సిక్కిం, డార్జిలింగ్ కొండ ప్రాంతాల్లో నిలిచిపోయిన
ట్రాఫిక్
ఎడతెగని వర్షాల కారణంగా
సిక్కిం, డార్జిలింగ్ హిల్స్ ప్రాంతాల వాసులకు దేశంలోని ఇతర ప్రాంతాలతో సంబంధాలు
తెగిపోయాయి. ఎక్కడికక్కడ ట్రాఫిక్ స్తంభించిపోయింది. విపరీతంగా కొండ చెరియలు
విరిగి పడుతుండడంతో రోడ్లన్నీ బారులుతీరిన వాహన శ్రేణులతో నిండిపోయాయి. మూడ్రోజులుగా
వర్షాలు విస్తృతంగా కురుస్తుండడంతో డార్జిలింగ్ కొండ ప్రాంతాల్లో రోడ్లపై ఆగకుండా
కొండచెరియలు విరిగిపడుతున్నాయి. దాంతో ఎక్కడ ట్రాఫిక్ ను అక్కడ నిలిపివేశారు.
ఎన్.హెచ్-10 గ్యాంగ్ టాక్ కు వెళ్లే మార్గంలో శుక్రవారం ఉదయం కొద్దిసేపు ట్రాఫిక్
ను అనుమతించినా మళ్లీ నిలిపివేయాల్సి వచ్చింది. శ్వేతిజ్హొర, కలిజ్హొర ల్లోని రోడ్లు
పూర్తిగా కొండచరియలతో నిండిపోయాయి. ఎన్.హెచ్-10 ఎన్.హెచ్-31 జాతీయ రహదారులపై
ఇంకా కుండపోత వానలు కురుస్తున్నాయి. శనివారం పశ్చిమబెంగాల్ లోని తెరాయ్, దూర్స్
ప్రాంతాల్లో వరద పోటెత్తి నివాస ప్రాంతాలు, సాగు భూములు ముంపునకు గురయ్యాయి. డార్జిలింగ్
హిల్స్ పరిధిలో తీస్తా నది పొంగి ప్రవహిస్తుండడంతో మూడ్రోజులుగా సెవొక్ రోడ్డుపై కార్లలో
తరలి వచ్చిన పర్యాటకులు చిక్కుబడిపోయారు. ఈ నదిలో ఓ కారు కొట్టుకుపోయింది. ఈ
ప్రమాదంలో జైపూర్ (రాజస్థాన్) పర్యాటకుడు అమన్ గార్గ్ చనిపోగా మృతదేహం 20
కిలోమీటర్ల దూరంలో తీస్తా ఒడ్డుకు కొట్టుకు వచ్చింది. ఈ కారుతో పాటు అందులో
ప్రయాణిస్తున్న గౌరవ్ శర్మ, డ్రైవర్ రాకేశ్ రాయ్(34) జాడ కోసం సహాయ రక్షకబృందం
వెతుకులాట కొనసాగిస్తోంది. హిమాలయాల
ఈశాన్య ప్రాంతంలోని డార్జిలింగ్, కుర్సెంగ్, కలింపాంగ్, సిలిగురి రోడ్లలో ట్రాఫిక్
అస్తవ్యస్తంగా మారిపోయింది. తీస్తా నదిలో 3,58,690 క్యూసెక్కుల వరద నీటిని దిగువకు
విడుదల చేశారు. ఇంకా నది పొంగి ప్రవహించొచ్చని ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు.