Thursday, September 12, 2019

It`s time to go to the people, says Sonia: Congress plans agitation in October on economic slowdown


`కాషాయి` పాలనను ఎండగట్టే సమయమొచ్చింది: సోనియా
కాషాయ దళపతి నరేంద్రమోదీ లోపభూయిష్ఠ పాలనపై దండెత్తాల్సిన సమయమొచ్చిందని కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. గురువారం ఢిల్లీలోని కాంగ్రెస్ ప్రధాన కార్యాలయంలో పార్టీ నాయకులతో ఆమె భేటీ అయ్యారు. ముఖ్యంగా దేశంలో ఆర్థికవ్యవస్థ తిరోగమనం బాట పట్టడానికి ప్రధాని మోదీ ప్రభుత్వ వైఫల్యమే కారణమన్న విషయాన్ని జనంలోకి తీసుకెళ్లాల్సి ఉందని సోనియా పేర్కొన్నారు. ఎన్డీయే సర్కార్ వైఖరి వల్లే ఆర్థిక మాంద్యం నెలకొందనే అంశాన్ని ప్రజలకు తెలియచెబుతూ వచ్చే నెల అక్టోబర్ నుంచి దేశవ్యాప్తంగా పెద్దఎత్తున నిరసన ఉద్యమాల్ని ప్రారంభించాలని సూచించారు. మోదీ సర్కార్ ప్రజాస్వామ్యాన్ని కాలరాస్తోందని ఈ సందర్భంగా సోనియా ఘాటుగా విమర్శించారు. సార్వత్రిక ఎన్నికల్లో ఓటర్ల ఆమోదాన్ని మోదీ ప్రభుత్వం దుర్వినియోగం చేస్తోందని ఆరోపించారు. మోదీ కేబినెట్ 100 రోజుల పాలన శూన్యమని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ ఇదివరకే పెదవి విరిచారు. ఇంతకుముందు ప్రియాంక గాంధీ కూడా మోదీ అనుసరిస్తున్న ఆర్థికవిధానాలు దేశానికి చేటు తెస్తున్నాయని పేర్కొన్న సంగతి తెలిసిందే. ఈరోజు కాంగ్రెస్ కీలక సమావేశానికి మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, ఏఐసీసీ ప్రధానకార్యదర్శులు, ఆయా రాష్ట్రాల ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీల అధ్యక్షులు, సీఎల్పీ నాయకులు తదితరులు హాజరయ్యారు. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ నిర్వహించ తలపెట్టిన `మహాత్మాగాంధీ 150వ జయంత్యుత్సవాలు` ఏర్పాట్ల గురించి తాజా భేటీలో నాయకులు చర్చించారు.

