్తి సరికొత్త గెటప్ లో సమావేశాలకు హాజరయ్యారు. బాలయ్య ఈ గెటప్ లో
కనిపించడం ఇదే ప్రథమం. దాంతో ఆయన ప్రస్తుత గెటప్ లోని ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అయింది.
ఇటీవల ఎస్.ఎ.రాజ్ కుమార్ దర్శకత్వంలో వచ్చిన `రూరల్` సినిమాతో ఆయన ప్రేక్షకుల్ని
ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో బాలయ్య ఫ్రెంచ్ కట్ గడ్డంతో యువకుడిలా
కనిపించి అలరించారు. అందుకు భిన్నంగా ప్రస్తుతం పూర్తి స్థాయి రాజకీయ నాయకుడిలా
వైట్ అండ్ వైట్ డ్రస్, గుండుతో ఆయన దర్శనమివ్వడం చర్చనీయాంశం అయింది. ఆదివారం
మంగళగిరి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగిన టీడీఎల్పీ సమావేశానికి ఆయన ఇదే
గెటప్ లో హాజరవ్వడంతో తెలుగుదేశం నాయకులూ సంభ్రమాశ్చర్యాలకు గురయ్యారు. ఇదిలావుండగా
తాజాగా ఆయన తన ఆస్థాన దర్శకుడు బోయపాటి శ్రీను చిత్రంలో నటిస్తున్నారు. గతంలో వీరి
కాంబినేషన్ లో వచ్చిన సింహా, లెజెండ్ చిత్రాలు సూపర్ హిట్ అయ్యాయి. హ్యాట్రిక్ కోసం
వీరి ప్రస్తుత చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.