Wednesday, September 11, 2019

BJP protest against Mamata govt over power tariff hike in Kolkata


పశ్చిమబెంగాల్ లో విద్యుత్ ఛార్జీల పెంపు సెగ

పశ్చిమబెంగాల్ లో విద్యుత్ ఛార్జీల పెంపుపై భగ్గుమన్న భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు బుధవారం తీవ్రస్థాయిలో ఆందోళనకు దిగారు. వందల మంది బీజేపీ కార్యకర్తలు పెంచిన విద్యుత్ ఛార్జీలు తగ్గించాలని కోరుతూ రోడ్డెక్కారు. రాజధాని కోల్ కతాలోని సెంట్రల్ అవెన్యూ, ఎస్పానాడే తదితర ప్రధాన కూడళ్లలో చొచ్చుకువస్తున్న బీజేపీ కార్యకర్తలను అడ్డుకోవడానికి పోలీసులు జల పిరంగులు (వాటర్ కెనాన్) వినియోగించాల్సి వచ్చింది. పోలీసుల వలయాన్ని తప్పించుకుని ముందుకు చొచ్చుకువచ్చే క్రమంలో అయిదుగురు కార్యకర్తలు తీవ్ర గాయాలపాలయ్యారు. వీరిని కోలకతా మెడికల్ కాలేజీ, విషుదానంద ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. నిరసన ర్యాలీ నిర్వహిస్తున్న బీజేపీ రాష్ట్ర ప్రధానకార్యదర్శి రాజు బెనర్జీ, సయాతన్ బసు, బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడు దేబ్జిత్ సర్కార్ సహా వందమంది కార్యకర్తల్ని పోలీసులు అరెస్ట్ చేశారు. రానున్న ఏడాదిలో రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరగవచ్చని భావిస్తున్న తరుణంలో బీజేపీ తన ఆధిపత్యాన్ని ప్రదర్శించేందుకు సిద్ధమౌతోంది. ఈ విద్యుత్ ఛార్జీల పెంపుపై ఉద్యమాన్ని బీజేపీ ఓ అస్త్రంగా మలుచుకుని మమతా సర్కార్ పై ఎదురుదాడికి దిగుతున్నట్లు కనిపిస్తోంది. ప్రజలకు విద్యుత్  నిత్యావసర  సాధనం కావడంతో అదే ప్రధాన అజెండాగా వారితో మమేకం అయ్యేందుకు బీజేపీ పావులు కదుపుతోంది. గడిచిన సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ రాష్ట్రంలో 18 ఎంపీ సీట్లను గెలుచుకుని ఊపుమీద కనిపిస్తున్న సంగతి తెలిసిందే.
పశ్చిమబెంగాల్ లో తృణమూల్ కాంగ్రెస్ సర్కార్ అసంబద్ధ విద్యుత్ విధానం అమలు చేస్తోందని బీజేపీ ఆరోపిస్తోంది. సెంట్రల్ ఎలక్ట్రిసిటి రెగ్యులేటరీ కమిషన్ (సీఈఎస్సీ) యూనిట్ విద్యుత్ రూ.4.26కు కొనుగోలు చేసి వినియోగదారుల నుంచి రూ.7.33 (తొలి 100 యూనిట్లు) చొప్పున ఛార్జీలు వసూలు చేయడాన్ని బీజేపీ తప్పుబడుతోంది. గ్లోబల్ టెండర్ల ద్వారా విద్యుత్ కొనుగోలు ప్రక్రియ చేపట్టినట్లయితే వినియోగదారులు తమకు ఆమోదయోగ్యమైన ధరకు విద్యుత్ ను పొందగల్గుతారని ఆ పార్టీ మమతా సర్కార్ కు సూచిస్తోంది.

Tuesday, September 10, 2019

Free helmets to offenders, roses for law-abiding persons


భువనేశ్వర్ లో వాహనచోదకులకు ఉచితంగా శిరస్త్రాణాలు
భువనేశ్వర్ పరిసరాల్లోని కొత్త మోటారు వాహనాల చట్టంపై పోలీసులు మంగళవారం అవగాహన కార్యక్రమం ప్రారంభించారు. శిరస్త్రాణం లేని ద్విచక్ర వాహనదారులకు ఇక్కడ పోలీసులు జరిమానాలకు బదులు ఫ్రీగా హెల్మెట్లు అందిస్తున్నారు. స్థానిక కల్పనా స్క్వేర్ లో మంగళవారం ఈ కార్యక్రమంలో స్వయంగా పోలీస్ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. జంట నగరమైన కటక్ లోనూ పోలీసుశాఖ ఈ స్పెషల్ డ్రైవ్ కు శ్రీకారం చుట్టింది. కొత్త మోటారు వాహనాల చట్టం-2019 సెప్టెంబర్ 1 నుంచి అమలులోకి వచ్చిన సంగతి తెలిసిందే. కొత్త చట్టం అమల్లోకి వచ్చిన తరువాత ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వారికి భారీ జరిమానాలు విధించడంపై ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయంలో నిబంధనల్ని మరో మూణ్నెల్లు దూకుడుగా అమలు చేయొద్దని పోలీసుశాఖకు ఆదేశాలు జారీ చేశారు. దాంతో పోలీస్ శాఖ ఇప్పుడు రోడ్లపై విస్తృత అవగాహన కార్యక్రమాలు చేపట్టింది. `ఎం.వి. చట్టం ఆదాయాన్ని సృష్టించే వ్యాపారం కాదు. ప్రజల భద్రతే మా లక్ష్యం` అని డిప్యూటీ పోలీస్ కమిషనర్ (ట్రాఫిక్) సాగరికా నాథ్ అన్నారు. హెల్మెట్ లేని ద్విచక్ర వాహనదారులకు పోలీసు సిబ్బంది ఉచితంగా శిరస్త్రాణాలు ఇస్తున్నట్లు తెలిపారు. అయితే ముందు ఉల్లంఘనదారుల నుంచి రూ. 500 జరిమానా వసూలు చేసి వారికి చలాన్ తో పాటు ఫ్రీగా హెల్మెట్ అందిస్తున్నారు. అయితే డ్రంక్ అండ్ డ్రైవ్, స్పీక్ ఆన్ మొబైల్ విత్ డ్రైవింగ్, రాంగ్ సైడ్ డ్రైవింగ్, ట్రిపుల్ రైడింగ్, విత్ అవుట్ హెల్మెట్, సీట్ బెల్ట్ డ్రైవింగ్, విత్ అవుట్ నెస్సెసరీ డాక్యుమెంట్స్ డ్రైవింగ్ చేయొద్దని వాహనచోదకుల్ని పోలీస్ కమిషనర్ సుధాన్షు సారంగి కోరారు. నిబంధనలు ఉల్లంఘించిన వారికి జరిమానాలు తప్పవని హెచ్చరించారు. నిబంధనలు పాటిస్తున్న వాహనచోదకులకు గులాబీలు చేతికిచ్చి పోలీసులు అభినందించారు. 
బిహార్ లో హెల్మెట్ లేకుండా పట్టుబడితే..
బీహార్‌ లోనూ పోలీస్ శాఖ ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వాహనచోదకులతో వినూత్న రీతిలో స్పందిస్తూ ఆశ్చర్య పరుస్తోంది. మంగళవారం తూర్పు చంపారన్ జిల్లాలోని మోతీహరి పట్టణంలో శిరస్త్రాణం ధరించని బైకర్లను పట్టుకుని దగ్గరుండి వారితో కొనిపించడం కనిపించింది. బీమా పునరుద్ధరణ చేయించని వారితోనూ అక్కడికక్కడే కార్యక్రమం పూర్తి చేయించింది.  ఇందుకు శిరస్త్రాణం అమ్మకందారులు, బీమా పాలసీ ఏజెంట్ల తో ఆయా తనిఖీ కూడళ్లలో స్టాల్స్ ఏర్పాటు చేసింది. ఈ ప్రత్యేక కార్యక్రమాన్ని మోతీహరిలో ఛటౌని పోలీస్ స్టేషన్ ఎస్‌హెచ్‌ఓ ముఖేష్ చంద్ర కున్వర్ ప్రారంభించారు. ఉల్లంఘనదారులకు పోలీసులు జరిమానాలు విధించకపోవడం విశేషం. 1917 లో మహాత్మా గాంధీ చంపారన్ సత్యాగ్రహాన్ని ప్రారంభించిన మోతీహారి చారిత్రక ప్రాముఖ్యత తనకు ప్రేరణనిచ్చిందని ముఖేష్ చంద్ర కున్వర్ పేర్కొన్నారు.

Monday, September 9, 2019

ISRO more serious about fake accounts in social media on behalf of chairman Sivan


ఇస్రో చైర్మన్ శివన్ పేరిట సోషల్ మీడియాలో నకిలీ ఖాతాలు
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) చైర్మన్ కె.శివన్ పేరిట సామాజిక మాధ్యమాల్లో నకిలీ ఖాతాలు హల్ చల్ చేస్తున్నాయి. దాంతో సోమవారం ఇస్రో రంగంలోకి దిగి ఆయనకు సోషల్ మీడియాలో ఎటువంటి వ్యక్తిగత ఖాతా లేదని ప్రకటించింది. ఈ మేరకు ఇస్రో ట్వీట్ చేస్తూ `కైలాస్వాదివు శివన్` పేరిట సోషల్ మీడియాలో చాలా ఖాతాలు నడుస్తున్నట్లు గుర్తించామని పేర్కొంది. ఈ ఖాతాల నుంచి చంద్రయాన్-2 సమాచారం అంటూ అసత్యాలు వెలువడుతున్నాయని వాటిని నమ్మొద్దని కోరింది. చైర్మన్ డాక్టర్ కె. శివన్ కు సోషల్ మీడియాలో వ్యక్తిగత ఖాతా ఒక్కటీ లేదని ఇస్రో ఆ ట్వీట్ లో స్పష్టం చేసింది. చైర్మన్ పేరిట నకిలీ ఖాతాల నుంచి వెల్లడవుతున్న సమాచారం ప్రామాణికం కాదని గమనించాలని కోరింది. ఎట్టి పరిస్థితిలో అబద్ధపు ప్రచారాన్ని నమ్మరాదని ఇస్రో హెచ్చరించింది. చంద్రయాన్-2 మిషన్, చంద్రునిపై లాండర్ విక్రమ్ స్థితిగతులకు సంబంధించిన ఏదైనా నవీకరణ ఇస్రో అధికారిక వెబ్‌సైట్‌లో మాత్రమే ఇవ్వనున్నట్లు ప్రకటించింది.